IND vs SA: అదరగొట్టిన రాహుల్-సూర్య.. దక్షిణాఫ్రికా చిత్తు

భారత్ అదరగొట్టేసింది. మొన్న ఆసీస్‌ను మట్టికరిపించి ఊపు మీద.. తాజాగా దక్షిణాఫ్రికానూ చిత్తు చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా...

Updated : 28 Sep 2022 22:59 IST

తిరువనంతపురం: భారత్ అదరగొట్టేసింది. మొన్న ఆసీస్‌ను మట్టికరిపించి ఊపు మీద ఉన్న టీమ్‌ఇండియా  తాజాగా సఫారీలను చిత్తు చేసింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా తిరువనంతపురం వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవరల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్‌ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 16.4 ఓవర్లలో 110 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్, కెప్టెన్‌ రోహిత్ శర్మ (0) డకౌట్‌ కాగా.. విరాట్ కోహ్లీ (3) విఫలమయ్యాడు. అయితే ఆ ప్రభావం భారత ఇన్నింగ్స్‌పై పడకుండా కేఎల్ రాహుల్ (51*), సూర్యకుమార్ (50*) అర్ధ శతకాలతో అదరగొట్టి విజయంలో కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ కలిసి 93 పరుగులను జోడించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, నోకియా చెరో వికెట్‌ తీశారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

తొలి 15 బంతుల్లో ఐదు వికెట్లు.. 

టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకొన్న భారత్‌కు బౌలర్లు అద్భుత ఆరంభం ఇచ్చారు. దక్షిణాఫ్రికా టాప్‌ ఆర్డర్‌ను పేకమేడలా కూల్చారు. తొలి ఓవర్‌లో ఆ జట్టు కెప్టెన్‌ బవుమా (0)ను దీపక్‌ చాహర్‌ క్లీన్‌ బౌల్డ్‌ చేసి వికెట్ల పతనానికి తెర లేపగా.. తర్వాతి ఓవర్‌లో అర్ష్‌దీప్‌ రెచ్చిపోయాడు. ఏకంగా మూడు వికెట్లను తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు. రసోసౌ (0), డికాక్‌ (1), మిల్లర్ (0)ను పెవిలియన్‌కు చేర్చాడు. తర్వాత మళ్లీ దీపక్ చాహర్‌ ట్రిస్టన్ స్టబ్స్‌ (0)ను ఔట్‌ చేశాడు. దీంతో మొత్తం 15 బంతుల్లోనే భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు చెందిన ఐదు వికెట్లను పడగొట్టడం విశేషం. మార్‌క్రమ్ (25), పార్నెల్‌ (24) కాస్త కుదురుకొని దక్షిణాఫ్రికా స్కోరు బోర్డున నడిపించారు. అయితే దక్షిణాఫ్రికా స్కోరు వంద దాటడానికి ప్రధాన కారణం.. కేశవ్ మహరాజ్ (41). ఓ వైపు వికెట్లు పడినా.. ఓర్పుగా ఆడిన మహరాజ్‌ చూడచక్కని షాట్లతో అలరించాడు. దక్షిణాఫ్రికా జట్టులో ఇతడే టాప్‌ స్కోరర్‌. భారత బౌలర్లలో అర్ష్‌దీప్‌ సింగ్ 3, దీపక్ చాహర్‌ 2, హర్షల్‌ పటేల్ 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశారు. ఆశ్విన్‌ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం ఎనిమిది పరుగులు ఇవ్వడం విశేషం.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని