Mohammed Siraj: బౌలింగ్‌ ఇవ్వనపుడు అతడిని పక్కన పెట్టడమే మంచిది: పార్థివ్‌ పటేల్

ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం లేనపుడు సిరాజ్‌ (Mohammed Siraj)ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ అన్నాడు.

Updated : 30 Jan 2024 18:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాస్ట్‌ బౌలర్‌ అవసరం లేనపుడు మహ్మద్‌ సిరాజ్‌ (Mohammed Siraj)ను తప్పించి ఒక బ్యాటర్‌ను అదనంగా తీసుకోవడం ఉత్తమమని భారత మాజీ వికెట్‌ కీపర్‌ పార్థివ్‌ పటేల్‌ (Parthiv Patel) అభిప్రాయపడ్డాడు. మొదటి టెస్టులో భారత్‌ ఓటమిపై మాట్లాడుతూ పలు సూచనలు చేశాడు. ఫాస్ట్‌ బౌలర్‌కు ఎక్కువగా బౌలింగ్‌ చేసే అవకాశం ఇవ్వనపుడు ఎలాంటి లాభం లేదని, అతడి స్థానంలో ఒక స్పెషలిస్టు బ్యాటర్‌కు అవకాశమివ్వాలన్నాడు. ఉప్పల్‌లో జరిగిన తొలి టెస్టులో 11 ఓవర్లు మాత్రమే వేసిన సిరాజ్‌ 50 పరుగులిచ్చి ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయాడు. సహచర ఫాస్ట్‌ బౌలర్‌ బుమ్రా 24.4 ఓవర్లు వేసి బెన్ స్టోక్స్‌, రెహాన్‌ అహ్మద్‌, ఒలీపోప్‌, జోరూట్‌ లాంటి కీలక వికెట్లు తీశాడని వివరించాడు.

‘‘టెస్టు మ్యాచ్‌ ప్రారంభానికి ముందు రోహిత్‌ శర్మ అన్నట్టుగా బ్యాటింగ్‌ చేయగలడని అక్షర్‌ను తీసుకుని ఉండవచ్చు. ముగ్గురు స్పిన్నర్లతో ఆడటం మంచి నిర్ణయమే. కానీ అక్షర్‌కు బదులు కుల్‌దీప్‌ను తీసుకుంటే జడేజా, అశ్విన్‌, కుల్‌దీప్‌ రూపంలో మనకు మూడు రకాల స్పిన్నర్లు ఉంటారు. సిరాజ్‌  స్థానంలో మరో బ్యాటర్‌కు అవకాశం ఇస్తే బ్యాటింగ్‌ ఆర్డర్‌ బలంగా తయారవుతుంది’’ అన్నాడు. మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్..  రెండో టెస్టుకు సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి విశాఖపట్నంలో ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని