IPL 2023: ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నా.. కానీ ఛాంపియన్‌గా నిలిచేది ఆ జట్టే: ఏబీడీ

ఐపీఎల్‌ 2023 సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలవబోతోందో అంచనా వేస్తూ ఏబీడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన సొంత జట్టు ఆర్సీబీని పక్కన పెట్టి మరో జట్టు విజేతగా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. ఇంతకీ ఆ జట్టు ఏదో తెలుసుకుందామా?

Updated : 06 Apr 2023 12:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐపీఎల్‌-16(IPL) రసవత్తరంగా సాగుతోంది. ప్రతి జట్టు నువ్వానేనా అంటూ పోటీపడుతున్నాయి. దీంతో ఐపీఎల్‌ 2023 సీజన్‌ విజేత ఎవరో అన్న అంశంపై అప్పుడే చర్చ మొదలైంది. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB) మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌(AB De Veilliers) ప్రస్తుత సీజన్‌లో ఏ జట్టు విజేతగా నిలుస్తుందో అంచనా వేసేశాడు. తనకు ఆర్సీబీ గెలవాలని ఉన్నా.. హార్ధిక్‌ పాండ్య సారథ్యం వహిస్తున్న గుజరాత్‌ టైటన్స్‌(GT) జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని జోస్యం చెప్పాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుత సీజన్‌లో ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందని ఏబీడీని ప్రశ్నించగా..‘‘చాలా కష్టమైన ప్రశ్న. చాలా రోజుల క్రితం ఐపీఎల్ వేలం సమయంలో..ఈసారి కూడా గుజరాత్‌ టైటన్స్‌ విజయ దుందుభి మోగిస్తుందని చెప్పాను. నిజంగా నేను ఆర్సీబీ గెలవాలని కోరుకుంటున్నప్పటికీ అప్పుడు చెప్పిన మాటలకే కట్టుబడి ఉంటాను. గతేడాది నుంచి జీటీ గొప్ప జట్టును కలిగి ఉంది. మంచి బాలెన్స్‌, తగినంత శక్తితో ఆ జట్టు బలంగా ఉంది. ఆర్సీబీ కూడా అన్నివిధాలా రాణిస్తుందని ఆశిస్తున్నాను’’ అని తెలిపాడు.

గతేడాది ఛాంపియన్‌గా నిలిచిన గుజరాత్‌ టైటన్స్‌ ప్రస్తుత సీజన్‌లోనూ దూసుకుపోతోంది. ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచుల్లో విజయం సాధించింది. ఫాఫ్‌ డుప్లెసిస్‌ సారథ్యం వహిస్తున్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు సైతం బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లోనే ముంబయిపై ఘనవిజయం సాధించిన ఆర్సీబీ నేడు కోల్‌కతాతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు