ODI WC 2023: నా ఆందోళనంతా ఆ ఆల్‌రౌండర్‌ గురించే: కపిల్‌ దేవ్‌

వన్డే ప్రపంచకప్‌ 2023 (ODI World Cup 2023) మెగా టోర్నీకి ఇంకా వంద రోజుల సమయం ఉంది. అయితే, టీమ్‌ఇండియాకు గాయాల బెడద ఉంది. ఈ క్రమంలో భారత క్రికెట్‌ దిగ్గజం కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 29 Jun 2023 12:38 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వన్డే ప్రపంచకప్‌-2023 (ODI World Cup 2023) షెడ్యూల్‌ వచ్చేసింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి వరల్డ్‌ కప్‌ సంగ్రామం ప్రారంభంకానుంది. దాదాపు వంద రోజుల సమయం ఉంది. ఈలోగా టీమ్‌ఇండియా (Team India) వెస్టిండీస్‌ పర్యటన, ఆసియా కప్‌, ఐర్లాండ్‌ సిరీస్‌లను ఆడనుంది. అయితే, కేఎల్‌ రాహుల్‌, రిషభ్‌ పంత్, జస్ప్రీత్ బుమ్రా వంటి టాప్‌ ప్లేయర్లు గాయాలబారిన పడ్డారు. ప్రస్తుతం కోలుకుంటున్నప్పటికీ వన్డే వరల్డ్‌ కప్‌ నాటికి ఫిట్‌నెస్‌ సాధించి ఫామ్‌ అందుకొంటారో లేదోననే ఆందోళన అభిమానుల్లో ఉంది. అయితే, టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్‌ దేవ్‌ (Kapil Dev) మాత్రం ఒకే ఒక్క ఆటగాడి ఫామ్‌పై ఆందోళన వ్యక్తం చేశాడు. అతడే పేస్‌ ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya). 

‘‘ప్రతి క్రీడాకారుడి జీవితంలో గాయాలు ఓ భాగం. అయితే, వేగంగా కోలుకుని మళ్లీ మైదానంలోకి అడుగు పెట్టాలి. ఇప్పటికే కొందరు కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. కానీ, హార్దిక్‌ పాండ్య గురించే చాలా ఆందోళనగా ఉన్నా. భవిష్యత్తులో ఎలా ఆడతాడనేది వేచి చూడాలి. ఎందుకంటే అతడు త్వరగా గాయాలబారిన పడుతున్నాడు. ఒకవేళ ఆటగాళ్లందరూ ఫిట్‌గా ఉంటే మాత్రం టీమ్‌ఇండియా తప్పకుండా వరల్డ్‌ కప్‌లో అద్భుతంగా రాణిస్తుంది. ఈ మెగా టోర్నీ ప్రతి నాలుగేళ్లకొకసారి వస్తుంది. అందుకే ప్రతి ఆటగాడు సిద్ధంగా ఉండాలి. మ్యాచ్‌ల కోసం ఎక్కువగా సాధన చేయాలి. మరిన్ని వన్డేలను ఆడాలి’’ అని కపిల్ దేవ్‌ తెలిపాడు.

రిషభ్‌ పంత్‌ పరిస్థితేంటో..: క్రిష్‌

‘‘రిషభ్ పంత్ గాయాల పరిస్థితి ఏంటో మనకు తెలియదు. రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పంత్‌ కోలుకుని ఆడగలిగితే వన్డే ప్రపంచకప్‌లో భారత్‌కు తిరుగుండదు. అయితే, అతడి ఫిట్‌నెస్‌ పరిస్థితి ప్రశ్నార్థకం. వన్డే ప్రపంచకప్‌ నాటికి ఫిట్‌ అవుతాడో లేదో ఎవరికీ తెలియదు. మెగా టోర్నీలో ఆడటంపైనా అనేక మందికి అనుమానం ఉంది. రిషభ్‌ జట్టులో ఉంటే అతడి ప్రభావం అధికంగా ఉంటుందనేది కాదనలేని సత్యం. కేఎల్ రాహుల్ జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా. మిడిలార్డర్‌లో తప్పకుండా కీలకమవుతాడు. రోహిత్ శర్మ - శుభ్‌మన్‌ గిల్ ఓపెనర్లుగా వస్తారు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ ఫామ్‌లోనే ఉన్నాడు. వరల్డ్‌ కప్‌ నెగ్గడానికి భారత్‌కు ఎక్కువ అవకాశాలున్నాయి’’ అని మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్‌ (క్రిష్‌) వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని