Ben Stokes: ఈ బాల్‌ ఎలా ఆడాలి? బుమ్రా దెబ్బకు బ్యాట్‌ కిందపడేసిన బెన్‌స్టోక్స్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా ఓ అద్భుతమైన డెలివరీతో బెన్‌స్టోక్స్‌ని బోల్తా కొట్టించాడు. 

Updated : 04 Feb 2024 13:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వైజాగ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమ్ఇండియా పేసుగుర్రం జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah) దుమ్మురేపుతున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ పతనంలో కీలకపాత్ర పోషించాడు. బుమ్రా దెబ్బకు పర్యటక జట్టు కుదేలై తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్‌లో మన టాప్‌ పేసర్‌ అద్భుతమైన డెలివరీతో అర్ధ శతకం దిశగా సాగుతున్న ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ బెన్‌స్టోక్స్‌ (Ben Stokes) (47)ని పెవిలియన్‌కు పంపాడు.  

బుమ్రా వేసిన ఇన్నింగ్స్‌ 50వ ఓవర్‌లో తొలి బంతిని స్టోక్స్‌ ఎదుర్కొన్నా పరుగులేమీ రాలేదు. రెండో బంతి వేసేటప్పుడు తన బౌలింగ్‌ నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కట్టర్‌ సంధించి స్టోక్స్‌ని బోల్తా కొట్టించాడు. ఆఫ్‌ స్టంప్‌ దిశగా తక్కువ ఎత్తులో వచ్చిన ఆ బంతిని అతడు డిఫెండ్ చేయబోయాడు. కానీ, బంతి మిస్‌ అయి ఆఫ్‌ స్టంప్‌ని పడగొట్టింది. దీంతో స్టోక్స్‌ వెనక్కి తిరిగి చూడకుండా బ్యాట్ కింద పడేసి ‘ఎలా ఆడాలి ఈ బంతిని?’ అన్నట్టుగా నిరాశతో క్రీజును వదిలివెళ్లాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. స్టోక్స్‌ను ఔట్‌ చేయడం ద్వారా బుమ్రా టెస్టుల్లో 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని