World Cup- SA vs SL: శ్రీలంకపై సౌతాఫ్రికా ఘన విజయం

వన్డే ప్రపంచకప్‌ను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

Updated : 07 Oct 2023 22:52 IST

దిల్లీ: వన్డే ప్రపంచకప్‌ను సౌతాఫ్రికా ఘనంగా ఆరంభించింది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 102 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.  క్వింటన్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డెర్ డస్సెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలకు తోడు ఐడెన్ మార్‌క్రమ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగుల భారీ స్కోరు సాధించింది. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. ఈ భారీ లక్ష్యఛేదనలో శ్రీలంక 44.5 ఓవర్లకు 326 పరుగులు చేసి ఆలౌటైంది. కుశాల్ మెండిస్ (76; 42 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) మెరుపులు మెరిపించాడు. చరిత్ అసలంక (79; 65 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), డాసున్ శనక (68; 62 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.

World Cup- SA vs SL: వావ్‌.. ఒకే మ్యాచ్‌లో మూడు సెంచరీలు.. చరిత్ర సృష్టించిన మార్‌క్రమ్‌

భారీ లక్ష్యఛేదనలో లంకకు ఆదిలోనే షాక్‌ తగిలింది. రెండో ఓవర్‌లో పాథుమ్‌ నిశాంక (0)ను మార్కో జాన్సన్‌ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అయితే, వన్‌డౌన్‌ బ్యాటర్ కుశాల్ మెండిస్ మాత్రం సౌతాఫ్రికా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. లుంగి ఎంగిడి వేసిన ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు బాదిన అతడు.. మార్కో జాన్సన్‌ బౌలింగ్‌లో వరుసగా 6,4,6 కొట్టి 25 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. క్రీజులో కుదురుకోవడానికి ఇబ్బంది పడిన కుశాల్ పెరీరా (7)ను మార్కో జాన్సన్‌ పెవిలియ్‌కు పంపాడు. దూకుడుగా ఆడుతున్న మెండిస్‌ను రబాడ ఔట్ చేయడంతో స్కోరు వేగం నెమ్మదించింది. కొద్దిసేపటికే సమరవిక్రమ (23) కూడా పెవిలియన్‌ చేరడంతో లంక 111 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే, చరిత్ అసలంక నిలకడగా ఆడటంతో 20 ఓవర్లకు స్కోరు 150కి చేరింది.

ఈ క్రమంలో కేశవ్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో ధనంజయ డిసిల్వా (11) ఔటయ్యాడు. శనక, అసలంక నిలకడగా బౌండరీలు సాధించారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శతకంపై కన్నేసిన అసలంకను ఎంగిడి వెనక్కి పంపాడు. కోయెట్జీ వేసిన తర్వాతి ఓవర్‌లోనే వెల్లలాగె.. వికెట్‌కీపర్‌ క్లాసెన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. కోయెట్జీ వేసిన 36 ఓవర్‌లో శనక వరుసగా ఒక సిక్స్‌, నాలుగు ఫోర్లు బాదాడు. దూకుడుగా ఆడుతున్న శనకను మహారాజ్ బౌల్డ్ చేయడంతో శ్రీలంక శిబిరంలో గెలుపు ఆశలు సన్నగిల్లయ్యాయి. చివర్లో కాసున్ రజిత (33; 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఫర్వాలేదనిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, మార్కో జాన్సన్ 2, రబాడ 2,  కేశవ్‌ మహారాజ్ 2, ఎంగిడి ఒక వికెట్ పడగొట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని