Shubman Gill:ఇదే లాస్ట్ ఛాన్స్‌.. ఆడకుంటే పక్కన పెడతాం.. వైజాగ్‌ టెస్టుకు ముందు గిల్‌కు అల్టిమేటం!

ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని భారత టీమ్‌మేనేజ్‌మెంట్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill)ను హెచ్చరించిందట. 

Published : 04 Feb 2024 22:46 IST

ఇంటర్నెట్ డెస్క్: వైజాగ్‌లో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టు సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (Shubman Gill) (104; 147 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. గిల్ శతకంతో పర్యటక జట్టు ముందు టీమ్ఇండియా భారీ లక్ష్యాన్ని ఉంచగలిగింది. ఈ మ్యాచ్‌ కంటే ముందు గిల్‌ ఆటతీరుపై విమర్శలు వచ్చాయి. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్టులు, ఇంగ్లాండ్‌తో తొలి టెస్టులో శుభ్‌మన్‌ కనీసం ఒక్క అర్ధ శతకం కూడా చేయలేకపోవడమే ఇందుకు కారణం. దీంతో వైజాగ్‌ టెస్టులో అతడు తప్పక రాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అతడు అద్భుతమైన ఆటతీరుతో శతకం బాది విమర్శకుల నోళ్లు మూయించాడు. అయితే, ఉప్పల్‌ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌ అయిన తర్వాత గిల్‌కు టీమ్‌మేనేజ్‌మెంట్‌ అల్టిమేటం జారీ చేసిందట. వైజాగ్‌ మ్యాచ్‌లో రాణించకపోతే జట్టులో చోటు కోల్పోవడం ఖాయమని హెచ్చరించిందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 

తొలి టెస్టులో విఫలమైన తర్వాత బ్యాటింగ్‌ మెరుగుపర్చుకోవడం కోసం రంజీ ట్రోఫీలో ఆడాలనుకున్నాడట. ఒకవేళ ఇంగ్లాండ్‌తో రెండో టెస్టులో విఫలమైతే ఫిబ్రవరి 9 నుంచి గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ తరఫున బరిలోకి దిగాలని గిల్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ‘‘నేను గుజరాత్‌తో మొహాలీలో జరిగే రంజీ ట్రోఫీ మ్యాచ్ ఆడతాను’’ అని గిల్ తన కుటుంబ సభ్యులలో ఒకరికి చెప్పాడట.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని