SA vs IND: కవర్లు కొనడానికి డబ్బులు లేవా? దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డుపై సునీల్ గావస్కర్ ఆగ్రహం

 దక్షిణాఫ్రికా, భారత్‌ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. అయితే, మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ దక్షిణాఫ్రికా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

Updated : 11 Dec 2023 09:30 IST

డర్బన్‌: మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా, భారత్‌ (SA vs IND) మధ్య జరగాల్సిన తొలి టీ20 వర్షార్పణం అయింది. టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దయింది. మ్యాచ్‌ జరగాల్సిన కింగ్స్‌మీడ్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో టాస్ వేయడానికి నిర్దేశించిన సమయం కంటే ముందు నుంచే వర్షం కురిసింది. దీంతో మైదాన సిబ్బంది పిచ్‌ను కవర్లతో కప్పి ఉంచారు. ఓవర్లు కుదించి మ్యాచ్‌ నిర్వహించాలని భావించినా మైదానం తడిగా ఉండటంతో చివరకు రద్దు చేశారు. మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోవడంపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) దక్షిణాఫ్రికా బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వర్షం కురిసినప్పుడు ప్రపంచంలోని చాలా స్టేడియాల్లో మాదిరిగా పిచ్‌, మైదానం మొత్తాన్ని కవర్లతో కప్పి ఉంచాలని సూచించాడు. 

‘‘మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచకపోతే ఒకవేళ వర్షం ఆగిపోయినా గంట వరకు మ్యాచ్‌ ప్రారంభం కాదని మీకు తెలుసు. మ్యాచ్‌ నిర్వహణకు మైదానాన్ని సిద్ధం చేసిన తర్వాత అకస్మాత్తుగా మళ్లీ వర్షం వస్తే ఏం చేయలేం. ప్రతీ క్రికెట్ బోర్డుకు చాలా డబ్బు వస్తోంది. అన్ని క్రికెట్ బోర్డుల దగ్గర డబ్బు పుష్కలంగా ఉంది. ఒకవేళ బోర్డులు డబ్బు లేదని చెబితే అది కచ్చితంగా అబద్ధం. అయితే, బీసీసీఐ వద్ద ఉన్నంత డబ్బు మిగతా బోర్డుల దగ్గర ఉండకపోవచ్చు. కానీ, ప్రతి బోర్డు దగ్గర మైదానం మొత్తాన్ని కప్పడానికి అవసరమైన కవర్లను కొనుగోలు చేయడానికి సరిపోయేంత డబ్బు మాత్రం తప్పకుండా ఉంటుంది.  

2019లో ఇంగ్లాండ్‌లో జరిగిన చాలా ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఇదే సమస్య ఎదురైంది. వర్షం అంతరాయంతో చాలా జట్ల పాయింట్లు నష్టపోయాయి. ఔట్‌ఫీల్డ్ తడిగా ఉన్న కారణంగా ఆ టోర్నీలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ మ్యాచ్‌ పూర్తిగా జరగలేదు. ప్రతి బోర్డు మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచాలి. దీన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఈడెన్ గార్డెన్స్‌లో ఒక టెస్ట్ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఆట ప్రారంభం కాలేదు. తదుపరి మ్యాచ్‌కు ఈడెన్ గార్డెన్స్ మొత్తం మైదానాన్ని కవర్లతో కప్పి ఉంచారు. దాన్నుంచి మీరు (దక్షిణాఫ్రికా) కూడా నేర్చుకోవాలి’’ అని సునీల్ గావస్కర్‌ సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని