
IND vs ENG: భోజన విరామ సమయానికి భారత్ 56/4
ఇంటర్నెట్ డెస్క్: లీడ్స్ వేదికగా టీమ్‌ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మూడో టెస్టులో భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(15) ఆచితూచి ఆడుతున్నాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీసేనకు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. గత రెండు టెస్టుల్లో భారీ స్కోర్లు చేసిన కేఎల్ రాహుల్(0; 4 బంతుల్లో) డకౌట్ అయ్యాడు. అండర్సన్ వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికి కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చాడు. కేఎల్ ఔటయిన కొద్దిసేపటికే టీమ్‌ఇండియాకు అండర్సన్ మరో షాక్ ఇచ్చాడు. జిమ్మీ వేసిన 4.1 ఓవర్‌కు పుజారా బట్లర్‌కే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ(7) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. కోహ్లీ అండర్సన్ బౌలింగ్‌లోనే బట్లర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత రహానె(18) కాసేపు నిలకడగా ఆడినా..రాబిన్సన్ వేసిన 25.5 ఓవర్‌కు బట్లర్‌కు చిక్కాడు. ఈ క్రమంలో అంపైర్లు భోజన విరామం ప్రకటించారు.