IND Vs BAN: బంగ్లాతో రెండో టెస్టు.. తొలి రోజు భారత్‌దే

భారత్‌, బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా బౌలర్లు రాణించారు. దీంతో బంగ్లా జట్టు స్వల్ప స్కోరుకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. నిలకడగా ఆడింది.

Updated : 22 Dec 2022 17:07 IST

మీర్పూర్‌: బంగ్లాదేశ్‌ (Bangladesh)తో జరుగుతున్న రెండో టెస్టు (Test Match)లో తొలి రోజు టీమ్‌ఇండియా (Team India)కే ఆధిపత్యం దక్కింది. సీనియర్‌ బౌలర్లు రవిచంద్రన్‌ అశ్విన్‌ (Ashwin), ఉమేశ్ యాదవ్ (Umesh Yadav) విజృంభించారు. దీంతో ఒక దశలో 213/5తో పటిష్ఠంగానే కన్పించిన బంగ్లా జట్టు.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మామినుల్‌ హక్(84: 12 ఫోర్లు, ఒక సిక్స్‌) ఒంటరి పోరాటం చేసినా ఇతర ఆటగాళ్లెవరూ సహకరించలేదు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఉమేశ్‌, అశ్విన్‌ చెరో నాలుగు వికెట్లు పడగొట్టగా.. జయదేవ్‌ ఉనద్కత్‌ ఖాతాలో రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌ మొదలుపెట్టిన భారత జట్టు నిలకడగా ఆడింది. ఓపెనర్లు కేఎల్‌ రాహుల్ (3*)‌, శుభ్‌మన్‌ గిల్‌(14*) క్రీజులో ఉన్నారు. మధ్యలో రెండుసార్లు వీరు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెలుతురు లేమి కారణంగా మ్యాచ్‌ను కుదించారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 19 పరుగులతో ఉంది.

బంగ్లాతో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఈ సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను క్వీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. అలా జరిగితేనే టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పోరులో నిలిచేందుకు భారత్‌కు అవకాశాలు మెరుగుపడుతాయి.


మీర్పూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఆతిథ్య జట్టును స్వల్ప స్కోరుకే కట్టడి చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 227 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఆ జట్టులో మామినుల్‌ హక్‌(84: 12 ఫోర్లు, ఒక సిక్స్‌) మినహా ఎవరూ రాణించలేదు. ఓపెనర్‌ నజ్ముల్ హొస్సేన్‌(24), లిటన్‌ దాస్‌ (25), ముష్ఫికర్‌ రహీం (26) ఫర్వాలేదనిపించారు.

ఇక భారత బౌలింగ్‌లో ఉమేశ్‌ యాదవ్‌, అశ్విన్‌ మెరిశారు. 15 ఓవర్లు వేసిన ఉమేశ్‌.. 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 21.5 ఓవర్లు వేసిన అశ్విన్‌.. 71 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. 12 ఏళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన లెఫ్టార్మ్‌ పేసర్‌ జయదేవ్‌ ఉనద్కత్‌ 2 వికెట్లు పడగొట్టాడు.


బంగ్లా జట్టు స్కోరు 200 దాటింది. ఓవైపు వికెట్లు పడుతున్నా మామినుల్‌ హక్‌ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు శతకానికి చేరువయ్యాడు. 67 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా ఆరు వికెట్లు నష్టపోయి 216 పరుగులు చేసింది. క్రీజులో హక్‌(81*), నురుల్‌ హసన్‌ (3*) ఉన్నారు.


రెండో టెస్టులో ఆతిథ్య బంగ్లా జట్టు నిలకడగా ఆడుతోంది. సగం వికెట్లు కోల్పోయినా మామినుల్‌ హక్‌ (65*) జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. టీ విరామ సమయానికి ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. క్రీజులో హక్‌, మెహిది హసన్‌ మిరాజ్‌(4*) ఉన్నారు. భారత బౌలర్లలో జయ్‌దేవ్‌ ఉనద్కత్‌ 2, రవిచంద్రన్‌ అశ్విన్‌ 2 , ఉమేశ్ యాదవ్ ఒక వికెట్‌ పడగొట్టారు.


రెండో టెస్టులో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా జట్టు సగం వికెట్లు కోల్పోయింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లను కోల్పోయిన తర్వాత మామినుల్‌ హక్‌తో కలిసి కెప్టెన్ షకీబ్‌ అల్‌ హసన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే భోజన విరామం తర్వాత తొలి బంతికే షకీబ్‌ను భారత బౌలర్‌ ఉమేశ్ యాదవ్‌ బోల్తా కొట్టించాడు. 29వ ఓవర్‌లో ఉమేశ్ వేసిన తొలి బంతిని భారీ షాట్‌కు యత్నించిన షకీబ్‌(‌16).. మిడాఫ్‌లో పుజారాకు చిక్కాడు. ఆ తర్వాత కాసేపటికి ముష్ఫికర్‌ రహీం, మామినుల్‌ హక్‌ భాగస్వామ్యాన్ని ఉనద్కత్‌ విడగొట్టాడు. 41వ ఓవర్‌ చివరి బంతికి ముష్ఫికర్‌ రహీం(26)ను ఔట్‌ చేశాడు. ఇక, జోరు మీదున్న లిటన్‌ దాస్‌(26)ను అశ్విన్‌ పెవిలియన్‌ను పంపించాడు. దీంతో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న హక్‌(59*).. అర్ధశతకం సాధించాడు. ప్రస్తుతం 50 ఓవర్లు పూర్తయ్యే సరికి బంగ్లా స్కోరు 177/5గా ఉంది.


రెండో టెస్టులో ఆతిథ్య జట్టు నిలకడగా ఆడుతోంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా.. భోజన విరామ సమయానికి 28 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్లు జాకిర్‌ హసన్(15), నజ్ముల్‌ హొస్సేన్‌(24)ను భారత బౌలర్లు జయదేవ్‌ ఉనద్కత్‌, అశ్విన్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌కు పంపించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్‌ షకీబ్‌ అల్ హసన్‌ (16*), మామినుల్‌ హక్‌  (23*) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. 


మీర్‌పూర్‌: సిరీస్‌ ఫలితాన్ని తేల్చే కీలకమైన రెండో టెస్టుకు భారత్‌, బంగ్లాదేశ్‌ జట్లు సిద్ధమయ్యాయి. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ టెస్టులో కుల్‌దీప్‌ యాదవ్‌ స్థానంలో పేసర్‌ ఉనద్కత్‌కు జట్టులో చోటు దక్కింది. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న టీమిండియా రెండో టెస్టులోనూ నెగ్గి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయాలని చూస్తోంది. మరోవైపు రెండో టెస్టులో నెగ్గి సిరీస్‌ను డ్రా చేయాలని బంగ్లా జట్టు కసితో ఉంది.

భారత జట్టు: కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, పుజారా, విరాట్‌ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రిషబ్‌ పంత్‌, అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఉమేశ్‌ యాదవ్‌, సిరాజ్‌

బంగ్లా జట్టు: నజ్ముల్‌ హొస్సేన్‌, జాకిర్‌ హసన్‌, మామినుల్‌ హక్‌, లిటన్‌ దాస్‌, ముష్ఫికర్‌ రహీం, షకిబ్‌ అల్‌ హసన్‌, నురుల్‌ హసన్‌,  మెహదీ హసన్‌ మిరాజ్‌, తజ్ముల్‌ ఇస్లాం, సయ్యద్‌ ఖాలేద్‌ అహ్మద్‌, తస్కిన్‌ అహ్మద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని