Mohammad Kaif: హర్షల్‌ పటేల్‌ ఎవరికి బౌలింగ్‌ చేస్తున్నాడో తెలుసా..?

భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించి క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది...

Published : 27 May 2022 01:42 IST

(Photos: Harshal Patel, Mohammad Kaif Instagram)

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో బెంగళూరు జట్టు కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లఖ్‌నవూను ఓడించి క్వాలిఫయర్‌-2కి అర్హత సాధించింది. అయితే, ఆ విజయం కోసం చివరి వరకూ పోరాడిన రాహుల్‌ టీమ్‌ 14 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్లలో హర్షల్ పటేల్‌  అద్భుతంగా బౌలింగ్‌ చేసి మ్యాచ్‌ను గెలిచేలా కనిపించిన లఖ్‌నవూను కట్టడి చేశాడు.

తన అద్భుతమైన బౌలింగ్‌తో నాలుగు ఓవర్లలో కేవలం 25 పరుగులే ఇచ్చిన అతడు.. మార్కస్‌ స్టాయినిస్‌ (9)వంటి ప్రమాదకర బ్యాట్స్‌మన్‌ను పెవిలియన్‌ దారి పట్టించాడు. దీంతో బెంగళూరు విజయంలో హర్షల్‌ ముఖ్య భూమిక పోషించాడు. ఈ నేపథ్యంలోనే అతడి బౌలింగ్‌ను మెచ్చుకొన్న మాజీ క్రికెటర్‌ మహ్మద్ కైఫ్‌ ఓ క్రీడా ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘హర్షల్‌ నాలుగు ఓవర్లు బౌలింగ్‌ చేసి కేవలం ఒక్క సిక్సర్‌ మాత్రమే కొట్టించుకున్నాడు. అతడి చేతి వేళ్లకు గాయాలున్నా బౌలింగ్‌ చేస్తున్నాడు. అది పక్కనపెడితే.. హర్షల్‌ ఎవరికి బౌలింగ్‌ చేస్తున్నాడు..? తన ముందున్నది మ్యాచ్‌ విన్నర్‌ వంటి కేఎల్‌ రాహుల్‌. అతడు అప్పటికే క్రీజులో పాతుకుపోయాడు’ అని కైఫ్‌ చెప్పుకొచ్చాడు.

‘హర్షల్‌ బౌలింగ్‌లో రాహుల్‌ పుల్‌ షాట్లు ఆడేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. దాంతో కొన్ని బంతులు వృథా అయ్యాయి. ఈ క్రమంలోనే కొన్ని బంతుల్ని మెల్లగా, మరికొన్ని బంతుల్ని బౌన్సీగా వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను గందరగోళానికి గురిచేశాడు. స్టాయినిస్ కూడా అలాగే కొన్ని బంతులు వదిలేశాడు. చివరికి అతడు ఆడిన స్లో బౌన్స్‌ బంతిని డీప్‌ పాయింట్‌లో క్యాచ్‌ పట్టడంతో ఔట్‌ అయ్యాడు. అలా తన బౌలింగ్‌తో వైవిధ్యం చూపించాడు. గతేడాది అత్యధిక వికెట్లు తీసుకున్న అతడు ఈసారి కాస్త తడబడినట్లు కనిపిస్తున్నాడు. అయినా, ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసి 25 పరుగులే ఇచ్చి ఒక కీలక వికెట్‌ తీయడం అభినందనీయం’ అని కైఫ్‌ తన అభిప్రాయాలు వెల్లడించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని