IND vs SA: భారత్‌తో సిరీస్‌లు.. మా జట్టు రికార్డును కొనసాగిస్తాం: దక్షిణాఫ్రికా కోచ్

వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత్‌ (IND vs SA) తొలి విదేశీ పర్యటన చేసేందుకు సిద్ధమవుతోంది. దక్షిణాఫ్రికాతో 2 టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. 

Updated : 07 Dec 2023 12:15 IST

ఇంటర్నెట్ డెస్క్: డిసెంబర్‌ 10వ తేదీ నుంచి జనవరి 7 వరకు దాదాపు నెల రోజులపాటు దక్షిణాఫ్రికాలో భారత్‌ (IND vs SA) పర్యటించనుంది. రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో ఇరు జట్లు తలపడనున్నాయి. వన్డే ప్రపంచకప్‌లో అద్భుతమైన ఆటతీరుతో దక్షిణాఫ్రికా సెమీస్‌కు చేరుకుంది. అలాంటి జట్టును వారి స్వదేశంలో ఢీకొట్టాలంటే మరింత అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ తమ జట్టుపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్టుల్లో భారత్‌పై ఆధిపత్యం కొనసాగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తామని వెల్లడించాడు. బావుమా నాయకత్వంలోని సఫారీ జట్టు రోహిత్‌ సేనతో టెస్టుల్లో తలపడనుంది.

‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ కొత్త సీజన్‌ను మేం ప్రారంభించబోతున్నాం. స్వదేశంలో కాబట్టి మాపై ఒత్తిడి ఉన్నా పరిస్థితులు సానుకూలంగా ఉంటాయని భావిస్తున్నా. మంచి ఆరంభం దక్కితే దానిని కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుతో తలపడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. టెస్టుల్లో భారత్‌పై మాకు మంచి రికార్డు ఉంది. ఇప్పుడు బరిలోకి దిగుతున్న జట్టుపై నాకు పూర్తి నమ్మకం ఉంది. దక్షిణాఫ్రికాకే గర్వకారణమైన రికార్డును కొనసాగిస్తాం’’ అని కాన్రాడ్ వ్యాఖ్యానించాడు. భారత్-దక్షిణాఫ్రికా 42 టెస్టుల్లో తలపడ్డాయి. టీమ్‌ఇండియా 15 మ్యాచులు, దక్షిణాఫ్రికా 17 మ్యాచుల్లో గెలిచాయి. ఇక సఫారీ జట్టు స్వదేశంలోనే 12 టెస్టుల్లో భారత్‌పై విజయం సాధించింది.

అతడు గేమ్‌ ఛేంజర్‌: ఆకాశ్ చోప్రా

దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్టు సిరీస్‌కు రోహిత్ శర్మ భారత కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో రోహిత్ తర్వాత టెస్టు కెప్టెన్సీ ఎవరికి వస్తుందనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దానికి భారత మాజీ క్రికెటర్, విశ్లేషకుడు ఆకాశ్ చోప్రా తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ‘‘నేను ఇప్పుడు సుదీర్ఘకాలం గురించి మాట్లాడుతున్నా. భవిష్యత్తులో శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్ టెస్టు సారథ్యం స్వీకరించే వారిలో ముందున్నారు. అందులోనూ టెస్టుల్లో పంత్ 24 క్యారెట్ల బంగారంలాంటి ఆటగాడు. అతడు గేమ్‌ ఛేంజర్‌. తప్పకుండా రోహిత్ శర్మ తర్వాత వీరిద్దరిలో ఒకరిని టెస్టు కెప్టెన్‌గా చూడొచ్చు’’ అని చోప్రా వ్యాఖ్యానించాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు గిల్‌ ఎంపికైన సంగతి తెలిసిందే. మరోవైపు రిషభ్‌ పంత్ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకుంటున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని