Kuldeep: జట్టు కూర్పు చాలా ముఖ్యం.. అందుకే ఎక్కువగా ఆలోచించను: కుల్‌దీప్‌

రెండో వన్డే మ్యాచ్‌లో (IND vs SL) టీమ్‌ఇండియా విజయం సాధించడంలో కేఎల్ రాహుల్‌ (KL Rahul)తోపాటు కుల్‌దీప్‌ యాదవ్ (KuldeepYadav) కీలక పాత్ర పోషించాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు. 

Updated : 13 Jan 2023 16:18 IST

ఇంటర్నెట్ డెస్క్: స్వల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్‌లో శ్రీలంకపై టీమ్‌ఇండియా పోరాడి విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ సొంతం చేసుకొంది. చివరి మ్యాచ్‌ ఆదివారం తిరువనంతపురం వేదికగా జరగనుంది. రెండో వన్డేలో లంకను కట్టడి చేయడంలో టీమ్‌ఇండియా బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ కీలక పాత్ర పోషించాడు. తన పది ఓవర్ల కోటాలో మూడు వికెట్లు తీసి 51 పరుగులు ఇచ్చాడు. కీలకమైన కుశాల్‌ మెండిస్‌, అసలంక, శనక వికెట్లను పడగొట్టాడు. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ఆ జట్టు కెప్టెన్‌ శనకను బౌల్డ్‌ చేయడం గమనార్హం. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన కుల్‌దీప్‌ తనకొచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకొంటున్నాడు.

‘‘కీలకమైన మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల ఆనందంగా ఉన్నా. నాకొచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించా. తుది జట్టులో ఉన్నప్పుడు లక్ష్యంపైనే దృష్టిసారించాలి. అలా కాకుండా బెంచ్‌పై ఉన్నప్పుడు కాస్త రిలాక్స్‌ అవొచ్చు. జట్టు కూర్పు చాలా ముఖ్యం. అందులో భాగంగా ఒక్కోసారి చోటు ఉండదు. అలాంటప్పుడు నేనేమీ తీవ్రంగా ఆలోచించను. అవకాశం వచ్చినప్పుడు మాత్రం నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికే ప్రయత్నిస్తా’’

సూర్యకుమార్‌కే నేను బ్యాటింగ్‌ కోచ్..: చాహల్

మ్యాచ్‌ అనంతరం కుల్‌దీప్‌ను చాహల్‌ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశాడు. ‘‘ఎప్పుడూ ఒకే పేస్‌తో బౌలింగ్‌ చేయడం కష్టం. ఎప్పటికప్పుడు కొత్తదనంతో బంతిని సంధిస్తూ ఉండాలి. నేను జట్టులో లేని గత ఏడాదంతా ఫిట్‌నెస్‌ మీద దృష్టిపెట్టా. జాతీయ క్రికెట్‌ అకాడమీ కోచ్‌ల సాయంతో ఫిట్‌నెస్‌ సాధించా. ఇది మరింత దూకుడుగా ఉండేందుకు సాయపడుతుంది. చాహల్‌ చాలా మద్దతుగా నిలిచాడు. (వెంటనే చాహల్‌ కలగజేసుకొని.. ఇంతకుముందు నేను సూర్యకుమార్‌కు బ్యాటింగ్‌ కోచ్‌ను అయ్యాను.. ఇప్పుడు నీకు బౌలింగ్‌ కోచ్‌గా మారా.. అనగానే ఇద్దరు నవ్వేశారు).  నా బ్యాటింగ్‌పైనా కాస్త కసరత్తు చేశా’’ అని కుల్‌దీప్‌ తెలిపాడు. లంకపై మూడు వికెట్లు తీయడంతో కుల్‌దీప్‌ అన్ని ఫార్మాట్లు కలిపి 200 వికెట్ల మైలురాయికి చేరుకొన్నాడు. టెస్టుల్లో 34, వన్డేల్లో 122, టీ20ల్లో 44 వికెట్లు తీశాడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని