RCBw Vs DCw: బ్యాట్‌తో దంచి.. బంతితో మెరిసి.. బెంగళూరుపై దిల్లీ ఘన విజయం

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023)లో దిల్లీ క్యాపిటల్స్‌ (DCw) బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCBw)తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

Updated : 05 Mar 2023 18:55 IST

ముంబయి: మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL 2023)లో దిల్లీ క్యాపిటల్స్‌ (DCw) బోణీ కొట్టింది. రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCBw)తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన దిల్లీ.. కెప్టెన్‌ మెగ్ లానింగ్‌  (72; 43 బంతుల్లో 14 ఫోర్లు), షఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరు 163/8కే పరిమితమైంది. బెంగళూరు బ్యాటర్లలో స్మృతి మంధాన (35; 23 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), ఎల్లీస్ పెర్రీ (31), హీథర్‌ నైట్‌ (34; 20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), మెగన్ స్కట్ (30; 19 బంతుల్లో 5 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. దిల్లీ బౌలర్లలో తారా నోరిస్ ఐదు వికెట్లతో ఆకట్టుకోగా.. ఆలిస్ కాప్సే రెండు, శిఖా పాండే ఒక వికెట్‌ పడగొట్టారు.

షఫాలీ, లానింగ్ ధనాధన్‌.. ముంబయి రికార్డు బద్దలు

ఇన్నింగ్స్‌ ఆరంభం నుంచి షఫాలీ, మెగ్ లానింగ్‌ ధనాధన్‌ ఆటతీరుతో అలరించారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. షఫాలీ 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. లానింగ్‌ 30 బంతుల్లోనే ఈ మార్క్‌ను అందుకుంది. మెగన్ స్కట్ వేసిన రెండో ఓవర్‌లో లానింగ్‌ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. ప్రీతి బోస్‌ వేసిన నాలుగో ఓవర్‌లో షఫాలీ ఓ సిక్సర్‌ బాదింది. సోఫీ డివైన్‌ వేసిన ఆరో ఓవర్‌లో చెరో రెండు బౌండరీలు బాదారు. ఆషా శోభన వేసిన తొమ్మిదో ఓవర్‌లో షఫాలీ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌.. లానింగ్‌ ఓ ఫోర్‌ రాబట్టడంతో ఈ ఓవర్‌లో ఏకంగా 22 పరుగులొచ్చాయి. హీథర్‌ నైట్‌ వేసిన 11 ఓవర్‌లో మరో సిక్సర్‌ బాదిన షఫాలీ.. రేణుకా సింగ్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో బంతిని మూడు సార్లు బౌండరీకి పంపింది.

వరుస బౌండరీలతో విరుచుకుపడుతూ శతకాల దిశగా సాగుతున్న ఈ ఇద్దరూ బ్యాటర్లను హీథర్‌ ఒకే ఓవర్‌లో ఔట్‌ చేసి బెంగళూరుకు ఉపశమనం అందించింది. లానింగ్ క్లీన్‌బౌల్డ్‌ కాగా.. షఫాలీ.. వికెట్‌ కీపర్‌ రిచా ఘోష్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరింది. ఆ తర్వాత మెరిజన్నే (39*; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు), జెమీమా రోడ్రిగ్స్‌ (22*; 15 బంతుల్లో 3 ఫోర్లు) కూడా రాణించారు. ఈ క్రమంలోనే లీగ్ ఆరంభ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ 207 స్కోరును దిల్లీ క్యాపిటల్స్ బద్దలు కొట్టి కొత్త రికార్డును నమోదు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని