Rishabh Pant : పంత్‌కి కాస్త భరోసా కల్పిస్తే చాలు : బ్రాడ్‌ హాగ్‌

టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌కి కాస్త భరోసా కల్పిస్తే చెలరేగి ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అన్నాడు. ఇటీవల తరచూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరుతున్న...

Published : 13 Jan 2022 01:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా యువ వికెట్ కీపర్‌ రిషభ్‌ పంత్‌కి కాస్త భరోసా కల్పిస్తే చెలరేగి ఆడతాడని ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అన్నాడు. ఇటీవల తరచూ స్వల్ప స్కోర్లకే పెవిలియన్‌ చేరుతున్న పంత్‌పై తీవ్ర విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో పంత్‌ ఒక్క కీలక ఇన్నింగ్స్‌ కూడా ఆడకపోవడం గమనార్హం.

‘పంత్‌ నాణ్యమైన ఆటగాడే. కానీ, ఇటీవల తరచూ స్వల్ప స్కోర్లకే వెనుదిరగడం చిరాకు తెప్పిస్తోంది. జొహన్నెస్ బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో నిర్లక్ష్యంగా ఆడి పెవిలియన్‌ బాట పట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు పంత్ అలా ఔట్ కావడం విమర్శలకు తావిచ్చింది. ఒత్తిడిలో కూడా మెరుగ్గా రాణించగల నైపుణ్యం అతడిలో ఉంది. గత ఆస్ట్రేలియా పర్యటనలో గబ్బా మైదానంలో జరిగిన టెస్టులో కీలక ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపించాడు. కానీ, దక్షిణాఫ్రికా పర్యటనలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. పంత్ లోపాల్ని అధిగమించి భారీ ఇన్నింగ్స్ ఆడాల్సిన అవసరం ఉంది. షాట్ సెలెక్షన్ గురించి పంత్‌తో చర్చిస్తామని టీమ్‌ఇండియా హెడ్ కోచ్‌ రాహుల్ ద్రవిడ్ చెప్పాడు. బ్యాటింగ్ టెక్నిక్‌ గురించి, వ్యూహాల గురించి అతడితో చర్చించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. ప్రస్తుతం అతడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. మానసికంగా కొంచెం ధైర్యం అందించి.. నీ వెంట మేమున్నామనే భరోసా కల్పిస్తే చాలు. పంత్ చెలరేగి ఆడతాడు’ అని బ్రాడ్ హాగ్‌ అభిప్రాయపడ్డాడు.

వికెట్ కీపర్‌గా మెరుగ్గా రాణిస్తున్న పంత్.. బ్యాటర్‌గా మాత్రం రాణించలేకపోతున్నాడు. ప్రస్తుత దక్షిణాఫ్రికా పర్యటనలో అతడి బ్యాటింగ్ తీరే అందుకు నిదర్శనం. తొలి టెస్టులో 8, 34 పరుగులు, రెండో టెస్టులో 17, 0 పరుగులు చేశాడు. కేప్‌టౌన్‌లో జరుగుతోన్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసి పెవిలియన్‌ చేరాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని