WTC Final: కోహ్లీసేనలో భారీ మార్పుల సూచన!

జట్టు కూర్పును వెంటనే సమీక్షించుకుంటామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. బాగా ఆడగలిగే సరైన వైఖరి గల సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరిగా పటిష్ఠమైన టెస్టు జట్టను రూపొందించుకుంటామని వివరించాడు. ..

Updated : 24 Jun 2021 22:21 IST

సరైన వైఖరితో ఆడే సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తాం: కోహ్లీ

సౌథాంప్టన్‌: జట్టు కూర్పును వెంటనే సమీక్షించుకుంటామని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. బాగా ఆడగలిగే సరైన వైఖరి గల సరైన ఆటగాళ్లను ఎంపిక చేస్తామని పేర్కొన్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాదిరిగా పటిష్ఠమైన టెస్టు జట్టును రూపొందించుకుంటామని వివరించాడు. కొందరు ఆటగాళ్లు పరుగులు చేసేందుకు అవసరమైన తీవ్రతను ప్రదర్శించలేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత ఆయన మాట్లాడాడు.

ఈ మ్యాచులో సీనియర్‌ ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా తొలి ఇన్నింగ్స్‌లో 54 బంతులాడి 8 పరుగులే చేశాడు. తొలి పరుగు చేసేందుకు 35 బంతులు తీసుకున్నాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 80 బంతులాడి 15 పరుగులు చేయడం గమనార్హం. మరో 30-40 పరుగులు చేసుకుంటే మ్యాచ్‌ డ్రా అయ్యేందుకు ఆస్కారం ఉండేది.

‘మేం సమీక్షించుకుంటాం. అన్ని రకాల బంతులు, అన్ని రకాల వాతావరణంలో ఆడగలిగేలా టీమ్‌ఇండియాను పటిష్ఠంగా మారుస్తాం. ఈ ప్రణాళికలు అమలు చేసేందుకు మేం ఏడాది సమయమేమీ తీసుకోం. వెంటనే చర్యలు ప్రారంభిస్తాం. మా పరిమిత ఓవర్ల జట్టును చూడండి. ఆటగాళ్లు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. దేనికైనా సిద్ధమే అంటారు. టెస్టు జట్టులోనూ అలాంటి మార్పులు అవసరం’ అని కోహ్లీ అన్నాడు.

‘జట్టు రాణించేందుకు, భయం లేకుండా ఆడేందుకు ఏం చేయాలో కనుక్కోవాలి. సరైన వైఖరితో ఆడగలిగే వ్యక్తులను తీసుకురావాలి. ఎక్కువ పరుగులు చేసేందుకు మేం  ప్రణాళికలతో ముందుకు రావాలి. మరీ వ్యత్యాసం రాకుండా జోరు కొనసాగించాలి. సాంకేతిక ఇబ్బందులు ఉన్నట్టు నాకైతే అనిపించడం లేదు’ అని విరాట్‌ తెలిపాడు.

‘ఆట, పరిస్థితులపై మాకు మరింత అవగాహన అవసరం. బౌలర్లు మమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టకుండా ధైర్యంగా ఆడాలి. తొలిరోజు మాదిరిగా మరీ స్వింగైతే, చల్లని వాతావరణం ఉంటే తప్ప బౌలర్లు ఒకే ప్రాంతాల్లో బంతులు వేయకుండా అడ్డుకోవాలి. వారు లెంగ్తులు మార్చుకొనేలా దూకుడుగా ఆడాలి. పరీక్షించే పరిస్థితుల్లో ఔటవ్వడం గురించి ఆలోచించొద్దు. పరుగులు చేయడంపై దృష్టి పెట్టాలి. అలా చేస్తేనే ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టగలం. లేదంటే ఔటవ్వకుండా ఉండాలని కోరుకోవడమే మిగులుతుంది. న్యూజిలాండ్‌ తరహా నాణ్యమైన బౌలింగ్‌లో అనుగుణమైన రిస్క్‌ను తీసుకోవడం ముఖ్యం’ అని కోహ్లీ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని