IND vs ENG: మీరు అలా చేస్తే రెండ్రోజుల్లోనే మ్యాచ్‌లు ఖతం! ఇంగ్లాండ్‌కు సిరాజ్‌ వార్నింగ్

భారత్‌లో బజ్‌బాల్ క్రికెట్‌ పనిచేయదని, కాదని ఇంగ్లాండ్ అలా చేస్తే మ్యాచ్‌లు ముగుస్తాయని టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అభిప్రాయపడ్డాడు. 

Published : 25 Jan 2024 02:24 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG) మధ్య గురువారం నుంచి తొలి టెస్టు మ్యాచ్‌ ప్రారంభంకానుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మైదానంలో ఇంగ్లాండ్‌తో టీమ్‌ఇండియా టెస్టు మ్యాచ్‌లో తలపడటం ఇదే మొదటిసారి. మ్యాచ్‌ కోసం ఇంగ్లాండ్‌  ఇప్పటికే తమ తుదిజట్టును ప్రకటించింది. టెస్టుల్లో కొంతకాలంగా అనుసరిస్తున్న బజ్‌బాల్ వ్యూహాన్ని ఉప్పల్‌ టెస్టులోనూ కొనసాగించాలని పర్యాటక జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియా పేసర్‌ మహ్మద్ సిరాజ్‌ (Mohammed Siraj) ఇంగ్లాండ్‌కు ఓ హెచ్చరిక చేశాడు. 

‘‘భారత్‌లో ఇంగ్లాండ్‌ బజ్‌బాల్‌ క్రికెట్ ఆడితే మ్యాచ్ ఒకటిన్నర లేదా రెండు రోజుల్లో ముగియవచ్చు. ఇక్కడి పిచ్‌లపై ప్రతిసారీ బంతిని హిట్టింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ బంతి కొన్నిసార్లు గింగిరాలు తిరుగుతుంది. మరికొన్నిసార్లు నేరుగా వికెట్ల మీదకు వస్తుంది. కాబట్టి భారత్‌లో బజ్‌బాల్‌ పనిచేయదని అనుకుంటున్నా. అలా కాదని వాళ్లు అదే పద్ధతిలో ఆడతే మాకే మంచిది. మ్యాచ్‌ తొందరగా ముగుస్తుంది’’ అని సిరాజ్‌ అన్నాడు. సిరీస్‌కు సన్నద్ధత గురించి మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లాండ్ చివరగా (2021లో) భారత్‌లో పర్యటించినప్పుడు నేను రెండు మ్యాచ్‌లు ఆడా. ఒక మ్యాచ్‌లో ఐదు ఓవర్లు వేసి రెండు వికెట్లు పడగొట్టా. జో రూట్, జానీ బెయిర్‌ స్టోను ఔట్‌ చేశా. నేను వేసిన ఓవర్లలో పరుగులు కట్టడి చేసి ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను ఒత్తిడిలో నెట్టడం ఇప్పుడు నా ముందున్న లక్ష్యం’’ అని హైదరాబాదీ పేసర్‌ వివరించాడు. 

2020 చివరిలో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేసిన సిరాజ్‌ ఇప్పటివరకు సుదీర్ఘ ఫార్మాట్‌లో 23 మ్యాచ్‌లు ఆడి 68 వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌ తన సొంతమైదానంలో టెస్టు మ్యాచ్‌ ఆడటం ఇదే తొలిసారి.  హోం గ్రౌండ్‌లో అతడు సత్తాచాటడంతోపాటు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని