World Cup- SA vs SL: వావ్‌.. ఒకే మ్యాచ్‌లో మూడు సెంచరీలు.. చరిత్ర సృష్టించిన మార్‌క్రమ్‌

ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో విరుచుకుపడటంతో ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది.

Updated : 07 Oct 2023 19:16 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచకప్‌లో భాగంగా దిల్లీలోని అరుణ్‌ జైట్లీ స్టేడియం వేదికగా సౌతాఫ్రికా, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. ఏకంగా ముగ్గురు ఆటగాళ్లు సెంచరీలతో విరుచుకుపడటంతో ప్రపంచకప్‌ చరిత్రలోనే అత్యధిక స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 428 పరుగులు చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (100; 84 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు), వాన్ డెర్ డస్సెన్ (108; 110 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతకాలతో కదం తొక్కారు. అనంతరం ఐడెన్ మార్‌క్రమ్ (106; 54 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు సెంచరీతో విరుచుకుపడ్డాడు. క్లాసెన్ (32; 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), డేవిడ్ మిల్లర్ (39*; 21 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా మెరుపులు మెరిపించారు. శ్రీలంక బౌలర్లలో మధుశంక 2, కాసున్ రజిత, పతిరన, వెల్లలాగె ఒక్కో వికెట్ పడగొట్టారు. లంక బౌలర్లు పతిరన 95, రజిత 90, వెల్లలాగె 81 పరుగులు సమర్పించుకున్నారు. 

ద్వి శతక భాగస్వామ్యం

సౌతాఫ్రికా స్కోరు 10 పరుగులు ఉండగా బావుమా (8).. మధుశంక బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోవడంతో శ్రీలంక ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. కానీ, ఆ ఆనందం ఎంతో సమయం నిలవలేదు. డికాక్, డస్సెన్  నిలకడగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 204 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీ స్కోరు చేయడానికి గట్టి పునాది వేశారు. 

ఫాస్టెస్ట్ సెంచరీ

డికాక్ సెంచరీ బాది ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన మార్‌క్రమ్‌ ఆరంభంలో నెమ్మదిగా ఆడినా క్రమంగా లంక బౌలర్లపై విరుచుకుపడ్డాడు. మధుశంక బౌలింగ్‌లో హ్యాట్రిక్ ఫోర్లు బాది తన లక్ష్యాన్ని చాటాడు. 34 బంతుల్లో అర్ధ శతకం అందుకున్న అతడు.. మరో 15 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్నాడంటే అతడి విధ్వంసం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. పతిరన వేసిన 43 ఓవర్‌లో మూడు ఫోర్లు, ఓ సిక్సర్‌ రాబట్టిన మార్‌క్రమ్.. మధుశంక వేసిన 46 ఓవర్‌లో వరుసగా ఫోర్, సిక్స్‌ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో మార్‌క్రమ్‌ 49 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో అతి తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డు ఐర్లాండ్‌ ఆటగాడు కెవిన్ ఓబ్రియన్ (50 బంతులు) పేరిట ఉండేది.

ఆస్ట్రేలియా రికార్డు బద్ధలు

వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే (428/5) అత్యధిక స్కోరు. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది. 2015 ప్రపంచ కప్‌లో అఫ్గానిస్థాన్‌పై ఆసీస్‌ 417/6 స్కోరు చేసింది. ఇప్పుడా రికార్డును సౌతాఫ్రికా బద్ధలు కొట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని