
Venkatesh Iyer: ఈ రోజు నా కల నిజమైంది : వెంకటేశ్ అయ్యర్
(Photo: Venkatesh Iyer twitter)
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది ప్రతి క్రికెటర్ కల అని కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. ఈ రోజు తన కల నిజమైందని చెప్పాడు. త్వరలో న్యూజిలాండ్ జట్టుతో జరుగనున్న టీ20 సిరీస్ కోసం బీసీసీఐ మంగళవారం తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న యువ ఆల్-రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి చోటు దక్కడంపై సంతోషం వ్యక్తం చేశాడు. ‘టీమిండియాకు ఎంపికైనందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసం నేను చాలా కష్టపడ్డాను. ఇంత త్వరగా జట్టుకు ఎంపికవుతాననుకోలేదు. నా ఫీలింగ్‌ను చెప్పడానికి మాటలు రావడం లేదు. నేను బ్యాటింగ్‌కి వెళ్లిన ప్రతిసారి మా జట్టు కోసం వీలైనన్ని ఎక్కువ పరుగులు చేసేందుకు ప్రయత్నించాను. నన్ను ఎంపిక చేసిన సెలెక్టర్లకు, కెప్టెన్‌కు.. నా ఎదుగుదలకు సాయపడిన కోచ్‌లకు, సీనియర్లకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతి క్రికెటర్‌కు టీమిండియా జెర్సీ ధరించి ఆడాలనేది ఓ కల. నా కల ఈ రోజు నిజమైంది. రోహిత్ శర్మ నాయకత్వంలో ఆడేందుకు చాలా ఆతృతతో ఎదురు చూస్తున్నాను’ అని వెంకటేశ్ అయ్యర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ అద్భుతంగా రాణించాడు. అతడు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 41.11 సగటుతో 370 పరుగులు చేయడంతో పాటు మూడు వికెట్లు కూడా పడగొట్టాడు.
నవంబరు 17 నుంచి న్యూజిలాండ్‌తో జరుగనున్న టీ20 సిరీస్ కోసం అయ్యర్‌తో పాటు, హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్‌లను కూడా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే, టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్న రాహుల్ చాహర్, వరుణ్ చక్రవర్తి ఆశించిన స్థాయిలో రాణించలేకపోయారు. ఐపీఎల్‌లో అదరగొట్టిన వీరిద్దరూ ప్రపంచకప్‌లో అంచనాలను అందుకోలేకపోయారు. దీంతో సెలెక్టర్లు న్యూజిలాండ్ సిరీస్‌కి వీరిద్దరినీ పక్కనపెట్టారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.