Ravi Shastri: తరచూ గాయపడటం ఏంటి..? ఫాస్ట్‌ బౌలర్లపై రవిశాస్త్రి ఆగ్రహం

తరచూ భారత పేస్‌ బౌలర్లు గాయపడటంపై టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి (Ravi Shastri) అసహనం వ్యక్తం చేస్తూనే.. పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.

Published : 12 Apr 2023 19:37 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియా పేసర్లపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. వరుసగా గాయాలపాలు కావడం సరైంది కాదని పేర్కొన్నాడు. గత సెప్టెంబర్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ 16వ సీజన్‌లోనూ (IPL 2023) ఆడని విషయ తెలిసిందే. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్‌ ఫాస్ట్‌ బౌలర్ దీపక్ చాహర్‌ కూడా గాయపడ్డాడు. దీంతో భారత పేస్‌ దళం తరచూ గాయాలుపాలు కావడం భవిష్యత్తులో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ, ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు తప్పనిసరిగా దృష్టిసారించాలని సూచించాడు. లేకపోతే ఇరువురికి నష్టమని స్పష్టం చేశాడు. 

‘‘గత మూడు నాలుగేళ్లుగా కొంతమంది జాతీయ క్రికెట్‌ అకాడమీలో శాశ్వత నివాసితులు ఉంటున్నారు. వారికి త్వరలోనే రెసిడెంట్ పర్మిట్‌ కూడా వస్తుందేమో (కాస్త వ్యంగ్యంగా). ఇది భారత క్రికెట్‌కు మంచిది కాదు. వరుసగా గాయపడుతూనే ఉంటే ఎక్కువ క్రికెట్‌ను ఆడటం కష్టం. కనీసం నాలుగు మ్యాచ్‌లు కూడా ఆడలేకపోతే.. ఎన్‌సీఏకి వెళ్లి లాభం ఏంటి..? జాతీయ క్రికెట్ జట్టులో మాత్రమే కాకుండా.. ఐపీఎల్‌లోనూ గాయాల బెడద ఎక్కువైంది. దీని వల్ల అందరికీ నష్టం చేకూరుతుంది. ప్రతి మూడు మ్యాచ్‌లకు ఎన్‌సీఏకు వెళ్లి వస్తుంటే ఇంకేం ఆడతారు...? మీరు (బౌలర్లు) ఫిట్‌గా ఉన్నామని భావిస్తేనే వచ్చి ఆడండి. లేకపోతే ఇది జట్టుకు, బీసీసీఐ, ఫ్రాంచైజీ సారథులకు తీవ్ర నిరుత్సాహం కలిగిస్తుంది. తీవ్రమైన గాయాల పరిస్థితి ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. అయితే, ప్రతి నాలుగో మ్యాచ్‌కు గాయమైతే .. ఎన్‌సీఏలో ట్రైనింగ్‌ ఏం తీసుకున్నారనే అనుమానం కలుగుతుంది’’ అని రవిశాస్త్రి తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని