WI vs IND: విండీస్‌తో టెస్టు సిరీస్‌.. సెలెక్టర్లు మంచి ఛాన్స్‌ను మిస్‌ చేశారు: సన్నీ

విండీస్‌ పర్యటన (WI vs IND) కోసం పదిహేడు మందితో కూడిన వన్డే, టెస్టు జట్లను (Teams Selection) భారత్‌ ప్రకటించింది. సీనియర్ ఆటగాడు పుజారాను పక్కన పెట్టేసి.. యువకులకు అవకాశం ఇచ్చింది. అయినా సునీల్ గావస్కర్‌ (Sunil Gavaskar) మాత్రం కాస్త అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.

Updated : 24 Jun 2023 16:17 IST

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్‌తో (WI vs IND) జులై 12 నుంచి ప్రారంభమయ్యే టెస్టు, వన్డే సిరీస్‌లకు భారత్‌ జట్టును (Team India) బీసీసీఐ ప్రకటించింది. సీనియర్‌ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారాపై వేటు వేసిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్‌ను ఎంపిక చేసింది. అయితే, టెస్టు సిరీస్‌కు జట్టును ఎంపిక చేసిన విధానంపై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆడే ఆటగాళ్లను కేవలం వైట్‌బాల్‌ క్రికెట్‌పైనే దృష్టిపెట్టేలా చేయాల్సిందని పేర్కొన్నాడు.  టెస్టు క్రికెట్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి మరింత మంది యువకులను అవకాశం ఇస్తే బాగుండేదని సూచించాడు.  

‘‘ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ముగిసింది. అందులో భారత్ ఓడిపోయింది. తర్వాత టీమ్‌ఇండియా ఆడే  మెగా టోర్నీ వన్డే ప్రపంచకప్‌. అంతకుముందు ఆసియా కప్‌ కూడా ఉంది. అందుకే, ఆ టోర్నీల్లో ఆడే ఆటగాళ్లకు టెస్టు క్రికెట్‌ నుంచి విరామం ఇస్తే బాగుండేది. వారిని వన్డేలపైనే దృష్టిపెట్టేలా చేయాల్సింది.  ఎందుకంటే వచ్చే మూడు లేదా నాలుగు నెలలపాటు వరుసగా మ్యాచ్‌లు ఆడతారు.  అలాగే విండీస్‌తో టెస్టు సిరీస్‌కు వారిని ఎంపిక చేయడం వల్ల మరింతమంది కుర్రాళ్లను జట్టులోకి తీసుకొనే ఛాన్స్‌ను సెలెక్టర్లు మిస్‌ చేశారు’’ అని గావస్కర్‌ తెలిపాడు.

అర్ష్‌దీప్‌ సింగ్‌ను తీసుకోకపోవడంపైనా సన్నీ స్పందించాడు. ‘‘కొన్నిసార్లు పక్కన పెట్టడం వల్ల ఆటగాళ్లకు మంచే జరుగుతుంది. వికెట్లను తీయాలనే పట్టుదల ఇంకా పెరుగుతుంది. నాణ్యమైన బౌలింగ్‌ వేసేందుకు ప్రయత్నించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అర్ష్‌దీప్‌ సింగ్‌ విషయంలోనూ అదే జరగాలి. నిలకడగా ఐదు వికెట్ల ప్రదర్శన చేస్తే తప్పకుండా జట్టులోకి ఎంపిక చేస్తారు. భవిష్యత్తులో మూడు ఫార్మాట్లలోనూ ఆడే సత్తా అతడికే ఉంది. ఇంగ్లాండ్‌ కౌంటీ క్రికెట్‌లో రాణిస్తున్నాడు. టీ20 బౌలర్‌గా వచ్చిన బుమ్రా తర్వాత కీలకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు అర్ష్‌దీప్‌ కూడా తప్పకుండా ముఖ్య భూమిక పోషిస్తాడు. రంజీల్లో రాణించిన సర్ఫరాజ్‌ ఖాన్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది. దేశవాళీలో అదరగొట్టేశాడు. అలాంటప్పుడు రంజీ ట్రోఫీని ఆడించడం ఆపేయాలి. అక్కడ రాణించినా ఫలితం లేకపోతే ఉపయోగం ఏముంటుంది?’’ అని అన్నాడు.

మా నాన్న ఏడ్చేశారు: యశస్వి

వెస్టిండీస్‌తో రెండు టెస్టుల సిరీస్‌తోనే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ 2023-25 సీజన్‌ ప్రారంభమవుతుంది. యశస్వి జైస్వాల్‌, ముకేశ్‌ కుమార్‌ను విండీస్ పర్యటనకు ఎంపిక చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తన ఎంపికపై యశస్వి స్పందిస్తూ.. ‘‘విండీస్‌ పర్యటనకు ఎంపికైన విషయం విని మా నాన్న ఏడ్చేశారు. ప్రాక్టీస్ సెషన్‌ కోసం వెళ్లినప్పుడు సెలక్షన్‌ గురించి తెలిసింది. నాణ్యమైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తా. కొంచెం ఆందోళనగా ఉన్నప్పటికీ రాణిస్తాననే నమ్మకం ఉంది. నా సన్నద్ధతపై సీనియర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటా’’ అని చెప్పాడు. విండీస్‌ పర్యటన కోసం జాతీయ క్రికెట్ అకాడమీ (NCA)కు యశస్వి వెళ్లనున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని