Asia Cup 2023 Final - Siraj: లంకను అంటించేశాడు

ఆసియా కప్‌ సూపర్‌-4లో శ్రీలంకపై కష్టపడి గెలిచింది భారత్‌. ఫైనల్‌ కూడా అదే మైదానంలో.. ప్రత్యర్థి కూడా లంకనే కావడం.. పిచ్‌ స్పిన్‌కే అనుకూలిస్తుందనే అంచనాలు ఉండటంతో రోహిత్‌ సేనకు మరోసారి సవాలు తప్పదనుకున్నారంతా!

Updated : 18 Sep 2023 15:24 IST

టీమ్‌ఇండియాదే ఆసియా కప్‌
సిరాజ్‌ సంచలన బౌలింగ్‌
ఆరు వికెట్లతో విజృంభణ
50కే కుప్పకూలిన లంక

ఆసియా కప్‌ సూపర్‌-4లో శ్రీలంకపై కష్టపడి గెలిచింది భారత్‌. ఫైనల్‌ కూడా అదే మైదానంలో.. ప్రత్యర్థి కూడా లంకనే కావడం.. పిచ్‌ స్పిన్‌కే అనుకూలిస్తుందనే అంచనాలు ఉండటంతో రోహిత్‌ సేనకు మరోసారి సవాలు తప్పదనుకున్నారంతా!

వర్షం కారణంగా 40 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్‌ మొదలైంది. వెంటనే మైదానంలో తుపాను మొదలైంది. అది అలాంటి ఇలాంటి తుపాను కాదు.. వేగంతో, దూకుడుతో ప్రత్యర్థి జట్టును ముంచేసిన ఆ తుపాను పేరు మహమ్మద్‌ సిరాజ్‌(Siraj)!

మామూలు బౌలింగా అది. బంతులు కావవి బుల్లెట్లు. వాటిని ఆడినా కష్టమే.. ఆడకుండా వదిలేసినా ఇబ్బందే. బంతి బ్యాట్‌కు తాకకుంటే బౌల్డ్‌. తాకితే క్యాచ్‌ ఔట్‌. పోనీ ప్యాడ్‌తో కాచుకుందామని చూస్తే ఎల్బీ! ఇక బ్యాటర్‌ ఏం చేయాలి పాపం! ప్రత్యర్థులను చూసి కసితో రగిలిపోవడం పోయి.. అయ్యో పాపం అని జాలిగా చూసే పరిస్థితి.

తన బౌలింగ్‌ దాడిని మెయిడెన్‌తో మొదలెట్టి.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అతను.. తర్వాతి ఓవర్లో       ఏకంగా నాలుగు వికెట్లతో రెచ్చిపోయాడు. ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మొత్తంగా  ఆరు వికెట్లతో చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన చేశాడు.

ఇంకేముంది.. 50 ఓవర్ల మ్యాచ్‌ కాస్తా 50 పరుగుల పోరుగా మారిపోయింది. లక్ష్యాన్ని 6.1 ఓవర్లలోనే ఛేదించిన భారత్‌ ఎనిమిదోసారి ఆసియా కప్‌ విజేతగా నిలిచింది. ప్రపంచకప్‌కు ముందు ఈ విజయం జట్టుకు గొప్ప ఉత్సాహాన్నిచ్చేదే.

కొలంబో

టీమ్‌ఇండియాదే ఆసియా కప్‌. ఆదివారం ఫైనల్లో 10 వికెట్ల తేడాతో శ్రీలంకను భారత్‌ చిత్తుచేసింది. ఈ మ్యాచ్‌లో జట్టు గెలుపు కంటే కూడా అది విజయం సాధించిన తీరు అభిమానులకు మరింత కిక్కునిచ్చింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ (6/21) ధాటికి లంక విలవిల లాడంతో మ్యాచ్‌ ఏకపక్షంగా మారిపోయింది. మొదట శ్రీలంక కేవలం 15.2 ఓవర్లలోనే 50 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో 17 పరుగులు చేసిన కుశాల్‌ మెండిస్‌ టాప్‌స్కోరర్‌. సిరాజ్‌ బౌలింగ్‌కు చిగురుటాకులా వణికిపోయిన లంకను హార్దిక్‌ పాండ్య (3/3) మరింత దెబ్బకొటాడు. అయిదుగురు లంక బ్యాటర్లు డకౌటయ్యారు. అనంతరం ఛేదనలో టీమ్‌ఇండియా ఒక్క వికెట్టూ కోల్పోకుండా 6.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్లు ఇషాన్‌  కిషన్‌ (23 నాటౌట్‌; 18 బంతుల్లో 3×4), శుభ్‌మన్‌ గిల్‌ (27 నాటౌట్‌; 19 బంతుల్లో 6×4) ఆడుతూ పాడుతూ పని పూర్తిచేశారు. పిచ్‌ పేసర్లకు అనుకూలించడంతో లంక బంతితో ఏమైనా పోటీనిస్తుందేమో అనిపించింది. కానీ ఆ అవకాశమే ఇవ్వకుండా, ఒక్క వికెట్టూ కూడా పడనివ్వకుండా ఇషాన్‌, గిల్‌ ఛేదనను ముగించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను త్వరగా ముగించాలనే ఉద్దేశంతో కనిపించారు. రెండో ఓవర్లో ఇషాన్‌ రెండు ఫోర్లు దంచగా.. మూడో ఓవర్లో శుభ్‌మన్‌ మూడు ఫోర్లు కొట్టాడు. అదే ఊపుతో ఈ ఓపెనర్లు జట్టును గెలిపించి మైదానం వీడారు. టోర్నీలో 5 మ్యాచ్‌ల్లో 11.44 సగటుతో 9 వికెట్లు తీసిన కుల్‌దీప్‌ యాదవ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా నిలిచాడు.

ఇలా మొదలైందో లేదో..: వర్షంతో మ్యాచ్‌ ఆలస్యమవడంతో టీవీ కట్టేసినా లేదా ఫోన్‌ నుంచి మొహం తిప్పేసిన భారత అభిమానులు ఆ తర్వాత బాధపడే ఉంటారు. కాస్త ఆలస్యంగా మ్యాచ్‌ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయే ఉంటారు. ఎందుకంటే సిరాజ్‌ విజృంభణలో శ్రీలంక ఇన్నింగ్స్‌ ఇట్టే ముగిసిపోయింది. ఇలా మ్యాచ్‌ మొదలైందో లేదో అలా వికెట్ల పతనం ప్రారంభమైంది. టాస్‌ గెలిచి పిచ్‌ మందకొడిగా ఉందని లంక బ్యాటింగ్‌ ఎంచుకుంది. కానీ ఆ తర్వాత వర్షం పడటంతో కథ మారిపోయింది. 1-1, 2-8, 3-8, 4-8, 5-12, 6-12.. ఇదీ వికెట్లు పడ్డ క్రమం. 12 పరుగులకే ఆరు వికెట్లు.. ఇదీ సిరాజ్‌ అసాధారణ బౌలింగ్‌ దాడికి నిదర్శనం. ఫాస్ట్‌బౌలర్లకు అనుకూలించిన పిచ్‌పై సిరాజ్‌ ఆగలేదు. జట్టుకు తొలి వికెట్‌ అందించింది మాత్రం బుమ్రానే. ఇన్నింగ్స్‌ మూడో బంతికే కుశాల్‌ పెరీరా (0)ను అతను ఔట్‌ చేశాడు. మరో ఎండ్‌ నుంచి బౌలింగ్‌ వచ్చిన సిరాజ్‌.. తొలి ఓవర్‌ మెయిడిన్‌ వేశాడు. కానీ తన తర్వాతి ఓవర్లోనే అంతా మారిపోయింది. ఆ ఓవరే జట్టు గమనాన్ని మార్చింది. భారత్‌ను విజయం దిశగా నడిపింది. ఒకే ఓవర్లో నిశాంక (2), సమర విక్రమ (0), అసలంక (0), ధనంజయ డి సిల్వా (4)ను సిరాజ్‌ వెనక్కిపంపాడు. తన తర్వాతి ఓవర్లో కెప్టెన్‌ శానక (0)ను సిరాజ్‌ పెవిలియన్‌ చేర్చాడు. దీంతో 6 ఓవర్లకే 13/6తో లంక పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ దశలో దునిత్‌ (8)తో కలిసి కుశాల్‌ మెండిస్‌ కాసేపు వికెట్లు పడకుండా అడ్డుకున్నాడు. కానీ అది కేవలం అయిదు ఓవర్ల పాటే. మెండిస్‌ను సిరాజ్‌ ఔట్‌ చేసి లంక పతనాన్ని వేగవంతం చేశాడు. మంచి బౌన్స్‌ రాబడుతూ.. కచ్చితమైన లెంగ్త్‌తో, సరైన ప్రదేశంలో బంతులు వేస్తూ సిరాజ్‌ వికెట్లు కూల్చాడు. అతని బౌలింగ్‌కు బెంబేలెత్తిన లంక బ్యాటర్లు.. వికెట్లు సమర్పించుకోవడం తప్ప ఇంకేం చేయలేకపోయారు. హార్దిక్‌ లోయర్‌ ఆర్డర్‌ పని పట్టాడు. దునిత్‌ను మొదట బుట్టలో వేసుకున్న హార్దిక్‌.. అనంతరం 16వ ఓవర్‌ తొలి రెండు బంతులకు వరుసగా మదుశాన్‌ (1), పతిరన (0)ను ఔట్‌ చేసి లంక ఇన్నింగ్స్‌ను ముగించాడు.

శ్రీలంక ఇన్నింగ్స్‌: నిశాంక (సి) జడేజా (బి) సిరాజ్‌ 2; కుశాల్‌ పెరీరా (సి) రాహుల్‌ (బి) బుమ్రా 0; కుశాల్‌ మెండిస్‌ (బి) సిరాజ్‌ 17; సమరవిక్రమ ఎల్బీ (బి) సిరాజ్‌ 0; అసలంక (సి) ఇషాన్‌ (బి) సిరాజ్‌ 0; ధనంజయ డిసిల్వా (సి) రాహుల్‌ (బి) సిరాజ్‌ 4; శానక (బి) సిరాజ్‌ 0; దునిత్‌ (సి) రాహుల్‌ (బి) హార్దిక్‌ 8; హేమంత నాటౌట్‌ 13; మదుశాన్‌ (సి) కోహ్లి (బి) హార్దిక్‌ 1; పతిరన (సి) ఇషాన్‌ (బి) హార్దిక్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం: (15.2 ఓవర్లలో ఆలౌట్) 50; వికెట్ల పతనం: 1-1, 2-8, 3-8, 4-8, 5-12, 6-12, 7-33, 8-40, 9-50; బౌలింగ్‌: బుమ్రా 5-1-23-1; సిరాజ్‌ 7-1-21-6; హార్దిక్‌ 2.2-0-3-3; కుల్‌దీప్‌ 1-0-1-0

భారత్‌ ఇన్నింగ్స్‌: ఇషాన్‌ కిషన్‌ నాటౌట్‌ 23; శుభ్‌మన్‌ గిల్‌ నాటౌట్‌ 27; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం: (6.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా) 51; బౌలింగ్‌: మదుశాన్‌ 2-0-21-0, పతిరన 2-0-21-0, దునిత్‌ 2-0-7-0; అసలంక 0.1-0-1-0


3

ఆసియా కప్‌ను రెండు సార్లు గెలిచిన మూడో భారత కెప్టెన్‌ రోహిత్‌. కోహ్లి విశ్రాంతి నేపథ్యంలో 2018 ఆసియాకప్‌లో రోహిత్‌ సారథ్యంలో ఆడిన జట్టు టైటిల్‌ నెగ్గింది. అజహరుద్దీన్‌ (1990-91, 1995), ధోని (2010, 2016) కూడా రెండు సార్లు జట్టును గెలిపించారు.


8

భారత్‌ గెలిచిన ఆసియా కప్‌లు. వన్డేల్లో ఏడు సార్లు (1984, 1988, 1990-91, 1995, 2010, 2018, 2023), టీ20ల్లో ఓ సారి (2016) విజేతగా నిలిచింది.


50

భారత్‌పై వన్డేల్లో  శ్రీలంకకిదే అత్యల్ప స్కోరు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని