IND vs AUS: సిరీస్ వస్తుందా.. పోతుందా?
వరుసగా రెండు క్లీన్‌స్వీప్‌ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్న టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో కష్టం మీద గెలిచి, రెండో వన్డేలో చిత్తుగా ఓడిన రోహిత్ సేనకు..
నేడే ఆస్ట్రేలియాతో మూడో వన్డే
మధ్యాహ్నం 1:30 నుంచి
వరుసగా రెండు క్లీన్‌స్వీప్‌ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్న టీమ్‌ఇండియా.. ఆ జట్టుతో సిరీస్ ఫలితాన్ని తేల్చే కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో కష్టం మీద గెలిచి, రెండో వన్డేలో చిత్తుగా ఓడిన రోహిత్ సేనకు.. బుధవారం చెన్నైలో కంగారూల నుంచి సవాలు తప్పకపోవచ్చు. చెపాక్ పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశాలున్న నేపథ్యంలో మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఆసక్తికరం.
సొంతగడ్డపై ఒత్తిడి దాటి.. బ్యాటింగ్ మెరుగుపర్చుకుని టీమ్‌ఇండియా సిరీస్ దక్కించుకుంటుందా? లేదా అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి ఆస్ట్రేలియా ట్రోఫీ ముద్దాడుతుందా?.. అన్నది బుధవారం తేలిపోనుంది. మూడు వన్డేల సిరీస్‌లో విజేతను నిర్ణయించే మూడో మ్యాచ్ నేడే. తొలి వన్డేలో రాహుల్, జడేజా ప్రదర్శన కారణంగా గట్టెక్కిన భారత్.. రెండో వన్డేలో పూర్తిగా విఫలమైంది. బ్యాటింగ్‌లో మిచెల్ స్టార్క్‌ను ఎదుర్కోలేక.. బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌ను అడ్డుకోలేక చిత్తయింది. దీంతో సిరీస్ 1-1తో సమమైంది. ఇప్పుడు కీలకమైన చివరి వన్డేలో భారత్ గెలవాలంటే బ్యాటింగ్, బౌలింగ్ మెరుగుపడాల్సిందే.
ఆ నలుగురు నిలవాలి: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్.. భారత బలమైన టాప్‌ఆర్డర్ ఇది. ఆసీస్‌తో సిరీస్‌లో మాత్రం ఇప్పటివరకూ వీళ్లు అంచనాలను అందుకోలేదు. తొలి వన్డేలో గిల్, కోహ్లి, సూర్య (0) కలిపి చేసిన పరుగులు 24. విశాఖ మ్యాచ్‌లో రోహిత్‌తో సహా ఈ నలుగురు కలిపి సాధించింది 44 పరుగులు. ఇందులో గిల్, సూర్య సున్నాకే వెనుదిరిగారు. ఇప్పుడు ఈ మూడో వన్డేలో జట్టు గెలవాలంటే వీళ్లు నిలవాలి. టెక్నిక్‌ను కాస్త మార్చుకుని, మానసిక బలం పెంచుకుని స్టార్క్‌ను సమర్థంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా గిల్, సూర్య గత రెండు వన్డేల్లో స్టార్క్ బౌలింగ్‌లో ఒకే తరహాలో వికెట్ పారేసుకున్నారు. దూరంగా వెళ్తున్న బంతిని వేటాడి గిల్, వికెట్ల ముందు సూర్య దొరికిపోయారు. వీళ్లు ఆ పొరపాట్లు దిద్దుకోవాల్సి ఉంది. తనపై జట్టు నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత సూర్యపై ఉంది. హార్దిక్ పాండ్య కూడా ఆల్‌రౌండర్ పాత్రకు న్యాయం చేయడం జట్టుకు అవసరం.
బౌలర్లు మెరవాలి..: తొలి వన్డేలో ఆస్ట్రేలియా పోరాడే స్కోరు చేయగలిగిందంటే.. రెండో వన్డేలో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిందంటే అందుకు ప్రధాన కారణం మిచెల్ మార్ష్. వార్నర్ గైర్హాజరీలో ఈ సిరీస్‌తో ఓపెనర్ అవతారం ఎత్తిన అతను.. విధ్వంసకాండ కొనసాగిస్తున్నాడు. గత మ్యాచ్‌లో అతనికి తోడు ట్రేవిస్ హెడ్ కూడా చెలరేగాడు. వీళ్ల బాదుడుకు షమి, సిరాజ్ సహా భారత బౌలర్లందరూ తేలిపోయారు. ఈ సిరీస్ భారత కైవసం కావాలంటే ఈ ఇద్దరిని వీలైనంత త్వరగా పెవిలియన్ చేర్చాలి. అందుకు మన బౌలర్లు సరైన ప్రణాళికలతో మైదానంలో అడుగు పెట్టాలి. ముఖ్యంగా మార్ష్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలి. గత మ్యాచ్ కూర్పునే కొనసాగించి జడేజాతో పాటు ఇద్దరు స్పిన్నర్లను ఆడించే అవకాశం ఉంది. కుల్‌దీప్ స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను తీసుకొచ్చే ఆస్కారముంది.
వార్నర్ వస్తాడా?: సిరీస్‌పై కన్నేసిన కంగారూలు అందుకు తగిన అస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. టీమ్‌ఇండియాతో దిల్లీ టెస్టులో కంకషన్‌తో పాటు గాయానికి గురై ఆ తర్వాత మ్యాచ్‌లకు దూరమైన ఓపెనర్ డేవిడ్ వార్నర్ తిరిగి జట్టులోకి రావొచ్చు. ఓపెనర్లుగా వార్నర్, హెడ్‌కు మంచి రికార్డే ఉంది. ఏడు మ్యాచ్‌ల్లో ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ జోడీ.. అందులో మూడింట్లో 284, 269, 147 భాగస్వామ్యాలను నెలకొల్పింది. వార్నర్ వస్తే మార్ష్ అవసరాన్ని బట్టి బ్యాటింగ్ ఆర్డర్లో వేరే స్థానంలో ఆడతాడు. లబుషేన్‌కు జట్టులో చోటు దక్కకపోవచ్చు. మ్యాక్స్‌వెల్ కూడా ఫిట్‌గా ఉంటే నేరుగా బరిలో దిగుతాడు. మూడో స్పిన్నర్‌గా అగర్‌ను ఆడించే అవకాశముంది.
జట్లు (అంచనా)...
భారత్: రోహిత్, శుభ్‌మన్, కోహ్లి, సూర్యకుమార్, కేఎల్ రాహుల్, హార్దిక్, జడేజా, అక్షర్, కుల్‌దీప్/సుందర్, షమి, సిరాజ్;
ఆస్ట్రేలియా: వార్నర్, హెడ్, స్మిత్, మార్ష్, కేరీ, గ్రీన్, మ్యాక్స్‌వెల్, స్టాయినిస్, అబాట్/అగర్/ఎలిస్, స్టార్క్, జంపా.
పిచ్ ఎలా ఉంది?
చెపాక్ పిచ్ సంప్రదాయంగా స్పిన్‌కు అనుకూలిస్తుంది. ఈ సారి కూడా స్పిన్నర్లు ఆధిపత్యం చలాయించొచ్చు. కానీ వేడి వాతావరణం కారణంగా పేసర్లు స్వింగ్, సీమ్ రాబట్టే ఆస్కారముంది. ఈ మైదానంలో ఫలితం తేలిన 21 వన్డేల్లో మొదటి సారి బ్యాటింగ్ చేసిన జట్టు 13 సార్లు గెలిచింది. చివరగా ఇక్కడ 2019 డిసెంబర్ 15న వన్డే జరిగింది. ఇక్కడ ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన రెండు వన్డేల్లో చెరొక విజయం సాధించాయి.
46
వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన రెండో భారత ఆటగాడిగా నిలిచేందుకు కేఎల్ రాహుల్‌కు అవసరమైన పరుగులు. అతను ఇప్పటివరకూ 51 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1954 పరుగులు చేశాడు.
61
ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో అత్యంత వేగంగా 5 వేల పరుగుల మైలురాయి అందుకున్న రెండో ఆటగాడిగా నిలిచేందుకు స్మిత్‌కు అవసరమైన పరుగులు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
కుటుంబంలో మద్యం చిచ్చు.. భార్యాభర్తల ఆత్మహత్య
-
India News
నా భర్త కళ్లలో చెదరని నిశ్చలత చూశా
-
India News
ప్రపంచంలో ఎక్కడినుంచైనా శబరి గిరీశునికి కానుకలు
-
General News
పెళ్లికి వచ్చినా బలవంతపు తరలింపులేనా?
-
Ts-top-news News
38 రోజులపాటు జోసా కౌన్సెలింగ్
-
India News
ప్రతి 5 విద్యార్థి వీసాల్లో ఒకటి భారతీయులకే.. అమెరికా రాయబారి వెల్లడి