Nasser Hussain: భవిష్యత్తులో క్రికెట్‌ సంచలనాలుగా మారేది వారిద్దరే: నాజర్ హుస్సేన్

ఇద్దరు యువ క్రికెటర్లపై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ ప్రశంసల వర్షం కురిపించాడు. భవిష్యత్తులో క్రికెట్‌ను శాసించేది వారిద్దరేనని వ్యాఖ్యానించాడు.

Published : 30 Dec 2023 13:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌: భవిష్యత్తులో ఇద్దరు క్రికెటర్లు అంతర్జాతీయ క్రికెట్‌లో సంచలనాలుగా మారతారని.. అందులో ఒకరు భారత్‌ నుంచి ఉంటారని ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్ నాజర్ హుస్సేన్ వ్యాఖ్యానించాడు. సామాజిక మాధ్యమాల్లో ఐసీసీ తాజాగా ఓ వీడియోను పోస్టు చేసింది. అందులో నాజర్‌ హుస్సేన్ మాట్లాడుతూ.. భారత ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్, న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర భవిష్యత్తు దిగ్గజాలుగా మారతారని అభిప్రాయపడ్డాడు.

‘‘శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేయడానికి కారణముంది. మూడు ఫార్మాట్లలోనూ అద్భుతమైన ఆటగాడు. ఇటీవల మినహా ఈ ఏడాదిలో మంచి ప్రదర్శన చేశాడు. ప్రపంచ కప్‌ ముంగిట అనారోగ్యం కారణంగా కొంత వెనుకడుగు వేశాడు. టెక్నిక్‌, టాలెంట్‌ పరంగా తిరుగులేని ఆటగాడు. భారత్‌ తరఫున సంచలనంగా మారతాడు. తప్పకుండా వచ్చే ఏడాది అతడి నుంచి మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు వస్తాయి’’ అని హుస్సేన్ తెలిపాడు. గిల్ ఈ ఏడాది 47 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 2,126 పరుగులు చేశాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

వరల్డ్‌ కప్‌లో రచిన్‌ ఆట అదుర్స్‌

‘‘తొలిసారి వన్డే ప్రపంచ కప్‌ వంటి మెగా టోర్నీలో అద్భుతంగా ఆడటం అందరికీ సాధ్యం కాదు. కానీ, రచిన్‌ రవీంద్ర ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిగా అదరగొట్టాడు. ఇంగ్లాండ్‌లోనూ మంచి ప్రదర్శన చేశాడు. లోయర్ ఆర్డర్‌లో వచ్చి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వరల్డ్‌ కప్‌లో టాప్‌ ఆర్డర్‌లోనూ రాణించాడు. తప్పకుండా ఇదే ఆటతీరును ప్రదర్శిస్తే మరో దిగ్గజ క్రికెటర్‌గా మారతాడు’’ అని హుస్సేన్ వెల్లడించాడు. వన్డే ప్రపంచ కప్‌లో రచిన్‌ పది మ్యాచుల్లో 578 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని