Pandya - Hooda: దీపక్‌ చేతికి బంతినివ్వడం.. హార్దిక్‌ తెలివైన నిర్ణయం: పార్థివ్‌

బ్యాటింగ్‌, బౌలింగ్‌ వేయగల సత్తా ఉన్నవారిని ఆల్‌రౌండర్‌ అంటారు. టీమ్‌ఇండియాలో రవీంద్ర జడేజా, హార్దిక్‌ పాండ్య కీలక ఆటగాళ్లు. ఇదే వరుసలో అవకాశం లభిస్తే నిరూపించుకొనేందుకు దీపక్‌ హుడా ఎప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. తాజాగా కివీస్‌తో సిరీస్‌లో బౌలర్‌గా తన సత్తా ఏంటో చూపించాడు.

Published : 22 Nov 2022 01:13 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా కివీస్‌తో చివరి మ్యాచ్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా సిద్ధమవుతోంది. రెండో టీ20లో  భారత్‌ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సూర్యకుమార్‌యాదవ్ (111*) సెంచరీకి తోడు దీపక్ హుడా (4/10) అదరగొట్టేయడంతో సునాయాసంగా గెలిచింది. గత కొన్ని టీ20ల్లో జట్టుతోపాటు దీపక్ హుడా ఉన్నప్పటికీ అతడికి బౌలింగ్‌ ఇచ్చిన దాఖలాలు చాలా తక్కువ. మరీ ముఖ్యంగా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ ఆ తరహా ఆలోచన చేయలేదు. ఇప్పుడు తాత్కాలిక సారథి హార్దిక్‌ పాండ్య ఆసక్తి చూపాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య తీసుకొన్న నిర్ణయాన్ని మాజీ ఆటగాడు పార్థివ్‌ పటేల్‌ కొనియాడాడు.

‘‘బౌలింగ్‌ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడిని గుర్తించడం అంతర్జాతీయ క్రికెట్‌లో చాలా ముఖ్యం. అలాంటి వారికి బౌలింగ్‌ ఇవ్వాలి. దీపక్ హుడా విషయంలో హార్దిక్‌ పాండ్య తీసుకొన్న తెలివైన నిర్ణయమిదే. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌ చేయగల సత్తా ఉన్న దీపక్‌ హుడాకు గత టీ20 ప్రపంచకప్‌లో స్థానం దక్కింది. అయితే ఆడిన ఒక్క గేమ్‌లోనూ బౌలింగ్‌ చేయలేదు. పూర్తి ఓవర్ల కోటాను ఇవ్వాల్సిన అవసరం లేదు. వేయగలనని అతడు  నిరూపించుకొనేందుకైనా కనీసం ఒక్క ఓవర్‌ అయినా ఇవ్వాలి. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించే క్రమంలో ప్రత్యర్థులు వికెట్లు ఇస్తారు. టీ20 ఫార్మాట్‌లో ఇలాంటి నిర్ణయాలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి’’ అని తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని