SA vs IND: గిల్‌ ఇలాగే ఆడితే.. వారిద్దరిలో ఒకరు వచ్చేస్తారు: డీకే

టీమ్‌ఇండియాలోకి (Team India) వచ్చేందుకు విపరీతమైన పోటీ ఉంది. పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్న శుభ్‌మన్‌ గిల్ కూడా పోటీ ఎదుర్కొంటున్నాడు.

Published : 01 Jan 2024 12:15 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భారత యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ప్రదర్శన గత కొన్ని మ్యాచుల్లో గొప్పగా ఏమీ లేదు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులోనూ విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేసింది. బుధవారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పుడా మ్యాచ్‌లోనూ.. ఆ తర్వాత వచ్చే సిరీసుల్లోనూ మంచి ప్రదర్శన ఇవ్వకపోతే ఇతర క్రికెటర్లు అతడి స్థానాన్ని భర్తీ చేసేస్తారని సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ వ్యాఖ్యానించాడు. మరీ ముఖ్యంగా సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్ పటీదార్‌ తమ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నాడు.

‘‘ఇప్పుడు శుభ్‌మన్ గిల్ స్థానమే ప్రశ్నార్థకంగా మారేలా ఉంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడటంలో అతడు విఫలమవుతున్నాడు. 20 టెస్టుల తర్వాత కూడా సగటు 30కి అటూఇటుగా ఉంటే మాత్రం స్థానంపై పునరాలోచించుకోవాలి. అలాంటి సమయంలో అదృష్టం ఉంటేనే జట్టులో ఉండేందుకు అవకాశం ఉంది. ఈ సీజన్‌లో జరిగే టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన చేయకపోతే మాత్రం మేనేజ్‌మెంట్ దృష్టిసారించే అవకాశాలూ లేకపోలేదు. దేశవాళీ క్రికెట్‌లో సర్ఫరాజ్‌ ఖాన్‌, రజత్ పటీదార్‌ భారీగా పరుగులు చేసి సిద్ధంగా ఉన్నారు. సర్ఫరాజ్‌ త్వరగా జట్టులోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మిడిలార్డర్‌లో రజత్‌ కూడా బలమైన పోటీదారు. అందుకే, గిల్ ఇకనుంచైనా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టాలి’’ అని డీకే విశ్లేషించాడు. 

అశ్విన్‌ స్థానంలో జడేజాను ఆడించాలి: ఇర్ఫాన్‌ పఠాన్

రెండో టెస్టులో మార్పులు చేస్తే స్పిన్‌ ఆల్‌రౌండర్‌ను మాత్రమే మార్చాలని భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్‌ పఠాన్‌ తెలిపాడు. ‘‘రవీంద్ర జడేజా ఫిట్‌గా ఉంటే అతడిని జట్టులోకి తీసుకోవాలి. తొలి టెస్టులో అశ్విన్‌ బాగానే బౌలింగ్‌ వేశాడు. కానీ, జడేజాలా బ్యాటింగ్‌లోనూ ఏడో స్థానంలో పరుగులు చేయలేకపోయాడు. సెంచూరియన్‌ టెస్టులో భారత్‌కు అదే లోటుగా మారింది. పేస్‌ విభాగంలో మార్పులు చేయాల్సిన అవసరం లేదు. ప్రసిధ్‌కు బదులు ముకేశ్‌ కుమార్‌ను తీసుకోవాలని చాలా మంది చెబుతున్నారు. కానీ నెట్స్‌లో, మ్యాచ్‌లోనూ ప్రసిధ్‌ ఆత్మవిశ్వాసంతోనే బౌలింగ్‌ చేశాడు’’ అని ఇర్ఫాన్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని