Novak Djokovic : జకోవిచ్‌కు భారీషాక్‌.. మరోసారి వీసా రద్దు

ప్రపంచ నంబర్‌ 1 టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌కు మరోసారి షాక్‌ తగిలింది. అతడి వీసాను రద్దు చేస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. జనవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియన్‌...

Updated : 14 Jan 2022 16:20 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొని రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్‌ సాధించాలని కలలుకన్న టెన్నిస్‌ దిగ్గజం, ప్రపంచ నంబర్‌-1 ఆటగాడు నోవాక్‌ జకోవిచ్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం తాజాగా మరోసారి అతడి వీసాను రద్దు చేసింది. దీంతో మూడేళ్లు అతడు మళ్లీ ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టేందుకు అవకాశం రాకపోవచ్చు. ఈ మేరకు ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ మినిస్టర్‌ అలెక్స్‌ హాకే కఠిన నిర్ణయం తీసుకున్నారు. దేశ ప్రజల ఆరోగ్య భద్రత నేపథ్యంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేస్తున్నట్లు తెలిపారు. అందుకు తన పూర్తి విచక్షణా అధికారం ఉపయోగించినట్లు చెప్పారు.

జకోవిచ్‌ ఈనెల 5న మెల్‌బోర్న్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే, అతడి వద్ద వాక్సినేషన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు లేవు. దీంతో ఆస్ట్రేలియా బోర్డర్‌ ఫోర్స్‌ అధికారులు అతడిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే జకోవిచ్‌ వీసాను రద్దు చేసి అతడిని ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. కాగా, తనకు వైద్యపరమైన మినహాయింపులు ఉన్నాయని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని జకోవిచ్‌ కోర్టుకెక్కాడు. డిసెంబర్‌ 16వ తేదీన తనకు కొవిడ్‌-19 సోకిందని, దీంతో వాక్సినేషన్‌ అవసరం లేదంటూ తన లాయర్ల ద్వారా కోర్టులో వాదనలు వినిపించాడు. ఈ నేపథ్యంలోనే అక్కడి ఫెడరల్‌ కోర్టు జకోవిచ్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. అతడి వీసాను వెంటనే పునరుద్ధరించాలని, అతడిని డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది. దీంతో జకోవిచ్‌ డిటెన్షన్‌ సెంటర్‌ నుంచి బయటకు వచ్చి హోటల్‌కు చేరుకొన్నాడు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే తిరిగి ప్రాక్టీస్‌ మొదలెట్టాడు. ఇక జనవరి 17 నుంచి మెగా ఈవెంట్‌ ప్రారంభమవుతున్న తరుణంలో ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి మరోసారి వీసా రద్దు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని