Sunil Gavaskar : భువీకి మళ్లీ జట్టులో చోటు దక్కడం కష్టమే.! : సునీల్‌ గావస్కర్‌

టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని...

Published : 01 Feb 2022 01:20 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా సీనియర్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ ఫామ్‌పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా అతడికి మళ్లీ భారత జట్టులో చోటు దక్కడం కష్టమేనని అన్నాడు. రానున్న రెండు ప్రపంచకప్‌ల దృష్ట్యా భారత జట్టు యాజమాన్యం నాణ్యమైన ఆటగాళ్లను వెలికి తీయాల్సిన అవసరముందని సూచించాడు. సమయం తక్కువగా ఉన్నందున వీలైనంత త్వరగా టీ20, వన్డే ఫార్మాట్లలో సత్తా చాటగల క్రికెటర్లను సిద్ధం చేసుకోవాలని సూచించాడు. ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్‌, 2023 అక్టోబరులో వన్డే ప్రపంచకప్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వీటిలో వన్డే ప్రపంచకప్‌ స్వదేశంలో జరుగనుండటంతో సహజంగానే భారత్‌పై భారీ అంచనాలు ఉంటాయి. వాటిని అందుకోవాలంటే అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సత్తా చాటగల క్రికెటర్లను ఎంపిక చేసుకోవాలని గావస్కర్‌ సూచించాడు. 

‘యువ బౌలర్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతున్న నేపథ్యంలో.. రానున్న ప్రపంచకప్‌ జట్టులో భువనేశ్వర్‌ కుమార్‌కి చోటు దక్కడం కష్టమేననిపిస్తోంది. అతడి బౌలింగ్‌లో మునుపటి పదును, కచ్చితత్వం కనిపించడం లేదు. అలా అని గతంలో భువీ టీమ్‌ఇండియాకు అందించిన సేవలను తక్కువ అంచనా వేయలేం. గత కొద్దికాలంగా ఫామ్‌పరంగా అతడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. అవకాశమొచ్చిన మ్యాచుల్లో కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. యార్కర్లు, స్లో డెలివరీలతో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లు అతడి బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటున్నారు. అందుకే, అతడు కొంత కాలం విరామం తీసుకుని బౌలింగ్‌పై దృష్టి పెడితే బాగుంటుంది. ప్రస్తుతానికైతే భువనేశ్వర్ స్థానాన్ని భర్తీ చేయగల బౌలర్‌ని వెతకాల్సిన సమయం ఆసన్నమైందనుకుంటున్నాను. అతడి స్థానంలో యువ ఆటగాడు దీపక్ చాహర్‌కి మరిన్ని అవకాశాలిచ్చి.. మెరుగైన బౌలర్‌గా తీర్చిదిద్దాలి. అతడు బంతితో పాటు, బ్యాటుతోనూ సత్తా చాటగలడు’ అని సునీల్ గావస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌లో దీపక్‌ చాహర్‌ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.   

ప్రస్తుతం భారత జట్టులో స్థానం కోసం చాలా మంది యువ ఆటగాళ్లు వేచి చూస్తున్నారు. భారత బ్యాటింగ్ విభాగం కాస్త మెరుగ్గానే కనిపిస్తున్నా.. పేస్‌ బౌలింగ్‌ విషయంలోనే సెలెక్టర్లు కొంత సందిగ్థంలో ఉన్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ పేసర్లు జస్ప్రీత్‌ బుమ్రా, మహమ్మద్‌ షమి ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నారు. కానీ, వారికి మద్దతుగా నిలిచే మూడో బౌలర్‌గా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. ఆ స్థానం కోసం యువ బౌలర్లు శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహమ్మద్‌ సిరాజ్‌లు పోటీ పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని