Mohammed Siraj: చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ వేసిన సిరాజ్‌

క్రికెట్లో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం అలాంటిది. ఇప్పుడు మన సిరాజ్‌ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు.

Updated : 18 Sep 2023 15:22 IST

క్రికెట్లో కొన్ని రికార్డులు చాలా అరుదుగా నమోదవుతుంటాయి. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీయడం అలాంటిది. ఇప్పుడు మన సిరాజ్‌ ఆ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. చరిత్రలో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోయే ఓవర్‌ వేశాడు. ఇన్నింగ్స్‌లో నాలుగో ఓవర్లో ఈ అద్భుతం జరిగింది. ఒక్కో బంతిని ఒక్కోలా వేసి.. వేర్వేరు వ్యూహాలతో బ్యాటర్లను సిరాజ్‌ బుట్టలో వేసుకున్నాడు. తొలి, మూడు, నాలుగు, ఆరు బంతులకు వికెట్లు పడగొట్టాడు. మధ్యలో హ్యాట్రిక్‌ దక్కకపోయినా.. నిప్పులు చెరిగి నాలుగు వికెట్ల వీరుడిగా నిలిచాడు. ఆఫ్‌స్టంప్‌ ఆవల లెంగ్త్‌ బంతితో ఓవర్‌ను ఆరంభించాడు సిరాజ్‌. ఆ బంతిని కవర్‌డ్రైవ్‌ ఆడేందుకు ప్రయత్నించిన నిశాంక.. పాయింట్‌లో డైవ్‌ చేస్తూ జడేజా అందుకున్న క్యాచ్‌కు నిష్క్రమించాడు. మూడో బంతిని తెలివిగా లోపలికి స్వింగ్‌ చేసిన సిరాజ్‌.. సమరవిక్రమను వికెట్ల ముందు బలితీసుకున్నాడు. అంపైర్‌ వెంటనే వేలెత్తేశాడు.సమరవిక్రమ సమీక్ష కోరినా ఫలితం దక్కలేదు. వెంటనే ఫుల్‌ బంతితో అసలంకను సిరాజ్‌ ఔట్‌ చేశాడు. బంతిని కట్‌ చేయాలని బ్యాటర్‌ ప్రయత్నించగా.. అది ఇషాన్‌ చేతిలో పడింది. సిరాజ్‌ హ్యాట్రిక్‌ను అడ్డుకున్న ధనంజయ డిసిల్వా ఫోర్‌ కొట్టాడు. బంతిని ఆపడం కోసం సిరాజ్‌ బౌండరీ లైన్‌ వరకూ పరుగెత్తడం విశేషం. సిరాజ్‌ తర్వాతి బంతికే ధనంజయ కథ ముగించాడు. దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి అతను కీపర్‌కు చిక్కాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని