SA vs IND: ఇలాంటప్పుడు అజింక్య రహానె ఉండుంటే.. : గావస్కర్‌

దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడాడు.

Updated : 27 Dec 2023 15:25 IST

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా బ్యాటర్లు కాస్త ఇబ్బందిపడ్డారు. కేఎల్ రాహుల్ నిలకడగా ఆడుతూ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌ యశస్వి జైస్వాల్ (17) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. రోహిత్ శర్మ (5), గిల్ (2) విఫలమయ్యారు. విరాట్ (38), శ్రేయస్‌ అయ్యర్ (31), శార్దూల్ ఠాకూర్ (24) కాస్త ఫర్వాలేదనిపించారు. కానీ, వీరంతా కీలక సమయంలో వికెట్‌ను చేజార్చుకోవడంతో భారత్‌కు కష్టాలు తప్పలేదు. ఇలాంటి సమయంలో అజింక్య రహానె వంటి నిలకడైన ఆటగాడు ఉంటే బాగుండేదని టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించాడు. 2018 పర్యటనలో జోహన్నెస్‌బర్గ్‌ టెస్టులో రహానె ఇన్నింగ్స్‌ను సన్నీ గుర్తు చేసుకున్నాడు.

‘‘ఐదేళ్ల క్రితం జోహన్నెస్‌బర్గ్‌ పిచ్‌ గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అప్పుడు నేను అక్కడే ఉన్నా. ఇప్పటి సెంచూరియన్‌ పిచ్‌ మాదిరిగానే జోహన్నెస్‌బర్గ్‌ కూడా బ్యాటింగ్‌కు చాలా క్లిష్టంగా ఉంది. అయితే, అజింక్య రెండో ఇన్నింగ్స్‌లో ఆడిన తీరు అద్భుతం. ఆ పర్యటనలో తొలి రెండు టెస్టుల్లో రహానెకు అవకాశం కల్పించలేదు. ఆ మ్యాచుల్లో భారత్‌ స్వల్ప తేడాతోనే ఓటమిని చవిచూసింది. చివరి టెస్టులో పుంజుకుని మరీ విజయం సాధించింది. విదేశీ పిచ్‌లపై రహానె అనుభవం ఉపయోగపడుతుంది. అతడి గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి. ఒక వేళ ఇప్పుడు రహానె ఉండుంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో’’ అని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. అప్పట్లో మూడో టెస్టులో రహానె తొలి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు.. రెండో ఇన్నింగ్స్‌లో 48 పరుగులు చేశాడు.

ఈ పరిస్థితుల్లో భారత్ బాగానే ఆడింది

మొదటి టెస్టు మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 200 స్కోర్‌ను దాటడంపై సునీల్‌ గావస్కర్‌ స్పందించాడు. కఠినమైన పిచ్‌పై టీమ్ఇండియా మెరుగ్గానే ఆడిందని వ్యాఖ్యానించాడు. ‘‘ఇప్పటి వరకైతే భారత్ అద్భుతంగానే ఆడింది. బ్యాటింగ్‌కు కఠినమైన పిచ్‌పై 200+ పరుగులు చేయడం గొప్పే. టీమ్‌ఇండియా ఈ ఏడాదిని విజయంతో ముగించి కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతుందని భావిస్తున్నా. దక్షిణాఫ్రికా బ్యాటర్లు పెద్దగా ఫామ్‌లో లేరు. వారిని త్వరగా ఆలౌట్‌ చేస్తే మనకు తిరుగుండదు. భారత బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్‌లో కాస్త నిలదొక్కుకుని పరుగులు చేస్తే విజయం కష్టమేమీ కాదు’’ అని సునీల్ గావస్కర్‌ తెలిపాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని