Nita Ambani: డబ్ల్యూపీఎల్‌.. ఎందరో యువతులకు ప్రేరణ: నీతా అంబానీ

డబ్ల్యూపీఎల్‌ (WPL) ఎంతో మంది యువతులకు ప్రేరణగా నిలుస్తుందని ముంబయి ఇండియన్స్‌ జట్టు యజమాని నీతా అంబానీ తెలిపారు. శనివారం మ్యాచ్‌ గెలిచిన అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఏర్పాటు చేసి సెలెబ్రేషన్స్‌లో ఆమె పాల్గొన్నారు.

Updated : 05 Mar 2023 19:34 IST

ముంబయి: డబ్ల్యూపీఎల్‌ (WPL) ప్రారంభోత్సవ వేడుకలను ఎప్పటికీ మరిచిపోలేనని ముంబయి ఇండియన్స్ (MI) జట్టు యజమాని నీతా అంబానీ (Nita Ambani) అన్నారు. మహిళా క్రీడా ప్రపంచంలో దీనిని ఓ ప్రత్యేకమైన రోజుగా అభివర్ణించిన ఆమె.. కార్యక్రమంలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉందన్నారు. శనివారం ప్రారంభమైన మహిళా ప్రీమియర్‌ లీగ్‌ (WPL) తొలి మ్యాచ్‌లో గుజరాత్‌ జెయింట్స్‌ (GG)పై ముంబయి ఇండియన్స్‌ (MI) జట్టు ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 143 పరుగుల భారీ తేడాతో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మ్యాచ్‌ అనంతరం డ్రెస్సింగ్‌ రూమ్‌ సెలెబ్రేషన్స్‌లో జట్టు సభ్యులతో కలిసి నీతా అంబానీ పాల్గొన్నారు. వారితో కలిసి విజయాన్ని ఆస్వాదించారు. 

ఎప్పటి నుంచో తాను కన్న కల ఈ రోజు నెరవేరిందని డ్రెస్సింగ్‌ రూమ్‌లోని వేడుకల సందర్భంగా నీతా అంబానీ పేర్కొన్నారు. మహిళా జట్లు మైదానంలో ఆడుతుంటే.. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులు స్త్రీ, పురుష భేదం లేకుండా బంతి బంతికీ క్రీడాకారిణులను  ప్రోత్సాహించడం ఎంతో ఆనందాన్నిచ్చిందని అన్నారు. ఈ డబ్ల్యూపీఎల్ ఎంతో మంది మహిళలకు ప్రేరణగా మారుతుందని, మహిళలు కూడా క్రీడలను తమ కెరీర్‌గా మలచుకోవాలన్న ఆలోచనను రేకెత్తిస్తుందన్నారు. దేశంలోని యువతులు క్రీడా రంగంలో వారి కలలను సాకారం చేసుకునేందుకు, వారి మనసుకు నచ్చినట్టుగా నడుచుకునేందుకు డబ్ల్యూపీఎల్‌ దిక్సూచీగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ సందర్భంగా ఆమె వ్యాఖ్యానించారు.

తొలి మ్యాచ్‌లోనే రికార్డు స్థాయి విజయం సాధించడం పట్ల ముంబయి జట్టును నీతా అంబానీ అభినందించారు. ప్రత్యేకంగా కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ తెగువను ఆమె ప్రశంసించారు. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లోనూ విశేష ప్రతిభ కనబరిచి.. మహిళా క్రీడాకారులు కూడా పురుషులకు తీసిపోరని ముంబయి జట్టు నిరూపించిందని అన్నారు. అమీలియా కేర్‌ (45 నాటౌట్‌) ప్రదర్శన అద్భుతంగా ఉందన్న నీతా.. 2 వికెట్లు పడగొట్టి బౌలింగ్‌లోనూ తానేంటో నిరూపించుకుందని చెప్పారు. తొలిసారిగా జరుగుతున్న డబ్ల్యూపీఎల్‌ టోర్నమెంట్‌లో ఆడుతున్న ప్రతి జట్టుకు నీతా శుభాకాంక్షలు తెలిపారు. మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు కూడా నీతా అంబానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. షాట్లు బాదినప్పుడు, వికెట్లు తీసినప్పుడు తనదైన శైలిలో క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని