Chahal in 2nd t20: చాహల్‌ను హార్దిక్‌ నమ్మడం లేదా..? ఆశ్చర్యపోయిన మాజీలు

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లో కెప్టెన్ హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) తీసుకున్న నిర్ణయాలపై మాజీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్‌లో ఉన్న బౌలర్‌తో ఓవర్ల కోటా పూర్తిచేయించకపోవడం సరైంది కాదని విమర్శించారు.

Published : 07 Aug 2023 13:21 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌ - భారత్ జట్ల మధ్య టీ20 సిరీస్‌లో (WI vs IND) ఇప్పటి వరకు రెండు మ్యాచ్‌లు ముగిశాయి. రెండింట్లోనూ భారత్‌పై విండీస్‌ విజయం సాధించి 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే, ఈ రెండు మ్యాచుల్లోనూ ఓ కామన్‌ పాయింట్‌ ఉంది. యుజ్వేంద్ర చాహల్‌ను కెప్టెన్ హార్దిక్‌ పాండ్య వినియోగించుకున్న తీరు క్రికెట్ విశ్లేషకులతోపాటు అభిమానులనూ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి టీ20లో ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి బ్రేక్‌ ఇచ్చిన చాహల్‌ను ఏకంగా ఎనిమిది ఓవర్ల తర్వాత తిరిగి బౌలింగ్‌కు రప్పించాడు. చివరికి మ్యాచ్‌ మొత్తంలో మూడు ఓవర్లే ఇచ్చాడు. తాజాగా రెండో టీ20లోనూ మూడు ఓవర్లు వేసి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. అయినా, అతడితో పూర్తి ఓవర్ల కోటా వేయించకపోవడం గమనార్హం. ఆల్‌రౌండర్‌గా బరిలోకి జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్‌తో ఒక్క ఓవరూ వేయించలేదు. ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు వసీమ్‌ జాఫర్, ఆకాశ్‌ చోప్రా అసంతృప్తి వ్యక్తం చేశారు. 

నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ

హార్దిక్‌.. ఇలాగైతే కష్టమే: జాఫర్

‘‘రెండో టీ20 మ్యాచ్‌లో హార్దిక్‌ తన బౌలర్లను వినియోగించుకున్న తీరు ఆశ్చర్యకరంగా ఉంది. చాహల్‌తో పూర్తి కోటా వేయించలేదు. అక్షర్ పటేల్‌కు ఒక్క ఓవర్‌ ఇవ్వలేదు. భారత్‌కు పూర్తిస్థాయి కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యను భవిష్యత్తులో బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న వేళ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదు. చాహల్, అక్షర్ పటేల్‌ మీద నమ్మకం ఉంచాల్సిన అవసరం ఉంది. వికెట్లు తీసి కట్టుదిట్టంగా బంతులను సంధిస్తున్నప్పటికీ నాలుగో ఓవర్‌ ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది’’ అని జాఫర్ తెలిపాడు. 

18వ ఓవర్‌ అయినా..: ఆకాశ్‌ చోప్రా

‘‘చాహల్‌ భారత అత్యుత్తమ స్పిన్నర్.  రెండో టీ20 మ్యాచ్‌లో 16వ ఓవర్‌ వేసిన చాహల్‌ రెండు వికెట్లు తీసి కేవలం రెండు పరుగులే ఇచ్చాడు. ఆ ఓవర్‌లో రనౌట్‌ రూపంలో మరో వికెట్‌ కూడా వచ్చింది. ఇలాంటప్పుడు అతడితో  18 లేదా 19వ ఓవర్‌ అయినా వేయించి ఉంటే బాగుండేది. తప్పకుండా తన నాలుగో ఓవర్‌ వేసి ఉంటే ఫలితం భారత్‌కు అనుకూలంగా వచ్చేదేమో’’ అని మాజీ క్రికెటర్ ఆకాశ్‌ చోప్రా ట్వీట్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని