IPL 2024: ఐపీఎల్‌ వేలంలో ఆ నిబంధన ఎత్తేస్తే వీరికి రూ.100 కోట్లు ఖాయం: రాబిన్ ఉతప్ప

ఐపీఎల్‌ (IPL) వేలంలో డబ్బు వెచ్చించడానికి ఫ్రాంఛైజీలకు పరిమితి లేకపోతే 10 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతారని భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప అభిప్రాయపడ్డాడు. 

Published : 14 Mar 2024 00:08 IST

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్‌-2024 (IPL 2024) సీజన్‌ ప్రారంభానికి సమయం ఆసన్నమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులున్న ఈ మెగా టోర్నీ మార్చి 22న ఆరంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ ఫ్రాంఛైజీలు ఏర్పాటుచేసిన శిబిరాల్లో చేరి ప్రాక్టీస్‌ చేస్తున్నారు. ఈ సీజన్‌ కోసం కొన్ని జట్లు కీలక మార్పులు చేశాయి. గతేడాది జరిగిన వేలంలో ఆస్ట్రేలియా ఫాస్ట్‌బౌలర్లు మిచెల్‌ స్టార్క్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్‌ రూ.24.75 కోట్లకు, పాట్ కమిన్స్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ రూ.20.50 కోట్లకు కొనుగోలు చేశాయి. ఐపీఎల్‌ చరిత్రలో ఆటగాళ్లు రూ.20 కోట్ల కంటే ఎక్కువ ధర పలకడం ఇదే తొలిసారి.

ఈనేపథ్యంలో భారత మాజీ క్రికెటర్‌ రాబిన్‌ ఉతప్ప (Robin Uthappa) ఐపీఎల్‌లో భారీ వేతనాల గురించి మాట్లాడాడు. ఐపీఎల్‌ వేలంలో డబ్బు వెచ్చించడానికి ఫ్రాంఛైజీలకు పరిమితి లేకపోతే 10 మంది టీమ్ఇండియా ఆటగాళ్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధర పలుకుతారని పేర్కొన్నాడు. ప్రస్తుతమున్న నిబంధనల ప్రకారం ఒక్కో ఫ్రాంఛైజీ రూ.100 కోట్లు ఖర్చు పెట్టడానికి వీలుంది. ‘‘ఒకవేళ బహిరంగ వేలం ఉండి ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టడానికి పరిమితి లేనట్లయితే కొంతమంది టీమ్ఇండియా ఆటగాళ్లు భారీ ధర పలుకుతారు. రూ.1000 కోట్లు లేదా రూ.500 కోట్లు అని లిమిట్ ఉంటే పది మంది భారత ప్లేయర్లు రూ.100 కోట్ల కంటే ఎక్కువ ధరకు అమ్ముడవుతారు. జాబితాలో మొదట ఉండే పేరు జస్‌ప్రీత్‌ బుమ్రా (Jasprit Bumrah). విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, సూర్యకుమార్‌ యాదవ్‌, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్‌ కూడా రూ.100 కోట్ల పైచిలుకు ధర దక్కించుకుంటారు. రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్ కచ్చితంగా రూ.80 నుంచి 100 కోట్ల ధర పలుకుతారు’’ అని ఉతప్ప అభిప్రాయపడ్డాడు. 

ఐపీఎల్‌లో ఉతప్పకు మంచి అనుభవం ఉంది. వివిధ ఫ్రాంఛైజీల తరఫున మొత్తం 205 మ్యాచ్‌లు ఆడి 4,952 పరుగులు చేశాడు. 27 అర్ధ సెంచరీలు కొట్టిన అతడు.. ఒక్కసారి కూడా సెంచరీ మార్క్‌ అందుకోలేకపోయాడు. 2014లో కేకేఆర్‌ తరఫున 660 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ విన్నర్‌గా నిలిచాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని