Shubman Gill: విరాట్‌లా కావాలనుకుంటే.. విదేశాల్లోనూ గిల్‌ పరుగులు చేయాలి: క్రిష్‌

శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో విఫలమై నిరాశపరిచాడు. 

Published : 03 Jan 2024 12:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుతోపాటు వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా యువ బ్యాటర్ శుభ్‌మన్‌ గిల్ (Shubman Gill) ప్రదర్శన గొప్పగా ఏమీ లేదు. ‘భవిష్యత్తు విరాట్ కోహ్లీ’ అంటూ అతడిని అభివర్ణించిన మాజీ క్రికెటర్లు.. విదేశీ పిచ్‌లపైనా పరుగులు చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఫర్వాలేదనిపించినా టెస్టుల్లో గిల్ ఇబ్బంది పడటంపై భారత మాజీ క్రికెటర్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీలా (Virat Kohli) నిలకడగా పరుగులు చేయాలన్నాడు.

‘‘ప్రపంచ క్రికెట్‌లో గిల్ వేగంగా వృద్ధిలోకి వచ్చాడు. అయితే, ఉపఖండ పిచ్‌లపై భారీగా పరుగులు చేసినా ప్రయోజనం పెద్దగా ఉండదు. ఓవర్సీస్‌లోనూ పరుగులు చేయాలి. ఇప్పుడు విరాట్ కోహ్లీని కింగ్ అని ఎందుకు పిలుస్తున్నాం? అతడి రికార్డులను ఓ సారి గమనిస్తే సరిపోతుంది. గతేడాది కూడా అతడి ఫామ్‌ అద్భుతం. అందుకే, కోహ్లీలా మరొకరిని తయారు చేయడం కష్టమని అంగీకరిస్తా. అతడిలా పరుగులు చేయడం మరెవరికీ కుదరదు. శుభ్‌మన్‌ గిల్ విషయానికొస్తే.. ఈసారి కాకపోయినా.. తర్వాతైనా రాణిస్తాడని అభిమానులు అంటుంటారు. కానీ.. భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేం. అందుకే అతడిపై భారీ అంచనాలు పెట్టుకోకూడదు. కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకొని వచ్చాక ఆడిన తీరు అద్భుతం. రిషభ్‌ పంత్‌ ఆటను ఈ ఏడాదిలో చూస్తామనే నమ్మకం ఉంది’’ అని క్రిష్ వ్యాఖ్యానించాడు.

ఐదుగురు అత్యుత్తమ టెస్టు బ్యాటర్లు వీరే: వెంకటేశ్ ప్రసాద్‌

భారత మాజీ ఆటగాడు వెంకటేశ్ ప్రసాద్ చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత్ తరఫున అత్యుత్తమ ఐదుగురు టెస్టు బ్యాటర్ల జాబితాను పోస్టు చేశాడు. వీరిలో సునీల్ గావస్కర్, సచిన్‌ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ ఉన్నారు. అయితే ఈ జాబితాలో వీవీఎస్‌ లక్ష్మణ్, సౌరభ్‌ గంగూలీ పేర్లు లేకపోవడంపై కొందరు అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని