Delhi Capitals - IPL 2023: దిల్లీ ఎందుకిలా.. వరుస ఓటములకు కారణాలివేనా..?

దిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals) ఈ సీజన్‌లో వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ ఓటమిపాలైంది. శనివారం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలోనూ ఆ జట్టుకు భంగపాటు తప్పలేదు.

Updated : 16 Apr 2023 16:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : జట్టు మొత్తం దిగ్గజాలు లేనప్పటికీ.. డగౌట్‌లో హేమాహేమీలైన మాజీలు ఉన్నారు. పరిస్థితిని అలవోకగా అంచనా వేయగల సమర్థులు. అంతే బలంగా వాటిని ఫిక్స్‌ చేయగలవారు కూడా. ఇదంతా దిల్లీ క్యాపిటల్స్‌ గురించే. ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా అదరగొడుతున్న దిల్లీ.. ఈసారి ఉసూరుమనిపిస్తోంది. అసలు వార్నర్‌ సేన పరాజయాల వెనుక కారణాలేంటి?

హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్‌ (Ricky Ponting), డైరెక్టర్‌గా సౌరభ్‌ గంగూలీ(Sourav Ganguly) లాంటి దిగ్గజాలు.. కెప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్‌ (David Warner) లాంటి సీనియర్‌ ఆటగాడు ఉన్నప్పటికీ.. ఆ జట్టుకు అదృష్టం కలిసి రావడం లేదు. గత సీజన్లలో వరుసగా ప్లేఆఫ్స్‌ వరకూ చేరి మంచి జట్టుగా పేరు తెచ్చుకున్న దిల్లీ (Delhi Capitals).. ఈ సీజన్‌ (IPL 2023)లో ఇప్పటివరకూ బోణీ కొట్టలేకపోయింది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. తొలి విజయం కోసం పోరాటం చేస్తూనే ఉంది. ఈ ఐపీఎల్‌లో మిగతా జట్లు బోణీ కొట్టి.. పాయింట్ల పట్టికలో ముందుకెళ్తోంటే.. దిల్లీ మాత్రం అన్ని విభాగాల్లో విఫలమవుతూ నైరాశ్యంలో కూరుకుపోయింది. 

వార్నర్‌ ఒక్కడే..

గత ఏడాది చివర్లో రోడ్డు ప్రమాదానికి గురై ఈ ఐపీఎల్‌కు దూరమైన రిషభ్‌ పంత్‌ స్థానంలో డేవిడ్‌ వార్నర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టాడు. అందుకు తగ్గట్టే ప్రతి మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్‌ ఆడుతున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ శతకాలు నమోదు చేశాడు. ఇప్పటివరకూ మొత్తం 228 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో నిలిచాడు. అయితే అతడికి మరో ఎండ్‌ నుంచి ఎలాంటి సహకారం లభించడం లేదు. టాప్‌ ఆర్డర్‌ కుప్పకూలుతుండటంతో వార్నర్‌ ఒక్కడే జట్టును గట్టెక్కించలేకపోతున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ మార్ష్‌ ఇప్పటివరకూ రాణించింది లేదు.

నిరాశపరుస్తున్న పృథ్వీ..

ఇక ఈ సీజన్‌లో ఎన్నో ఆశలు పెట్టుకున్న ఓపెనర్‌ పృథ్వీ షా తీవ్రంగా నిరాశ పరుస్తున్నాడు. రెండు సార్లు డకౌట్‌ అయ్యాడు. మిగతా మ్యాచ్‌ల్లో చేసిన పరుగులు 12, 7, 15 మాత్రమే. ఈ గణాంకాలు చూస్తే అతడి ప్రదర్శన ఎంత దారుణంగా ఉందో తెలుస్తోంది. పదే పదే ఒకరకమైన షాట్లకు ప్రయత్నించి ఔట్‌ అవుతున్నప్పటికీ.. తప్పుల నుంచి ఏ మాత్రం నేర్చుకోవడం లేదు. అతడితో కలిసి ఆడిన సహచర ఆటగాడు శుభ్‌మన్‌ గిల్‌ అన్ని ఫార్మాట్లలో దూసుకుపోతుంటే.. షా ఇంకా ఐపీఎల్‌లోనే ఇబ్బంది పడుతున్నాడు. అతడి ప్రదర్శనపై పలువురు మాజీలు విమర్శలు గుప్పించారు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాలని అతడికి సూచిస్తున్నారు.

అక్షర్‌ రాణిస్తున్నా..

బ్యాటింగ్‌ విభాగంలో వార్నర్‌ తర్వాత కాస్తాకూస్తో రాణిస్తున్నది ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ మాత్రమే. ముంబయిపై అర్ద శతకాన్ని (54) నమోదు చేయగా.. గుజరాత్‌పై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ (36) ఆడాడు. అటు బంతితోనూ రాణిస్తున్నాడు. ఇక మనీశ్‌ పాండే బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో అర్ద శతకం నమోదు చేసినప్పటికీ.. గత మ్యాచ్‌ల్లో పెద్దగా రాణించింది లేదు.

పంత్‌ లేని లోటు..

గత సీజన్లలో దిల్లీ వరుసగా ప్లేఆ ఫ్స్‌కు చేరిందంటే అందులో పంత్‌ పాత్ర కూడా ఉంది. మిడిల్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే పంత్‌.. జట్టుకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. ఇప్పుడు అతడి లేని లోటు జట్టులో స్పష్టంగా కనిపిస్తోంది. అతడి స్థానాన్ని భర్తీ చేసే వారు జట్టులో కరవయ్యారు.

విఫలమవుతున్న బౌలింగ్‌ యూనిట్‌..

ఖలీల్‌ అహ్మద్‌, చేతన్‌ సకారియా, నోకియా, అక్షర్‌, ముస్తాఫిజర్, కుల్దీప్‌ యాదవ్‌ లాంటి వారితో బౌలింగ్‌ దళం పటిష్ఠంగానే కనిపిస్తున్నప్పటికీ.. ప్రత్యర్థి బ్యాటర్లను అడ్డుకోవడంలో విఫలమవుతున్నారు. ధారళంగా పరుగులు సమర్పిస్తూ జట్టును కాపాడలేకపోతున్నారు. పేసర్లకు అనుకూలంగా ఉన్న పిచ్‌లపైనా తేలిపోవడం దిల్లీ ఓటమికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

లోపిస్తున్న వ్యూహాలు..

దిల్లీ ఈ సీజన్‌లో పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తోంది. సరైన ప్రణాళికలతో ముందుకు రావడం లేదు. తమ ప్రణాళికలను అమలు పరచడంలో ఆ జట్టు పూర్తిగా గందరగోళానికి గురవుతోందని మాజీ కెప్టెన్‌ సెహ్వాగ్‌ విమర్శలు గుప్పించాడు. గతంలో జట్టు ప్లేఆప్స్‌ వరకూ చేరేందుకు సహకరించిన పాంటింగ్‌, గంగూలీ.. ఈ సారి ఓటములకు బాధ్యత తీసుకోవాలని సూచించాడు. రాబోయే మ్యాచ్‌ల్లోనైనా సరైన ప్రణాళికలతో ముందుకు వచ్చి విజయాల బాట పట్టాలని కోరుతున్నాడు.

ప్రతి మ్యాచూ కీలకమే..

పది జట్లు ఆడే ఐపీఎల్‌లో ప్రతి మ్యాచ్‌ కీలకమే అన్న సంగతి తెలిసిందే. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లే ప్లే ఆఫ్స్‌కు చేరుతాయి. ఈ నేపథ్యంలో విజయాలతో పాటు నెట్‌ రన్‌రేట్‌ ఎంతో కీలకంగా మారుతుంది. ఇప్పటికే ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న దిల్లీ.. రేసులో నిలవాలంటే.. ఇక నుంచి ప్రతి మ్యాచ్‌లో విజయంతోపాటు మంచి రన్‌రేట్‌ను సాధించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని