LSG vs MI: వాహ్‌.. మోసిన్‌!.. లఖ్‌నవూ అనూహ్య విజయం

ప్లేఆఫ్స్‌ ఆశలు మెరుగుపడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ అదరగొట్టింది. సొంతగడ్డపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది.

Updated : 17 May 2023 08:49 IST

ఆఖరి ఓవర్లో అయిదే పరుగులు

ముంబయికి షాక్‌

స్టాయినిస్‌ మేటి ఇన్నింగ్స్‌

క్రీజులో టిమ్‌ డేవిడ్‌ లాంటి విధ్వంసక బ్యాటర్‌కు తోడు కామెరూన్‌ గ్రీన్‌ ఉన్నాడు. డేవిడ్‌ అప్పటికే సిక్సర్ల మోత మోగిస్తున్నాడు. చివరి ఓవర్లో ముంబయి విజయానికి కావాల్సినవి 11 పరుగులే. లఖ్‌నవూ పనైపోయిందనే అంచనాకు వచ్చేశారందరూ! కానీ ఆఖరి ఓవర్‌ వేసేందుకు బంతి అందుకున్న మోసిన్‌ ఖాన్‌ అద్భుతమే చేశాడు. తీవ్ర ఒత్తిడిలో బుల్లెట్‌ లాంటి బంతులు సంధించి.. గ్రీన్‌, డేవిడ్‌లకు చెక్‌ పెట్టాడు. ఆరు బంతుల్లో అయిదు పరుగులే ఇచ్చి లఖ్‌నవూకు అద్భుత విజయాన్ని కట్టబెట్టాడు. మొదట స్టాయినిస్‌ (89 నాటౌట్‌; 47 బంతుల్లో 4×4, 8×6) మేటి ఇన్నింగ్స్‌తో సూపర్‌జెయింట్స్‌ విజయానికి బలమైన పునాది వేశాడు.

లఖ్‌నవూ

ప్లేఆఫ్స్‌ ఆశలు మెరుగుపడాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లఖ్‌నవూ అదరగొట్టింది. సొంతగడ్డపై ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ముంబయిని ఓడించింది. బ్యాటింగ్‌ కష్టంగా ఉన్న పిచ్‌పై స్టాయినిస్‌, కృనాల్‌ పాండ్య (49 రిటైర్డ్‌ హర్ట్‌; 42 బంతుల్లో 1×4, 1×6)ల పోరాటంతో 3 వికెట్లకు 177 పరుగులు చేసిన ఎల్‌ఎస్‌జీ.. తర్వాత ముంబయిని 172/5కు కట్టడి చేసింది. రవి బిష్ణోయ్‌ (2/26), మోసిన్‌ ఖాన్‌ (1/26), యశ్‌ ఠాకూర్‌ (2/40) ఆ జట్టును దెబ్బ తీశారు. ఇషాన్‌ కిషన్‌ (59; 39 బంతుల్లో 8×4, 1×6), టిమ్‌ డేవిడ్‌ (32 నాటౌట్‌; 19 బంతుల్లో 1×4, 3×6) ముంబయిని గెలిపించడానికి గట్టి ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. 13 మ్యాచ్‌ల్లో లఖ్‌నవూకిది ఏడో విజయం కాగా.. అన్నే మ్యాచ్‌లాడిన ముంబయి ఆరో ఓటమిని ఖాతాలో వేసుకుంది.

ఆరంభం అదిరినా..: ముంబయి ఛేదన మొదలైన తీరు చూస్తే.. ఆ జట్టు లక్ష్యాన్ని అలవోకగా ఛేదించేస్తుందనిపించింది. ఆరంభంలో లఖ్‌నవూ బౌలింగ్‌ పేలవంగా సాగడం, ఫీల్డింగ్‌ తప్పిదాలు కూడా తోడవడం ముంబయికి కలిసొచ్చింది. పిచ్‌ అంత తేలిగ్గా లేకపోయినా.. ఇషాన్‌ కిషన్‌ ఆరంభం నుంచే విధ్వంసక బ్యాటింగ్‌తో ముంబయికి అదిరే ఆరంభాన్నిచ్చాడు. అతను లఖ్‌నవూ బౌలర్ల లయను దెబ్బ తీశాడు. రోహిత్‌ (37; 25 బంతుల్లో 1×4, 3×6) సైతం సమయోచితంగా షాట్లు ఆడటంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. పవర్‌ ప్లే ముగిసేసరికి ముంబయి 58/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. ఆ తర్వాత కూడా ఓపెనర్లు నిలకడగా ఆడారు. అయితే స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ రాకతో ముంబయి కథ మారింది. కట్టుదిట్టంగా బంతులేసి రోహిత్‌, ఇషాన్‌లను అసహనానికి గురి చేసి బిష్ణోయ్‌.. వాళ్లు అడ్డదిడ్డంగా షాట్లు ఆడేలా ప్రేరేపించాడు. ఫలితంగా ఇద్దరూ స్వల్ప వ్యవధిలో క్యాచ్‌లు ఇచ్చి ఔటయ్యారు. తర్వాత ముంబయి ఇన్నింగ్స్‌ ఒడుదొడుకులతోనే సాగింది. యశ్‌ ఠాకూర్‌ వేసిన 15వ ఓవర్లో సూర్యకుమార్‌ (7) తన మార్కు స్కూప్‌ షాట్‌ కొట్టబోయి బంతిని వికెట్ల మీదికి ఆడుకున్నాడు. కాసేపటికే వధేరా (16) కూడా వెనుదిరిగాడు. చివరి 20 బంతుల్లో 45 పరుగులు చేయాల్సి రావడంతో ముంబయికి కష్టమే అనిపించింది. కానీ డేవిడ్‌ ప్రతికూల పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడుతూ జట్టు ఆశలను నిలిపి ఉంచాడు. చివరి 2 ఓవర్లలో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నవీనుల్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాదడంతో సమీకరణం తేలికగా మారింది. చివరి ఓవర్లో 11 పరుగులే అవసరం కావడం.. డేవిడ్‌కు తోడు గ్రీన్‌ (4 నాటౌట్‌) క్రీజులో ఉండటంతో ముంబయే గెలుస్తుందనిపించింది. కానీ మోసిన్‌ ఒత్తిడిలో గొప్పగా బంతులేశాడు. 1, 4 బంతులకు పరుగే ఇవ్వని అతను.. 2, 3, 5 బంతులకు సింగిల్సే ఇవ్వడంతో చివరి బంతి పడటానికి ముందే ముంబయికి  దారులు మూసుకుపోయాయి.

సూపర్‌ స్టాయినిస్‌: మొదట బ్యాటింగ్‌ కష్టంగా సాగిన పిచ్‌పై స్టాయినిస్‌ మేటి ఇన్నింగ్స్‌ ఆడటంతో లఖ్‌నవూ అనుకున్నదానికంటే చాలా ఎక్కువ స్కోరే చేసింది. ఓపెనర్‌ అవతారం ఎత్తిన దీపక్‌ హుడా (5)తో పాటు గత మ్యాచ్‌ హీరో ప్రేరక్‌ మన్కడ్‌ (0)లను వరుస బంతుల్లో బెరెన్‌డార్ఫ్‌ (2/30) ఔట్‌ చేయగా.. నిలకడగా రాణిస్తున్న డికాక్‌ (16)ను చావ్లా (1/26) బుట్టలో వేయడంతో 35/3తో పీకల్లోతు కష్టాల్లో పడింది లఖ్‌నవూ. వికెట్ల పతనానికి తోడు పరుగుల మందగమనంతో ఆ జట్టు తీవ్రంగా ఇబ్బంది పడింది. ఈ దశలో తాత్కాలిక కెప్టెన్‌ కృనాల్‌తో కలిసి స్టాయినిస్‌ జట్టును ఆదుకున్నా.. పరుగుల వేగం మాత్రం పెంచలేకపోయాడు. 10 ఓవర్లకు లఖ్‌నవూ చేసింది 68 పరుగులే. తర్వాతి 5 ఓవర్లలో కాస్త వేగం పెరిగి 40 పరుగులు వచ్చాయి. లఖ్‌నవూ మరో వికెట్‌ కోల్పోనప్పటికీ.. ముంబయి బౌలింగ్‌ కట్టుదిట్టంగా సాగడం, పిచ్‌ కూడా కష్టంగా ఉండటంతో ఆ జట్టు 150కి మించేలా కనిపించలేదు. కానీ స్టాయినిస్‌ చివరి 5 ఓవర్లలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జోర్డాన్‌ వేసిన 18వ ఓవర్లో అతను 2 సిక్సర్లు,  3 ఫోర్లు బాదేయడంతో ఏకంగా 24 పరుగులు వచ్చాయి. తర్వాతి ఓవర్లోనూ (బెరెన్‌డార్ఫ్‌).. స్టాయినిస్‌ వరుసగా రెండుసార్లు  బంతిని స్టాండ్స్‌లోకి పంపించాడు. ఇన్నింగ్స్‌ చివరి బంతికి కూడా స్టాయినిస్‌ సిక్స్‌ కొట్టాడు. లఖ్‌నవూ చివరి 5 ఓవర్లలో 69 పరుగులు చేయగా.. అందులో 55 స్టాయినిస్‌వే కావడం విశేషం.

లఖ్‌నవూ ఇన్నింగ్స్‌: దీపక్‌ హుడా (సి) డేవిడ్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 5; డికాక్‌ (సి) ఇషాన్‌ (బి) చావ్లా 16; ప్రేరక్‌ (సి) ఇషాన్‌ (బి) బెరెన్‌డార్ఫ్‌ 0; కృనాల్‌ రిటైర్డ్‌ హర్ట్‌ 49; స్టాయినిస్‌ నాటౌట్‌ 89; పూరన్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 177; వికెట్ల పతనం: 1-12, 2-12, 3-35; బౌలింగ్‌: బెరెన్‌డార్ఫ్‌ 4-0-30-2; జోర్డాన్‌ 4-0-50-0; షోకీన్‌ 3-0-20-0; చావ్లా 3-0-26-1; ఆకాశ్‌ మధ్వాల్‌ 4-0-30-0; గ్రీన్‌ 2-0-16-0

ముంబయి ఇన్నింగ్స్‌: ఇషాన్‌ (సి) నవీనుల్‌ (బి) బిష్ణోయ్‌ 59; రోహిత్‌ (సి) హుడా (బి) బిష్ణోయ్‌ 37; సూర్యకుమార్‌ (బి) యశ్‌ 7; నేహల్‌ (సి) గౌతమ్‌ (బి) మోసిన్‌ఖాన్‌ 16; డేవిడ్‌ నాటౌట్‌ 32; విష్ణు వినోద్‌ (సి) పూరన్‌ (బి) యశ్‌ 2; గ్రీన్‌ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-90, 2-103, 3-115, 4-131, 5-145; బౌలింగ్‌: కృనాల్‌ 4-0-27-0; మోసిన్‌ఖాన్‌ 3-0-26-1; నవీనుల్‌ హక్‌ 4-0-37-0; యశ్‌ ఠాకూర్‌ 4-0-40-2; స్వప్నిల్‌ 1-0-11-0; బిష్ణోయ్‌ 4-0-26-2

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని