తొలి పొట్టి కప్పు హీరో జోగిందర్‌ వీడ్కోలు

2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ హీరో, టీమ్‌ఇండియా మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మ ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు.

Published : 04 Feb 2023 03:13 IST

దిల్లీ: దిల్లీ: 2007 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ హీరో, టీమ్‌ఇండియా మీడియం పేసర్‌ జోగిందర్‌ శర్మ ఆటకు గుడ్‌బై చెప్పాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలుకుతున్నట్లు శుక్రవారం ప్రకటించాడు. 39 ఏళ్ల జోగిందర్‌ 2004 నుంచి 2007 వరకు టీమ్‌ఇండియా తరఫున నాలుగేసి వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో ఒకటి, టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో ఫైనల్లో ఆఖరి ఓవర్లో పాకిస్థాన్‌ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. అనుభవం లేని జోగిందర్‌కు కెప్టెన్‌ ధోని బంతినిచ్చాడు. ఆ ఓవర్‌ రెండో బంతిని సిక్స్‌ కొట్టి మిస్బావుల్‌ హక్‌ పాక్‌ను విజయానికి చేరువ చేశాడు. సమీకరణం 4 బంతుల్లో 6 పరుగులుగా ఉన్నప్పుడు మూడో డెలివరీని మిస్బా స్కూప్‌ షాట్‌ ఆడేందుకు ప్రయత్నించగా.. షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో శ్రీశాంత్‌ ఒడిసి పట్టుకున్నాడు.  టీమ్‌ఇండియా ప్రపంచకప్‌ హీరోగా చరిత్రలో నిలిచిపోయిన జోగిందర్‌కు అదే చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ కావడం ఊహించని పరిణామమే. చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడిన జోగిందర్‌ పెద్దగా రాణించలేదు. అనంతరం తెరమరుగయ్యాడు. పోలీసు శాఖలో డీఎస్పీగా చేరిన జోగిందర్‌ కొవిడ్‌-19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో విశేష సేవలందించి ప్రశంసలు అందుకున్నాడు. నిరుడు లెజెండ్స్‌ క్రికెట్‌ లీగ్‌లో పాల్గొన్న జోగిందర్‌.. విదేశీ ఫ్రాంచైజీ క్రికెట్లో బరిలో దిగాలని భావిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని