Shreyas Iyer: జట్టులోకి శ్రేయస్‌.. సూర్యకు చోటుంటుందా?

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టుకు దూరమైన టీమిండియా బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకున్నాడు. దిల్లీలో బుధవారం ఆస్ట్రేలియా(Australia)తో జరిగే రెండో టెస్టు మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ (BCCI) ఒక ప్రకటనలో తెలిపింది. 

Published : 15 Feb 2023 01:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెన్ను గాయం కారణంగా  జట్టుకు దూరమైన టీమిండియా (Team India) మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (Shreyas Iyer) గాయం నుంచి కోలుకున్నాడు. దీంతో ఆస్ట్రేలియా (Australia)తో జరిగే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కు శ్రేయస్‌ అందుబాటులో ఉంటాడని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ‘‘శ్రేయస్‌ అయ్యర్‌ తన వెన్ను గాయం నుంచి జాతీయ క్రికెట్‌ అకాడమీ (NCA)లో కోలుకున్నాడు. బీసీసీఐ వైద్య బృందం ఈ విషయాన్ని ధ్రువీకరించింది. దిల్లీలో ఆస్ట్రేలియాతో జరిగే రెండో టెస్ట్‌ మ్యాచ్‌కి అతడు అందుబాటులో ఉంటాడు’’ అని బీసీసీఐ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. శ్రేయస్ రాకతో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటింగ్‌ మరింత బలంగా మారనుంది. మరోవైపు శ్రేయస్‌ అయ్యర్‌ జట్టులోకి రావడంతో సూర్యకుమార్‌ యాదవ్‌కు జట్టులో స్థానం ఉంటుందా? లేదా? అనేది తెలియాల్సివుంది.  

బీసీసీఐ నిబంధనల ప్రకారం గాయం నుంచి కోలుకున్న ఆటగాడు ఎవరైనా దేశవాళీ మ్యాచ్‌లు ఆడాలి. కానీ, గత నెల రోజులుగా శ్రేయస్‌ అయ్యర్‌ ఎలాంటి మ్యాచ్‌ ఆడలేదు. బోర్డర్‌-గవాస్కర్‌ టోర్నీలో భాగంగా  దిల్లీ వేదికగా ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం నుంచి ప్రారంభంకానుంది. నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. మరోవైపు, మూడో టెస్ట్‌ మ్యాచ్‌ వేదికను బీసీసీఐ ధర్మశాల నుంచి ఇండోర్‌కు తరలించింది. ధర్మశాలలోని వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జై షా ఓ ప్రకటనలో తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని