Shubman Gill: నా అంచనాలను అందుకోలేకపోయా

ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొదలయ్యే సమయానికి యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై చాలా ఒత్తిడే ఉంది. పెద్దగా ఫామ్‌లో లేకపోవడం అందుకు కారణం. పైగా ఓపెనింగ్‌ స్థానం నుంచి మూడో స్థానానికి మారాల్సివచ్చింది.

Published : 22 Feb 2024 04:23 IST

రాంచి: ఇంగ్లాండ్‌తో సిరీస్‌ మొదలయ్యే సమయానికి యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌పై చాలా ఒత్తిడే ఉంది. పెద్దగా ఫామ్‌లో లేకపోవడం అందుకు కారణం. పైగా ఓపెనింగ్‌ స్థానం నుంచి మూడో స్థానానికి మారాల్సివచ్చింది. కానీ ఒత్తిడిని అధిగమిస్తూ పరుగుల బాట పట్టాడు. మూడు టెస్టులు ముగిసేసరికి ఫామ్‌తో కనిపిస్తున్నాడు. ఓ సెంచరీ, ఓ 91 సహా 42 సగటుతో 252 పరుగులు చేశాడు. అయితే తాను తన బ్యాటింగ్‌లో విపరీతంగా సాంకేతిక మార్పులేమీ చేయలేదని గిల్‌ అన్నాడు. తనపై తాను పెట్టుకున్న అంచనాల ఒత్తిడిని తట్టుకోవడమే ముఖ్యమని చెప్పాడు. ‘‘బయటి వాళ్లు ఏమన్నా నేనేమీ పట్టించుకోను. దేశం కోసం, జట్టు కోసం ఎలా ఆడాలన్నదానిపై ప్రతి ఒక్కరికి కొన్ని అంచనాలుంటాయి. అలా నాపై నేను పెట్టుకున్న అంచనాలు అందుకోలేనందుకు నిరాశకు గురయ్యా. కానీ నా దృక్పథంలో ఎలాంటి మార్పు లేదు. ఇప్పటికీ నా అంచనాల్లో ఎలాంటి మార్పు లేదు. వైఫల్యాలను మరిచిపోయి ఎంత త్వరగా తర్వాతి సవాల్‌కు సిద్ధమవుతామన్నదే ముఖ్యం. పెద్ద ఆటగాడికి, సగటు ఆటగాడికి మధ్య తేడా ఇదే’’ అని గిల్‌ వివరించాడు. 24 ఏళ్ల గిల్‌.. విశాఖపట్నం టెస్టుకు ముందు 11 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క అర్ధశతకం కూడా చేయలేకపోయాడు. విశాఖ టెస్టుతో ఫామ్‌ అందుకున్న అతడు.. మిగతా మ్యాచ్‌ల్లోనూ అదే జోరు కొనసాగించాలనుకుంటున్నాడు. మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినప్పుడు పరిస్థితులకు తగ్గట్లు ఆడడం తప్పనిసరి అని గిల్‌ చెప్పాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని