IND vs PAK: పాక్‌ బౌలింగ్‌ X భారత బ్యాటింగ్‌.. కేఎల్‌ మిస్‌ కావడం బ్యాడ్‌ న్యూసే.. భార్యతో బుమ్రా ఫుట్‌బాల్!

Published : 31 Aug 2023 11:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మరో రెండు రోజుల్లో ఆసియా కప్‌లో (Asia Cup 2023) భాగంగా పాకిస్థాన్‌తో తలపడేందుకు టీమ్‌ఇండియా (IND vs PAK) సిద్ధమవుతోంది. అయితే, భారత బ్యాటింగ్‌కు, పాక్‌ బౌలింగ్‌కు మధ్య పోటీ ఉంటుందని ఆసీస్‌ మాజీ ఆటగాడు బ్రాడ్ హాగ్ అభిప్రాయపడ్డాడు. అలాగే తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ దూరం కావడం టీమ్‌ఇండియాకు బ్యాడ్‌ న్యూసేనని మహమ్మద్ కైఫ్ తెలిపాడు. ఆసియా కప్‌లో పాక్‌తో మ్యాచ్‌ ఆడేందుకు సమయం ఉండటంతో సరదాగా సతీమణితో కలిసి బుమ్రా ఫిఫా ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ ఆడాడు. ఇలాంటి క్రికెట్ విశేషాలు మీ కోసం.. 

కోహ్లీని త్వరగా కట్టడి చేస్తేనే..: బ్రాడ్ హాగ్‌

‘‘భారత్ - పాకిస్థాన్‌ మ్యాచ్‌ చూసేందుకు ఎంతో ఆత్రుతుగా ఎదురు చూస్తున్నా. పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలింగ్‌కు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌కు మధ్య తీవ్ర పోటీ ఉండటం ఖాయం. అందుకే ఇలాంటి మ్యాచ్‌ను తప్పకుండా చూస్తా. పాక్‌ బౌలింగ్‌ అత్యుత్తమ స్థాయిలో ఉంది. మరోవైపు భారత జట్టులో స్టార్‌ బ్యాటర్లు ఉన్నారు. అయితే, పాక్‌ తరఫున ఎడమచేతివాటం పేసర్ షహీన్ షా అఫ్రిది మంచి ఫామ్‌లో ఉన్నాడు. నాణ్యమైన బౌలర్‌ను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. స్వింగ్‌తోపాటు వేగంగా బంతులను సంధించే ఎడమచేతివాటం బౌలర్లను ఎదుర్కోవడం కుడిచేతివాటం బ్యాటర్లకు ఇబ్బందిగా ఉంటుంది. తప్పకుండా భారత టాప్‌ ఆర్డర్‌ - షహీన్‌ బౌలింగ్‌కు మధ్యే పోటీ. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్‌మన్‌ గిల్ అతడి బౌలింగ్‌ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారనుంది. అయితే, పాక్‌ త్వరగా విరాట్ కోహ్లీని కట్టడి చేయకపోతే మాత్రం భారీ నష్టం అనుభవించాల్సి వస్తుంది’’ అని బ్రాడ్‌ హాగ్‌ వ్యాఖ్యానించాడు. 


ఐదో స్థానంలో అతడి గణాంకాలు ఘనం: కైఫ్

దాయాది జట్టుతో పోరు ఉందనగా భారత క్రికెట్ అభిమానులకు షాకిస్తూ కేఎల్ రాహుల్‌ రెండు మ్యాచ్‌లకు దూరమవుతాడని ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై నెట్టింట ట్రోలింగ్‌ మొదలైంది. ఫిట్‌గా లేకపోతే ఎందుకు ఎంపిక చేశారనే ప్రశ్నలు వచ్చాయి. కేఎల్ రాహుల్‌ మిస్‌ కావడంపై భారత మాజీ ఆటగాడు మహమ్మద్‌ కైఫ్ స్పందించాడు. ‘‘కేఎల్ రాహుల్‌ తొలి రెండు మ్యాచ్‌లకు దూరమవుతున్నాడు. అయితే, ఈ టోర్నీలో మిగతా మ్యాచ్‌లకూ అందుబాటులో ఉండటం కష్టమేననిపిస్తోంది. అందుకే టీమ్‌ఇండియాకు ఇది బ్యాడ్‌ న్యూస్‌ అవుతోంది. కేఎల్ రాహుల్‌కు ఐదో స్థానంలో ఉత్తమ గణాంకాలు ఉన్నాయి. తప్పకుండా అక్కడ రాణిస్తాడనే నమ్మకం ఉండేది. ఇన్నింగ్స్‌లో నిలకడ తీసుకురావడంతోపాటు అవసరమైన సందర్భంలో భారీ షాట్లు కొట్టగలడు. కానీ, ఇప్పుడు అతడు లేకపోవడం మాత్రం భారత్‌కు నష్టమే. ఇషాన్‌ కిషన్‌ ఉన్నప్పటికీ.. కేఎల్ రాహుల్‌ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమే’’ అని కైఫ్ తెలిపాడు. 


సతీమణితో సరదాగా వీడియోగేమ్‌..

ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో దాదాపు సంవత్సరం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన భారత ఫాస్ట్‌ బౌలర్‌ జస్ప్రీత్ బుమ్రా.. ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో కాస్త వ్యవధి దొరకడంతో తన సతీమణి సంజనా గణేశన్‌తో కలిసి ఫిఫా ఆన్‌లైన్‌ ఫుట్‌బాల్‌ గేమ్‌ను ఆడాడు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని