Shubman Gill: కోహ్లీ, రోహిత్‌ జట్లపై సెంచరీలు.. ఇప్పుడు ధోనీ వంతు : గిల్‌పై మాజీ పేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు

గుజరాత్ టైటాన్స్‌ (GT) ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ సెంచరీలతో అదరగొట్టేస్తూ ఆరెంజ్‌ క్యాప్‌ను ఇప్పటికే సొంతం చేసుకున్నాడు. సీఎస్‌కేపై మరోసారి (CSK) అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాలని గుజరాత్ అభిమానులు ఆశిస్తున్నారు.

Published : 28 May 2023 12:06 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో (IPL 2023) మంచి ఫామ్‌లో ఉన్న బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill). గుజరాత్ ఫైనల్‌కు చేరుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. లీగ్ స్టేజ్‌లో బెంగళూరుపై, రెండో క్వాలిఫయర్‌లో ముంబయి ఇండియన్స్‌పై అదిరిపోయే శతకాలు సాధించాడు. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్‌తో (GT vs CSK) ఫైనల్‌లోనూ కీలక ఇన్నింగ్స్‌ ఆడాలని గుజరాత్ అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం 851 పరుగులతో ఆరెంజ్‌ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) రేసులో అందరికంటే ముందున్నాడు. ఈ క్రమంలో టీమ్‌ఇండియా మాజీ పేసర్ అతుల్ వాసన్‌ కీలక వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్లపై సెంచరీలతో చెలరేగిన గిల్ ఫైనల్‌లో చెన్నై జట్టు మీదా రాణిస్తాడని పేర్కొన్నాడు. సీఎస్‌కే ఐదో టైటిల్‌ కలకు అడ్డంకిగా మారే అవకాశం లేకపోలేదని తెలిపాడు. 

‘‘దిగ్గజ క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను శుభ్‌మన్‌ గిల్ కబళిస్తాడు. అతడి బ్యాటింగ్‌ విధానం అద్భుతంగా ఉంది. ఇప్పటికే విరాట్, రోహిత్ జట్లపై సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ధోనీ వంతు. సీఎస్‌కేపైనా సెంచరీ సాధించగలడు. గుజరాత్ టైటాన్స్‌ అత్యుత్తమ బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాలు ఉన్న జట్టు. ముంబయి జట్టులో సూర్యకుమార్‌ వంటి ప్రమాదకరమైన ఆటగాడిని గుజరాత్ బౌలర్లు  నియంత్రించారు. డెత్‌ బౌలింగ్‌లో గుజరాత్‌కు తిరుగులేదు. ఇదే తరహా పరిస్థితులు సీఎస్‌కేలోనూ ఉన్నాయి. అయితే, గిల్‌ను ఎలా ఎదుర్కొంటారనేది వేచి చూడాలి. డబ్బు, కీర్తి వచ్చిన తర్వాత ఆటపై దృష్టిపెట్టడం కష్టమవుతుంది. కానీ, గిల్ విషయంలో మాత్రం అలా జరగలేదు. గిల్ చిన్నపట్టణం నుంచి వచ్చిన ఆటగాడు.  కుమారుడికి క్రికెట్‌ను కెరీర్‌గా మార్చడానికి గిల్ తండ్రి చాలా త్యాగాలు చేశాడు. అందుకే, ఐపీఎల్‌లో భారీ మొత్తం సంపద వచ్చినా ఇప్పటికీ శుభ్‌మన్‌ గిల్ బాడీ లాంగ్వేజ్‌ మారలేదు’’ అని వాసన్‌ చెప్పాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని