Wtc Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు టీమ్‌ఇండియా స్క్వాడ్‌.. మాజీ కోచ్‌ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (WTC Final) టీమ్‌ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇటీవల విఫలమవుతున్న సూర్యకుమార్‌ను పక్కన పెట్టేసి.. ఐపీఎల్‌లో (IPL) అదరగొట్టేస్తున్న రహానెకు చోటు కల్పించింది.

Published : 26 Apr 2023 12:14 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (WTC) రెండో సీజన్‌ ఫైనల్‌లో భారత్‌ తలపడే విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో అదరగొట్టేస్తున్న అజింక్య రహానె మళ్లీ జట్టులోకి వచ్చాడు. అయితే, సూర్యకుమార్‌ యాదవ్‌ను సెలెక్టర్లు పక్కనపెట్టేశారు. కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌కు కూడా అవకాశం దక్కలేదు. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్, జస్ప్రీత్‌ బుమ్రాకు చోటు కల్పించలేదు. ఆల్‌రౌండర్‌ శార్దూల్ ఠాకూర్‌కు అవకాశం వచ్చింది. ఈ క్రమంలో భారత జట్టుపై మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.

బీసీసీఐ సెలెక్టర్లు, మేనేజ్‌మెంట్‌పై రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా స్పందించాడు. ‘‘అత్యుత్తమ జట్టును ప్రకటించారు. బీసీసీఐ సెలెక్టర్లు, టీమ్ మేనేజ్‌మెంట్ మంచి పని చేశారు. వారికి నా అభినందనలు’’ అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. ఐపీఎల్‌ ముగిశాక.. లండన్‌లోని ఓవల్‌ వేదికగా జూన్‌ 7 నుంచి 11వ తేదీ వరకు ఆసీస్‌తో టీమ్ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ ఆడనుంది. వరుసగా రెండోసారి టీమ్‌ఇండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఇటీవలే రోహిత్ నాయకత్వంలోని భారత జట్టు  2-1 తేడాతో ఆసీస్‌ను ఓడించి బోర్డర్ - గావస్కర్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.

భారత జట్టు ఇదే: (Team India)

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్‌ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమీ, ఉమేశ్‌ యాదవ్, జయ్‌దేవ్ ఉనద్కత్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని