Team India: అసలైన సంబరాలు అప్పుడేనన్న రోహిత్.. ఫీల్డింగ్‌పై అశ్విన్‌ దృష్టిపెట్టాలన్న మిశ్రా!

Updated : 19 Oct 2023 12:41 IST

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్‌ గెలిచిన తర్వాత భారత కెప్టెన్‌ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు దాదాపు ఏడాదిన్నర తర్వాత వన్డేల్లోకి వచ్చిన అశ్విన్‌ ఒక్క విషయంలో మాత్రం ఇంకా మెరుగవ్వాలని అమిత్ మిశ్రా సూచించాడు. సంజూ స్క్వాడ్‌లోకి వచ్చినా ఒక్క మ్యాచ్‌ కూడా ఆడేందుకు అవకాశం రాదని రాబిన్‌ ఉతప్ప వ్యాఖ్యానించాడు. ఇలాంటి భారత క్రికెట్‌ విశేషాలు మీ కోసం.. 

ప్రపంచ కప్ గెలిచాకే క్రాకర్స్ కాలుద్దాం: భారత కెప్టెన్

‘‘ఆసియా కప్‌లో విజేతగా నిలవడంతో వరల్డ్‌ కప్‌ ముంగిట తప్పకుండా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మినీ టోర్నీలో అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థులకు సవాళ్లు విసిరాం. ఫలితాలను రాబట్టగలిగాం. అయితే, ఇప్పుడే సంబరాలను చేసుకోవడం వద్దు. ప్రపంచకప్‌ ముందుంది. అందులోనూ ఛాంపియన్‌గా నిలిచిన తర్వాత క్రాకర్స్‌ను కాల్చుకుందామని అభిమానులను కోరుతున్నా’’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. వరల్డ్‌ కప్‌లో బరిలోకి దిగేముందు ఆస్ట్రేలియాతో సెప్టెంబర్ 22 నుంచి మూడు వన్డేల సిరీస్‌లో ఆడనుంది.


అశ్విన్‌ దానిపైనే దృష్టిపెట్టాలి: అమిత్ మిశ్రా

‘‘రవిచంద్రన్ అశ్విన్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్ అనడంలో సందేహం లేదు. వికెట్లను కూల్చి జట్టును గెలిపించగల సత్తా అతడిలో ఉంది. అయితే 50 ఓవర్ల మ్యాచ్‌ పూర్తి విభిన్నం. కనీసం పది ఓవర్లు బౌలింగ్‌ వేయడంతోపాటు మిగతా 40 ఓవర్లు ఫీల్డింగ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే బ్యాటింగ్‌ కూడా చేయాలి. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విషయంలో అశ్విన్‌కు తిరుగులేదు. కానీ, ఫీల్డింగ్‌లోనే ఎలా రాణిస్తాడనేది కీలకం. అందుకే, జట్టు యాజమాన్యం యువ ఆటగాడి వైపు (వాషింగ్టన్ సుందర్) మొగ్గు చూపే అవకాశం ఉంది. అక్షర్‌ పటేల్ గాయపడటంతో అశ్విన్‌ను ఎంపిక చేశారు. ఆఫ్‌ స్పిన్నర్‌ ఆప్షన్‌ వల్ల కూడా అశ్విన్‌ జట్టులోకి వచ్చాడు. ఇప్పటికే మణికట్టు స్పిన్నర్ కుల్‌దీప్‌తోపాటు రవీంద్ర జడేజా రూపంలో ఎడమచేతివాటం స్పిన్నర్‌ కూడా ఉన్నాడు. అయితే, ఆసీస్‌తో సిరీస్‌లో అశ్విన్‌ ఎలాంటి ఆటతీరును ప్రదర్శిస్తాడనే దానిపైనే వరల్డ్‌ కప్‌లోకి తీసుకోవడం ఆధారపడి ఉంటుంది’’ అని భారత సీనియర్‌ స్పిన్నర్ అమిత్ మిశ్రా తెలిపాడు.


సంజూ స్థానంలో ఉండాలని ఎవరూ అనుకోరు: రాబిన్ ఉతప్ప

ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌తోపాటు ప్రపంచకప్‌ కోసం ప్రకటించిన స్క్వాడ్‌లోనూ సంజూ శాంసన్‌కు అవకాశం దక్కలేదు. దీంతో అతడిని ఎంపిక చేయకపోవడంపై అభిమానుల నుంచి విమర్శలు వచ్చాయి. ఇక సంజూ కూడా తన నిరుత్సాహాన్ని సోషల్‌ మీడియా వేదికగా ఎమోజీతో తెలిపిన విషయం తెలిసిందే. అయితే, సంజూను ఎంపిక చేయకపోవడంపై భారత మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్ప స్పందించాడు. ‘‘సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు. అయితే, అతడిలాంటి పరిస్థితిని ఎవరూ కోరుకోవడం లేదు. ఎందుకంటే.. ఒకవేళ ఇప్పుడు స్క్వాడ్‌లో ఉన్నా సరే ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోవచ్చు. అయితే, కనీసం స్క్వాడ్‌లో లేకపోవడం కూడా తీవ్రంగా బాధించే అంశమే’’ అని రాబిన్ ఉతప్ప ట్వీట్‌ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని