IPL 2024: రోహిత్‌ శర్మ, సంజు శాంసన్‌ మధ్య కెప్టెన్సీలో పోలికలు ఇవే: ధ్రువ్‌ జురెల్

కెప్టెన్సీలో రోహిత్ శర్మ, సంజు శాంసన్‌ మధ్య ఉన్న పోలికలను భారత యువ కీపర్‌ ధ్రువ్‌ జురెల్ (Dhruv Jurel) వివరించాడు.

Updated : 19 Mar 2024 11:10 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో ధ్రువ్‌ జెరెల్ (Dhruv Jurel) అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడి 190 పరుగులు చేసి మంచి మార్కులు కొట్టేశాడు. టెస్టు సిరీస్‌ సమయంలో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మతో అతడికి మంచి అనుబంధం ఏర్పడింది. ఇదిలా ఉండగా.. రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న జురెల్ ఐపీఎల్ (IPL) 2024 సీజన్‌లోనూ అదరగొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఇటీవల కెప్టెన్సీలో రోహిత్ శర్మ (Rohit Sharma), రాజస్థాన్‌ కెప్టెన్‌ సంజు శాంసన్‌ (Sanju Samson) మధ్య ఉన్న పోలికలను వివరించాడు.

‘‘నేను సంజు శాంసన్‌తో కలిసి గత మూడు సంవత్సరాలుగా ఆడుతున్నాను. అతడు చాలా ఉత్సాహంగా ఉంటాడు. వ్యక్తిత్వం విషయానికి వస్తే రోహిత్ శర్మ వలే అనిపిస్తుంది. వ్యూహాల గురించి తరచుగా మాట్లాడతాడు’’ అని ధ్రువ్‌ జురెల్‌ వివరించాడు. కెప్టెన్‌గా శాంసన్‌ జట్టులో సీనియర్, జూనియర్‌ అని తేడా లేకుండా ఆటగాళ్లందరిని ఒకచోట చేర్చి ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం కలిగిస్తాడని పేర్కొన్నాడు. ‘‘నేను ఐపీఎల్‌లో తొలి సంవత్సరం బెంచ్‌కే పరిమితమయ్యాను. కానీ, నాకు అలా అనిపించలేదు. శాంసన్ మైదానంలోనే కాకుండా వెలుపల కూడా వ్యూహాల గురించి మాట్లాడతాడు. తన అనుభవాన్ని పంచుకుంటాడు’’ అని ధ్రువ్‌ జురెల్ పేర్కొన్నాడు. 

మార్చి 22 నుంచి ఐపీఎల్ 2024 సీజన్‌ ప్రారంభంకానుంది. టోర్నీ ఆరంభపోరులో డిఫెండింగ్ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడనుంది. మార్చి 24న లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌తో రాజస్థాన్‌ రాయల్స్‌ తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని