చెన్నై చుట్టేసింది

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్‌తో మ్యాచ్‌లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది.

Published : 06 May 2024 02:56 IST

పంజాబ్‌పై ఘన విజయం
జడేజా ఆల్‌రౌండ్‌ జోరు
రాణించిన సిమర్‌జీత్‌, తుషార్‌
ధర్మశాల

చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్‌తో మ్యాచ్‌లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. 11 మ్యాచ్‌ల్లో ఆరో గెలుపుతో ప్లేఆఫ్స్‌ అవకాశాలను మెరుగుపరుచుకుంది. బ్యాట్‌తో జట్టును ఆదుకున్న ఆల్‌రౌండర్‌ జడేజా.. బంతితోనూ మాయ చేసి చెన్నైని గెలిపించాడు. తుషార్‌ దేశ్‌పాండే, సిమర్‌జీత్‌ సింగ్‌ విజయంలో కీలకమయ్యారు. పంజాబ్‌కు  పదకొండు మ్యాచ్‌ల్లో ఇది ఏడో ఓటమి.

పీఎల్‌లో పంజాబ్‌పై కొన్నేళ్ల తర్వాత ఓ విజయం సాధించింది చెన్నై. పంజాబ్‌ చేతిలో వరుసగా అయిదు ఓటములు చవిచూసిన సీఎస్కే.. ఆదివారం 28 పరుగుల తేడాతో ఆ జట్టును ఓడించింది. మొదట చెన్నై 167/9కే పరిమితమైంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రవీంద్ర జడేజా (43; 26 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. రాహుల్‌ చాహర్‌ (3/23) చెన్నైని కట్టడి చేశాడు. జడేజా (3/20), సిమర్‌జీత్‌ సింగ్‌ (2/16), తుషార్‌ దేశ్‌పాండే (2/35) విజృంభించడంతో ఛేదనలో పంజాబ్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 139 పరుగులే చేసింది. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (30; 23 బంతుల్లో 2×4, 2×6) టాప్‌ స్కోరర్‌. ఈ విజయంతో చెన్నై పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి దూసుకెళ్లింది.

పంజాబ్‌ టపటపా..: ఛేదనలో పంజాబ్‌ తడబడింది. 2 ఓవర్లకే ఆ జట్టు 2 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో బెయిర్‌స్టో (7), రొసో (0)లను ఔట్‌ చేసిన తుషార్‌ దేశ్‌పాండే ప్రత్యర్థిని దెబ్బ కొట్టాడు. ప్రభ్‌సిమ్రన్‌.. శశాంక్‌ సింగ్‌ (27)తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని ఆపాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 53 పరుగులు జత చేయడంతో పంజాబ్‌ లక్ష్యం దిశగా వెళ్తున్నట్లు కనిపించింది. పొదుపుగా బౌలింగ్‌ చేసిన స్పిన్నర్‌ శాంట్నర్‌ (1/10) శశాంక్‌ ఆట కట్టించి వికెట్ల పతనానికి మళ్లీ గేట్లెత్తాడు. సామ్‌ కరన్‌ (7), జితేశ్‌ శర్మ (0), అశుతోష్‌ శర్మ (3) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. దీంతో ఒక దశలో 62/2తో ఉన్న పంజాబ్‌.. 16 పరుగుల తేడాతో 5 వికెట్లు కోల్పోయి 78/7తో ఓటమిని ఖాయం చేసుకుంది. మొదట ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ను పెవిలియన్‌ చేర్చిన జడేజా.. 13వ ఓవర్లో సామ్‌ కరన్‌, అశుతోష్‌లను ఔట్‌ చేసి చెన్నై విజయానికి బాటలు వేశాడు. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (17 నాటౌట్‌), హర్షల్‌ పటేల్‌ (12), రాహుల్‌ చాహార్‌ (16), రబాడ (11 నాటౌట్‌) పోరాటం పరుగుల అంతరాన్ని మాత్రమే తగ్గించింది.

చెన్నై కట్టడి: పవర్‌ప్లే ఆఖరికి చెన్నై స్కోరు 60/1.. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు జోరిది. సీఎస్కే ఊపు చూస్తే భారీ స్కోరుపై కన్నేసినట్టు కనిపించింది. కానీ వరుస వికెట్లు కోల్పోయి ఒత్తిడి పెంచుకుని ఆఖరికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. రెండో ఓవర్లోనే రహానె (9) వికెట్‌ కోల్పోయినా.. చెన్నై మాత్రం తగ్గలేదు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ రుతురాజ్‌ (32; 21 బంతుల్లో 4×4, 1×6), మిచెల్‌ (30; 19 బంతుల్లో 2×4, 1×6)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. కానీ ఎనిమిదో ఓవర్లో స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌.. రుతురాజ్‌తో పాటు ప్రమాదకర శివమ్‌ దూబె (0)ను వరుస బంతుల్లో ఔట్‌ చేసి చెన్నైకి బ్రేక్‌ వేశాడు. ఆ తర్వాత మిచెల్‌ను హర్షల్‌ పటేల్‌ బుట్టలో వేయడంతో 8.5 ఓవర్లకు 75/4తో చెన్నై కష్టాల్లో పడింది. ఈ స్థితిలో జడేజా నిలిచాడు. మొయిన్‌ అలీ (17), శాంట్నర్‌ (11), శార్దూల్‌ ఠాకూర్‌ (17) సాయంతో జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. చాలా ఆలస్యంగా క్రీజులోకి వచ్చిన ధోని (0) ఒకే ఒక్క బంతిని ఎదుర్కొని హర్షల్‌ బౌలింగ్‌లో బౌల్డ్‌ అయ్యాడు. ఈ సీజన్‌లో తొలిసారి ధర్మశాలలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైబ్రిడ్‌ పిచ్‌ను ఉపయోగించారు.

చెన్నై ఇన్నింగ్స్‌: రహానె (సి) రబాడ (బి) అర్ష్‌దీప్‌ 9; రుతురాజ్‌ (సి) జితేశ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 32; మిచెల్‌ ఎల్బీ (బి) హర్షల్‌ 30; దూబె (సి) జితేశ్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 0; అలీ (సి) బెయిర్‌స్టో (బి) కరన్‌ 17; జడేజా (సి) కరన్‌ (బి) అర్ష్‌దీప్‌ 43; శాంట్నర్‌ (సి) కరన్‌ (బి) రాహుల్‌ చాహర్‌ 11; శార్దూల్‌ (బి) హర్షల్‌ 17; ధోని (బి) హర్షల్‌ 0; తుషార్‌ నాటౌట్‌ 0; గ్లీసన్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 167; వికెట్ల పతనం: 1-12, 2-69, 3-69, 4-75, 5-101, 6-122, 7-150, 8-150, 9-164; బౌలింగ్‌: రబాడ 3-0-24-0; అర్ష్‌దీప్‌ 4-0-42-2; సామ్‌ కరన్‌ 4-0-34-1; బ్రార్‌ 1-0-19-0; రాహుల్‌ చాహర్‌ 4-0-23-3; హర్షల్‌ 4-0-24-3

పంజాబ్‌ ఇన్నింగ్స్‌: ప్రభ్‌సిమ్రన్‌ (సి) రిజ్వి (బి) జడేజా 30; బెయిర్‌స్టో (బి) తుషార్‌ 7; రొసో (బి) తుషార్‌ 0; శశాంక్‌ (సి) సిమర్‌జీత్‌ (బి) శాంట్నర్‌ 27; సామ్‌ కరన్‌ (సి) శాంట్నర్‌ (బి) జడేజా 7; జితేశ్‌ (సి) ధోని (బి) సిమర్‌జీత్‌ 0; అశుతోష్‌ (సి) సిమర్‌జీత్‌ (బి) జడేజా 3; బ్రార్‌ నాటౌట్‌ 17; హర్షల్‌ (సి) సమీర్‌ (బి) సిమర్‌జీత్‌ 12; రాహుల్‌ చాహర్‌ (బి) శార్దూల్‌ 16; రబాడ నాటౌట్‌ 11; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 139; వికెట్ల పతనం: 1-9, 2-9, 3-62, 4-68, 5-69, 6-77, 7-78, 8-90, 9-117; బౌలింగ్‌: శాంట్నర్‌ 3-0-10-1; తుషార్‌ 4-0-35-2; గ్లీసన్‌ 4-0-41-0; జడేజా 4-0-20-3; సిమర్‌జీత్‌ 3-0-16-2; శార్దూల్‌ 2-0-12-1

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని