Smriti Mandhana: స్మృతి జాక్‌పాట్
ఓపెనర్‌గా ఆటతో అదరగొట్టే భారత క్రికెటర్ స్మృతి మంధాన.. మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలోనూ సత్తాచాటింది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది.
వేలంలో రూ.3.4కోట్లు
విదేశీ ఆల్‌రౌండర్లకు డిమాండ్
ఓపెనర్‌గా ఆటతో అదరగొట్టే భారత క్రికెటర్ స్మృతి మంధాన.. మహిళల ప్రిమియర్ లీగ్ వేలంలోనూ సత్తాచాటింది. మొట్టమొదటి డబ్ల్యూపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా రికార్డు సృష్టించింది. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్లపైనా ఫ్రాంఛైజీలు రూ.కోట్లు కుమ్మరించాయి. మొత్తానికి అంచనాలకు మించి సాగిన ఈ వేలం.. అమ్మాయిలపై కాసుల వర్షాన్ని కురిపించింది.
ముంబయి
మొట్టమొదటి మహిళల ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) కోసం సోమవారం నిర్వహించిన వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంచనాలకు మించి అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. ఆమె కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. ఆమె కోసం ఫ్రాంఛైజీలు పోటీపడతాయని ముందే ఊహించినా.. మరీ ఇంత ధర పలుకుతుందని అనుకోలేదు. ఓపెనర్‌గా నిలకడగా రాణిస్తున్న ఆమె టీమ్‌ఇండియాలో కీలక బ్యాటర్. పరిస్థితులకు తగినట్లు ఇన్నింగ్స్ నిర్మించడంతో పాటు ధనాధన్ షాట్లతో చెలరేగే నైపుణ్యాలు ఆమె సొంతం. కనీస ధర రూ.50 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెను.. ముంబయి ఇండియన్స్‌ను వెనక్కినెట్టి మరీ బెంగళూరు దక్కించుకుంది. ఆల్‌రౌండర్ దీప్తిశర్మ రెండో అత్యధిక ధర పలికిన భారత క్రికెటర్‌గా నిలిచింది. యూపీ వారియర్స్ ఆమెను రూ.2.6 కోట్లకు కొనుగోలు చేసింది. విధ్వంసక ఓపెనర్, కెప్టెన్‌గా దేశానికి అండర్-19 ప్రపంచకప్ అందించిన షెఫాలీని రూ.2 కోట్లకు, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో పోరులో చెలరేగిన జెమీమా రోడ్రిగ్స్‌ను రూ.2.2 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్ కైవసం చేసుకుంది. పూజ వస్త్రాకర్ కోసం ముంబయి, రిచా ఘోష్ కోసం ఆర్సీబీ చెరో రూ.1.9 కోట్లు పెట్టాయి. టీమ్‌ఇండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు మాత్రం ఊహించిన దానికంటే తక్కువ ధరే పలికింది. అత్యధిక ధర పలికిన టాప్-6 భారత క్రికెటర్లలోనూ ఆమె చోటు దక్కించుకోలేకపోయింది. భారీషాట్లను అలవోకగా ఆడగలిగే ఆమెను రూ.1.8 కోట్లకు ముంబయి సొంతం చేసుకుంది. యువ పేసర్ రేణుక సింగ్‌ను ఆర్సీబీ, యాస్తిక భాటియాను ముంబయి ఇండియన్స్ చెరో రూ.1.5 కోట్లకు కొనుక్కున్నాయి. ఆల్‌రౌండర్ దేవిక వైద్యాను రూ.1.4 కోట్లకు యూపీ వారియర్స్ జట్టులో చేర్చుకుంది.
ఆసీస్, ఇంగ్లిష్ క్రికెటర్ల కోసం..
విదేశీ క్రికెటర్ల విషయానికి వస్తే ప్రధానంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ల కోసం ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. ఇంగ్లిష్ ఆల్‌రౌండర్ నటాలీ సీవర్ కోసం ముంబయి రూ.3.2 కోట్లు చెల్లించింది. ఆసీస్ ఆల్‌రౌండర్ ఆష్లీ గార్డ్‌నర్‌నూ రూ.3.2 కోట్లకే గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకుంది. వీళ్ల కనీస ధర రూ.50 లక్షలు. వేలంలో ఎక్కువ ధర పలికిన విదేశీ క్రికెటర్లు వీళ్లే. ఆసీస్ వికెట్ కీపర్ బెత్ మూనీ కోసం గుజరాత్ జెయింట్స్ రూ.2 కోట్లు, ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎకిల్‌స్టోన్ కోసం యూపీ వారియర్స్ రూ.1.8 కోట్లు ఖర్చుపెట్టాయి. కంగారూ స్టార్ ఆల్‌రౌండర్లు ఎలీస్ పెర్రీని ఆర్సీబీ రూ.1.7 కోట్లు, తాలియా మెక్‌గ్రాత్‌ను యూపీ వారియర్స్ రూ.1.4 కోట్లకు సొంతం చేసుకున్నాయి. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మరిజేన్ కాప్ రూ.1.5 కోట్లకు దిల్లీ క్యాపిటల్స్‌తో, న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అమెలీయా కెర్ రూ.1 కోటితో ముంబయితో చేరారు. ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌ను రూ.1.1 కోట్లకే దిల్లీ దక్కించుకుంది. కివీస్ సారథి సోఫీ డివైన్‌ను ఆర్సీబీ కేవలం రూ.50 లక్షలకే దక్కించుకోవడం గమనార్హం.
కెప్టెన్లు ఖాయమేనా?
హోరాహోరీగా సాగిన వేలం ప్రక్రియలో ఫ్రాంఛైజీల వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. మహిళల ప్రిమియర్ లీగ్ ఆరంభ సీజన్ కావడంతో జట్టు నిర్మాణంపై ఫ్రాంఛైజీలు ప్రధానంగా దృష్టి సారించాయి. కెప్టెన్, బ్యాటర్లు, బౌలర్లు, ఆల్‌రౌండర్లు.. ఇలా ప్రతి విభాగంలోనూ మంచి క్రికెటర్లను ఎంచుకునే ప్రయత్నం చేశాయి. ఈ తొలి సీజన్ వేలం సాగిన తీరు చూశాక అయిదు జట్లకు కెప్టెన్లు ఖాయమయ్యారనిపిస్తోంది. ఆర్సీబీకి స్మృతి మంధాన, ముంబయికి హర్మన్‌ప్రీత్, దిల్లీ క్యాపిటల్స్‌కు మెగ్ లానింగ్, గుజరాత్ జెయింట్స్‌కు బెత్ మూనీ, యూపీ వారియర్స్‌కు దీప్తి శర్మ కెప్టెన్లుగా వ్యవహరించే అవకాశం ఉంది.
వీళ్లకు నిరాశే..
వేలంలో కొంతమంది విదేశీ స్టార్ క్రికెటర్లను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంఛైజీ ఆసక్తి చూపలేదు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ సుజీ బేట్స్ (కనీస ధర రూ.30 లక్షలు), శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టు (రూ.30 లక్షలు), దక్షిణాఫ్రికా బ్యాటర్ లారా వోల్వార్ట్ (రూ.30 లక్షలు)ను ఏ ఫ్రాంఛైజీ కొనలేదు.
మనవాళ్లు..
వేలంలో తెలుగు రాష్ట్రాల క్రికెటర్లనూ ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. ప్రస్తుతం టీమ్‌ఇండియాకు ఆడుతున్న ఏపీ పేసర్ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి చూపించింది. ఇటీవల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన హైదరాబాద్ పేసర్ యషశ్రీ, విశాఖపట్నం పేసర్ షబ్నమ్‌ను కనీస ధర రూ.10 లక్షలకు వరుసగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకున్నాయి. జాతీయ జట్టుకు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డిని కనీస ధర రూ.30 లక్షలకు దిల్లీ క్యాపిటల్స్, ఏపీ బ్యాటర్ సబ్బినేని మేఘనను కనీస ధర రూ.30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుక్కున్నాయి. కానీ అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి త్రిష (కనీస ధర రూ.10 లక్షలు)కు నిరాశే ఎదురైంది.
ఏ జట్టులో ఎవరు?
దిల్లీ క్యాపిటల్స్: జెమీమా (రూ.2.2 కోట్లు), షెఫాలి (2కోట్లు), మరిజేన్ కాప్ (1.5 కోట్లు), మెగ్ లానింగ్ (రూ.1.1 కోట్లు), అలీస్ కాప్సీ (75 లక్షలు), శిఖా పాండే (60 లక్షలు), జెస్ జొనాసెన్ (50 లక్షలు), లారా హారిస్ (45 లక్షలు), రాధా యాదవ్ (40 లక్షలు), అరుంధతి రెడ్డి, మిన్ను మాని, పూనమ్ యాదవ్, స్నేహదీప్తి, తనియా భాటియా (30 లక్షలు), తితాస్ సాధు (25 లక్షలు), జాసియా అక్తర్ (20 లక్షలు), అపర్ణ, తారా నోరిస్ (10 లక్షలు).
గుజరాత్ జెయింట్స్: ఆష్లీ గార్డ్‌నర్ (రూ.3.2 కోట్లు), బెత్ మూనీ (2 కోట్లు), జార్జియా, స్నేహ్ రానా (75 లక్షలు), అనబెల్ సదర్‌లాండ్ (70 లక్షలు), డాటిన్, సోఫియా, సుష్మ (60 లక్షలు), తనుజ (50 లక్షలు), హర్లీన్ (40 లక్షలు), అశ్వని కుమారి (35 లక్షలు), హేమలత, మాన్సి జోషి, మోనికా, సబ్బినేని మేఘన (30 లక్షలు); హర్లీ గాలా, పారుణిక, షబ్నమ్ (10 లక్షలు).
ముంబయి ఇండియన్స్: నటాలీ సీవర్ (రూ.3.2 కోట్లు), పూజ వస్త్రాకర్ (1.9 కోట్లు), హర్మన్‌ప్రీత్ (1.8 కోట్లు), యాస్తిక (1.5 కోట్లు), అమెలియా (కోటి), అమన్‌జోత్ (50 లక్షలు), హేలీ మాథ్యూస్ (40 లక్షలు), ట్రైయాన్, హీథర్ గ్రాహమ్, ఇసబెల్లె (30 లక్షలు), ప్రియాంక (20 లక్షలు), ధార గుజ్జర్, హుమైరా, జింతిమణి, నీలమ్ బిష్ఠ్, సైకా ఇషాక్, సోనమ్ యాదవ్ (10 లక్షలు).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: స్మృతి మంధాన (రూ.3.4 కోట్లు), రిచా ఘోష్ (1.9 కోట్లు), ఎలీస్ పెర్రీ (1.7 కోట్లు), రేణుక సింగ్ (1.5 కోట్లు), సోఫీ డివైన్ (50 లక్షలు), హెదర్ నైట్, మెగాన్ షట్ (40 లక్షలు), కనిక (35 లక్షలు), డేన్ వాన్, ఎరిన్, ప్రీతి (30 లక్షలు), కోమల్ (25 లక్షలు), ఆశ, దిశ, ఇంద్రాణి, పూనమ్, సహాన, శ్రేయాంక (10 లక్షలు)
యూపీ వారియర్స్: దీప్తి శర్మ (రూ.2.6 కోట్లు), సోఫీ ఎకిల్‌స్టోన్ (1.8 కోట్లు), దేవిక, తాలియా మెక్‌గ్రాత్ (1.4 కోట్లు), షబ్నిమ్ (కోటి), గ్రేస్ హారిస్ (75 లక్షలు), అలీసా హీలీ (70 లక్షలు), అంజలి శర్వాణి (55 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్, శ్వేత (40 లక్షలు), కిరణ్ నవ్‌గిరె, లారెన్ బెల్ (30 లక్షలు), లక్ష్మీ యాదవ్, పర్శవి చోప్రా, యషశ్రీ, సిమ్రాన్ (10 లక్షలు).
* ప్రతి జట్టు రూ.12 కోట్లతో వేలంలో అడుగుపెట్టాయి. మొత్తం 409 మంది వేలం బరిలో దిగగా... 87 మందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి. అందులో 30 మంది విదేశీ క్రికెటర్లు. ఒక్కో జట్టు 6 మంది విదేశీ క్రికెటర్ల చొప్పున తీసుకుంది. మొత్తం రూ.59.5 కోట్లను ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టాయి. ఆర్సీబీ, దిల్లీ, గుజరాత్ 18 మంది క్రికెటర్ల చొప్పున కొనుగోలు చేయగా.. ముంబయి 17 మందిని, యూపీ వారియర్స్ 16 మందిని సొంతం చేసుకున్నాయి. ముంబయి, యూపీ మొత్తం డబ్బు ఖర్చు చేయగా.. దిల్లీ దగ్గర రూ.35 లక్షలు, ఆర్సీబీ దగ్గర రూ.10 లక్షలు, గుజరాత్ దగ్గర రూ.5 లక్షలు మిగిలాయి.
వేలం చూస్తూ..
టీ20 ప్రపంచకప్ కోసం దక్షిణాఫ్రికాలో ఉన్న భారత మహిళా క్రికెటర్లు టీవీలో వేలాన్ని వీక్షిస్తూ కేరింతలు కొట్టారు. ‘‘కొన్నేళ్లుగా పురుష క్రికెటర్ల వేలం చూస్తూ వచ్చాం. ఇప్పుడు మహిళా క్రికెటర్లకు ఇలాంటి వేలం నిర్వహించడం గొప్పగా ఉంది. ఎంతో ఆనందంగా ఉంది. ఆర్సీబీకి గొప్ప వారసత్వం ఉంది. వీళ్లకు భారీ స్థాయిలో అభిమాన దళం ఉంది. మేం మంచి జట్టును నిర్మిస్తామనే నమ్మకంతో ఉన్నాం’’ అని మంధాన చెప్పింది. ‘‘ఈ అవకాశం కోసం ఎంతో కాలంగా ఎదురు చూశాం. యూపీకి చెందిన నేను యూపీ వారియర్స్ జట్టులోకి వెళ్లడం గొప్పగా అనిపిస్తోంది. జట్టు కోసం వీలైన సహకారం అందిస్తా’’ అని దీప్తి పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Politics News
Chandrababu: తెలంగాణలో తెదేపాకు పూర్వ వైభవం వస్తుంది: చంద్రబాబు
-
India News
Amruta Fadnavis: ఆ క్రికెట్ బుకీని అమృతా ఫడణవీస్ పట్టించారిలా..!
-
General News
KTR: ఐటీ ఉత్పత్తుల నుంచి ఆహార ఉత్పత్తుల వరకు అద్భుత పురోగతి: కేటీఆర్
-
World News
Afghanistan: అఫ్గానిస్థాన్ బాంబుపేలుడు.. డిప్యూటీ గవర్నర్ మృతి
-
Sports News
WTC Final: రేపటి నుంచే డబ్ల్యూటీసీ ఫైనల్.. కెప్టెన్ రోహిత్ శర్మకు గాయం!