చెన్నై మొదలెట్టింది

అత్యంత ఆకర్షణీయ జట్ల మధ్య ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఆరంభ పోరు అంచనాలకు తగ్గట్లే సాగింది. బ్యాటుతో బెంగళూరు తడబాటు చూసి ఆ జట్టును చెన్నై చిత్తుగా కొట్టేస్తుందనుకుంటే.. గొప్పగా పుంజుకుని పోరాడే స్కోరు సాధించింది ఆర్సీబీ.

Updated : 23 Mar 2024 06:55 IST

 తొలి మ్యాచ్‌లో బెంగళూరుపై విజయం
మెరిసిన ముస్తాఫిజుర్‌, రచిన్‌

 అత్యంత ఆకర్షణీయ జట్ల మధ్య ఐపీఎల్‌ 17వ సీజన్‌ ఆరంభ పోరు అంచనాలకు తగ్గట్లే సాగింది. బ్యాటుతో బెంగళూరు తడబాటు చూసి ఆ జట్టును చెన్నై చిత్తుగా కొట్టేస్తుందనుకుంటే.. గొప్పగా పుంజుకుని పోరాడే స్కోరు సాధించింది ఆర్సీబీ. ఛేదనలోనూ చెన్నై చెమటోడ్చేలా చేసింది. ఒక దశలో బెంగళూరుకు విజయావకాశాలు బాగానే కనిపించాయి. కానీ చేజారేలా కనిపించే మ్యాచ్‌లను సొంతం చేసుకోవడంలో గొప్ప నేర్పున్న సీఎస్‌కే మరోసారి తన ముద్రను చూపించింది. కెప్టెన్‌గా రుతురాజ్‌ గైక్వాడ్‌ విజయంతో ఐపీఎల్‌ను ఆరంభించాడు. బౌలింగ్‌లో ముస్తాఫిజుర్‌, బ్యాటింగ్‌లో అరంగేట్ర ఆటగాడు రచిన్‌ రవీంద్ర చెన్నై హీరోలు.

చెన్నై

అయిదుసార్లు ఛాంపియన్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ ఐపీఎల్‌-17లో శుభారంభం చేసింది. శుక్రవారం ఆసక్తికరంగా సాగిన సీజన్‌ ఆరంభ పోరులో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. మొదట ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆప్‌ ద మ్యాచ్‌’ ముస్తాఫిజుర్‌ (4/29) ధాటికి ఒక దశలో 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూరు.. అనుజ్‌ రావత్‌ (48; 25 బంతుల్లో 4×4, 3×6), దినేశ్‌ కార్తీక్‌ (38 నాటౌట్‌; 26 బంతుల్లో 3×4, 2×6) మెరుపులతో పుంజుకుంది. డుప్లెసిస్‌ (35; 23 బంతుల్లో 8×4) కూడా రాణించాడు. ఛేదనలో రచిన్‌ రవీంద్ర (37; 15 బంతుల్లో 3×4, 3×6) చెన్నైకి బలమైన పునాది వేయగా.. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన శివమ్‌ దూబె (34 నాటౌట్‌; 28 బంతుల్లో 4×4, 1×6)కు తోడు రహానె (27), జడేజా (25 నాటౌట్‌) కూడా రాణించడంతో మ్యాచ్‌ ఆ జట్టు సొంతమైంది. ఆర్సీబీ బౌలర్లలో కామెరూన్‌ గ్రీన్‌ (2/27) రాణించాడు.

తేల్చి పడేశాడు..: 174 అంటే అంత తేలికైన లక్ష్యం కాదు. అందులోనూ స్పిన్నర్లకు అనుకూలించే చెపాక్‌ పిచ్‌పై ఛేదనకు చెన్నై కష్టపడక తప్పదనిపించింది. కానీ తన తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌లోనే రెచ్చిపోయి బ్యాటింగ్‌ చేసిన రచిన్‌ రవీంద్ర.. మ్యాచ్‌ను చెన్నై వైపు తిప్పేశాడు. కెప్టెన్‌ రుతురాజ్‌ (15) ఎక్కువసేపు నిలవకపోయినా.. తక్కువ బంతుల్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన రచిన్‌ ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అతడి ధాటికి పవర్‌ ప్లేలో చెన్నై 61 పరుగులు (వికెట్‌ నష్టానికి) సాధించింది. అర్ధశతకం దిశగా సాగుతున్న రచిన్‌, కర్ణ్‌ బౌలింగ్‌లో ఓ భారీ షాట్‌ ఆడబోయి ఔటైనా.. సాధించాల్సిన రన్‌రేట్‌ తగ్గిపోవడంతో తర్వాతి బ్యాటర్లకు పని తేలికైంది. రహానె, మిచెల్‌ (22) మధ్య ఓవర్లలో ఆచితూచి ఆడి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. వీళ్లిద్దరినీ గ్రీన్‌ వరుస ఓవర్లలో ఔట్‌ చేయడంతో చెన్నై కొంత ఒత్తిడిలో పడింది. కానీ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వచ్చిన దూబెతో కలిసి జడేజా నిలకడగా ఆడడంతో చెన్నై ఛేదన సాఫీగానే సాగిపోయింది. ఆరంభంలో ఇబ్బంది పడ్డ దూబె.. కుదురుకున్నాక చెలరేగి ఆడి లక్ష్యాన్ని తేలిక చేసేశాడు.

లేచి.. పడి.. లేచి..: అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన బెంగళూరుకు అదిరే ఆరంభం దక్కినా.. మధ్యలో ఆ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక పుంజుకోవడం కష్టమనుకున్న దశలో అనుజ్‌ రావత్‌, దినేశ్‌ కార్తీక్‌ ఆపద్బాంధవుల్లా మారి జట్టుకు అనూహ్యమైన స్కోరునందించాడు. ఆరంభంలో ఆర్సీబీని కెప్టెన్‌ డుప్లెసిస్‌ ముందుండి నడిపించాడు. తనే ఎక్కువగా స్ట్రైక్‌ తీసుకుంటూ బౌండరీల మోత మోగించిన డుప్లెసిస్‌.. ఆర్సీబీని 4 ఓవర్లకు 37/0తో పటిష్ట స్థితిలో నిలిపాడు. అందులో తన స్కోరే 31. అయితే ముస్తాఫిజుర్‌ రాకతో ఆర్సీబీ ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. అతను వేసిన ఇన్నింగ్స్‌ అయిదో ఓవర్లో భారీ షాట్‌ ఆడబోయి రచిన్‌ రవీంద్ర పట్టిన చక్కటి క్యాచ్‌కు డుప్లెసిస్‌ వెనుదిరగ్గా.. ఆ ఓవర్‌ చివరి బంతికే రజత్‌ పటిదార్‌ (0) ఔటైపోయాడు. దీపక్‌ చాహర్‌ వేసిన తర్వాతి ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ (0) ఎదుర్కొన్న తొలి బంతికే వెనుదిరిగాడు. వీళ్లిద్దరూ వికెట్‌ కీపర్‌ ధోనీకే క్యాచ్‌లు ఇచ్చారు. ఈ స్థితిలో కామెరూన్‌ గ్రీన్‌ (18)తో కలిసి కోహ్లి (21) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ముస్తాఫిజుర్‌ తన రెండో ఓవర్లో మూడు బంతుల వ్యవధిలో వీళ్లిద్దరినీ ఔట్‌ చేసి ఆర్సీబీని గట్టి దెబ్బ తీశాడు. 12 ఓవర్లకు స్కోరు 78/5. ఈ స్థితిలో ఆర్సీబీ 150 అయినా చేస్తుందా అని సందేహం కలిగింది. అయితే అనుజ్‌, కార్తీక్‌ గొప్ప పట్టుదలతో బ్యాటింగ్‌ చేసి జట్టును రక్షించారు. క్రీజులో కుదురుకునే వరకు ఆచితూచి ఆడిన ఈ జోడీ.. ఆ తర్వాత షాట్లకు దిగింది. ముఖ్యంగా అనుజ్‌ భారీ షాట్లతో చెన్నై బౌలర్ల గణాంకాలను తారుమారు చేశాడు.12వ ఓవర్లో అయిదో వికెట్‌ కోల్పోయిన ఆర్సీబీ.. ఇన్నింగ్స్‌ చివరి బంతికి తర్వాతి వికెట్‌ (రనౌట్‌) కోల్పోయింది. ఈ మధ్యలో 95 పరుగులొచ్చాయి.

అరంగేట్రం అదుర్స్‌

న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ రచిన్‌ రవీంద్ర ఐపీఎల్‌ అరంగేట్రం అదిరింది. అతను ఛేదనలో విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెన్నైకి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. రచిన్‌ మూడు కళ్లు చెదిరే సిక్సర్లు బాదాడు. ఐపీఎల్‌ తొలి మ్యాచ్‌ ఆడుతున్నా అతను ఏమాత్రం ఒత్తిడికి గురి కాకుండా అలవోకగా షాట్లు ఆడాడు. రచిన్‌కు మొదట బౌలింగ్‌ చేసే రాకపోయినా.. ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. డుప్లెసిస్‌ మెరుపు ఇన్నింగ్స్‌కు చక్కటి డైవ్‌ క్యాచ్‌తో తెరదించింది అతనే. తర్వాత విరాట్‌ క్యాచ్‌ను కూడా అతనే అందుకున్నాడు.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 21; డుప్లెసిస్‌ (సి) రచిన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 35; రజత్‌ పటిదార్‌ (సి) ధోని (బి) ముస్తాఫిజుర్‌ 0; మ్యాక్స్‌వెల్‌ (సి) ధోని (బి) దీపక్‌ చాహర్‌ 0; గ్రీన్‌ (బి) ముస్తాఫిజుర్‌ 18; అనుజ్‌ రావత్‌ రనౌట్‌ 48; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 173; వికెట్ల పతనం: 1-41, 2-41, 3-42, 4-77, 5-78, 6-173; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-0-37-1; తుషార్‌ దేశ్‌పాండే 4-0-47-0; మహీశ్‌ తీక్షణ 4-0-36-0; ముస్తాఫిజుర్‌ 4-0-29-4; జడేజా 4-0-21-0

చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) గ్రీన్‌ (బి) యశ్‌ దయాళ్‌ 15; రచిన్‌ (సి) రజత్‌ (బి) కర్ణ్‌శర్మ 37; రహానె (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) గ్రీన్‌ 27; మిచెల్‌ (సి) రజత్‌ (బి) గ్రీన్‌ 22; దూబె నాటౌట్‌ 34; జడేజా నాటౌట్‌ 25; ఎక్స్‌ట్రాలు 16 మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-38, 2-71, 3-99, 4-110; బౌలింగ్‌: సిరాజ్‌ 4-0-38-0; యశ్‌ దయాళ్‌ 3-0-28-1; అల్జారి జోసెఫ్‌ 3.4-0-38-0; కర్ణ్‌శర్మ 2-0-24-1; మయాంక్‌ దాగర్‌ 2-0-6-0; గ్రీన్‌ 3-0-27-2; మ్యాక్స్‌వెల్‌ 1-0-7-0

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని