Dinesh Karthik: రెండింటిపై ఎప్పటికీ పశ్చాత్తాప పడతా.. కుల్‌దీప్‌తో చాలా కష్టమైంది: దినేశ్‌ కార్తిక్‌

దినేశ్‌ కార్తిక్‌.. లోయర్‌ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే బ్యాటర్. ఐపీఎల్‌లో ఎప్పటికీ విచారం వ్యక్తం చేసే అంశాలపై స్పందించాడు.

Updated : 09 Apr 2024 14:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఒకప్పుడు అత్యుత్తమ ‘ఫినిషర్‌’గా పేరొందిన దినేశ్‌ కార్తిక్‌ మధ్యలో ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడ్డాడు. ఇప్పుడు మరోసారి తన పాత్రకు న్యాయం చేస్తున్నాడు. బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న డీకే డెత్ ఓవర్లలో అదరగొట్టేస్తున్నాడు. ఆ జట్టు బౌలింగ్‌ లేమి వల్ల ఓడినప్పటికీ కార్తిక్ మాత్రం అకట్టుకుంటున్నాడు. గతంలో అతడు కోల్‌కతాకు సారథిగానూ బాధ్యతలు నిర్వర్తించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్‌లో రెండు విషయాలపై ఇప్పటికీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నాడు. కోల్‌కతాకు ఆడినప్పుడు భారత స్టార్‌ స్పిన్నర్ కుల్‌దీప్‌ యాదవ్‌ను సముదాయించడం సవాల్‌గా మారిందని తెలిపాడు. 

‘‘నా జీవితంలో పెద్దగా బాధపడే అంశాలు, విచారం వ్యక్తం చేసేవి అధికంగా లేవు. కానీ, ఐపీఎల్‌ కెరీర్‌లో దేనిపై విచారం వ్యక్తం చేస్తావని అడిగితే మాత్రం రెండింటి గురించి చెబుతా. అందులో ఒకటి ముంబయి ఇండియన్స్‌ నన్ను రిటైన్‌ చేసుకోకుంటే బాగుండని భావించా. యువకుడిగా వేలంలోకి వెళ్లి నిరూపించుకోవాలని అనుకున్నా. ఒకవేళ నేను అప్పుడు ఆ జట్టుతోపాటు కొనసాగి ఉంటే మరింత మెరుగైన ఆటగాడిగా మారేవాడినేమోనని అనిపించింది. ఇప్పుడు ఆ జట్టు మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయి. రోహిత్, రికీ పాంటింగ్‌ జట్టును తీర్చిదిద్దిన విధానం బాగుంది. ఇప్పుడు దశాబ్దం తర్వాత బాధ పడుతున్నా. ఆకాశ్, అనంత్, నీతా అంబానీతో ఇప్పటికీ నాకు మంచి అనుబంధం ఉంది. 

ఇక రెండోది.. సొంత రాష్ట్రానికి చెందిన చెన్నై తరఫున ఒక్కసారి కూడా ఆడలేకపోవడం. అక్కడి నుంచి వచ్చిన నేను లోకల్‌గా చాలా క్రికెట్‌ ఆడా. కానీ, ఐపీఎల్‌లో మాత్రం కుదరలేదు. యెల్లో జెర్సీని ధరించలేకపోయా. కానీ, చెన్నై యాజమాన్యంపై ఇప్పటికీ గౌరవం ఉంది. ప్రతి వేలంలో నన్ను తీసుకొనేందుకు ప్రయత్నించింది. కానీ, అది కుదరలేదు’’ అని దినేశ్‌ తెలిపాడు. ముంబయికి 2012-13 సీజన్లలో కార్తిక్‌ ఆడాడు. 2013 ఐపీఎల్‌ టైటిల్‌ గెలిచిన జట్టులో సభ్యుడు. కానీ, 2014లో వేలానికి వెళ్లడంతో దిల్లీ జట్టు తీసుకుంది. ఆ తర్వాత బెంగళూరు, గుజరాత్, కోల్‌కతా జట్లకూ ఆడాడు. ఇప్పుడు బెంగళూరు జట్టులో ఉన్నాడు.

 నాయకత్వ బాధ్యతల్లో అలా తప్పదు

‘‘కెప్టెన్‌గా ఉన్నప్పుడు జట్టులోని ప్రతి అంశంపై దృష్టి సారించాల్సి ఉంటుంది. నేను కోల్‌కతాకు సారథిగా బాధ్యతలు నిర్వర్తించా. వ్యక్తిగత ప్రదర్శనతోపాటు జట్టులోని సభ్యుల నుంచి మెరుగైన ప్రదర్శన రాబట్టాల్సి ఉంటుంది. చాలా నిజాయతీగా వ్యవహరించాలి. నాయకత్వం వల్ల కొన్ని సందర్భాల్లో స్నేహం కూడా కోల్పోవాల్సి వస్తుంది. నేను కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్‌దీప్‌ యాదవ్ రాణించలేదు. దీంతో కొన్ని మ్యాచ్‌ల తర్వాత బెంచ్‌పై ఉంచాం. ఆ సమయంలో అతడితో మాట్లాడటమే చాలా ఇబ్బందిగా అనిపించేది. అయితే, ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని రాటుదేలిన అతడు టాప్‌ బౌలర్‌గా మారాడు. నా దురదృష్టం ఏంటంటే.. అతడు సరైన ఫామ్‌లో లేనప్పుడు నాయకత్వం వహించా. తప్పకుండా అతడు అర్థం చేసుకుంటాడని భావిస్తున్నా. జట్టు కోసం నిర్ణయాలు తీసుకున్నప్పుడు వ్యక్తిగతం చూడకుండా ఉండాలి’’ అని కార్తిక్ వెల్లడించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని