Sanju First Century: సంజూపై కామెంట్లు వైరల్‌.. ఈ సెంచరీ అతడి కెరీర్‌ను మారుస్తుందన్న సన్నీ

దక్షిణాఫ్రికాపై మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. కెరీర్‌లో తొలిసారి సంజూ శాంసన్‌ సెంచరీతో అలరించాడు.

Published : 22 Dec 2023 14:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: అంతర్జాతీయ వన్డే కెరీర్‌ను ప్రారంభించిన ఎనిమిదేళ్ల తర్వాత తొలి సెంచరీ నమోదు చేసిన భారత ఆటగాడు సంజూ శాంసన్‌పై (Sanju Samson) సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సఫారీ జట్టుతో జరిగిన మూడో వన్డేలో వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ నిలకడైన ఆటతీరుతో శతకం బాదాడు. గత కొంత కాలంగా వస్తున్న అవకాశాలను నిలబెట్టుకోలేకపోయిన సంజూ.. ఈసారి మాత్రం పట్టువదల్లేదు. కీలకమైన మ్యాచ్‌లో తన సత్తా చాటాడు. సెంచరీ అనంతరం మైదానంలో ఇచ్చిన పోజు కూడా వైరల్‌గా మారింది. దీంతో అతడి అభిమానులు నెట్టింట సందడి చేశారు. మరోవైపు  ఈ సెంచరీతో అతడి కెరీర్‌ మలుపు తిరగడం ఖాయమని మాజీ దిగ్గజం సునీల్ గావస్కర్ కూడా ప్రశంసించాడు.

‘‘సంజూ శాంసన్ అద్భుతంగా ఆడాడు. ఈ సెంచరీ అతడి కెరీర్‌నే మలుపు తిప్పగలదు. అతడి టాలెంట్‌పై ఎవరికీ అనుమానాలు లేవు. కానీ, నిలకడ లేకపోవడమే అతడిని ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు కీలక మ్యాచ్‌లో శతకం చేయడం కెరీర్‌కు కలిసొస్తుంది’’ అని గావస్కర్‌ వెల్లడించాడు. 

అభిమానుల కామెంట్ల వర్షం ఇలా.. 

‘‘గురువారం సంజూ సెంచరీ.. శుక్రవారం సలార్‌ రికార్డులు.. ఇప్పుడున్న క్రికెటర్లలో అత్యంత సహజమైన ఆటగాడు సంజూ శాంసన్‌’’ - పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, సినీ నటుడు

‘‘మోహన్‌లాల్‌ హిట్‌తో వచ్చాడు.. సంజూ శాంసన్‌ సెంచరీతో మెరిశాడు.. తప్పకుండా మళయాల అభిమానులకు గొప్ప రోజే’’

‘‘ఓవర్సీస్‌ పిచ్‌లపై కఠిన పరిస్థితుల్లో సంజూ నుంచి సెంచరీ రావడం అద్భుతం. ఇది చాలా రోజులు గుర్తుండిపోతుంది’’

‘‘చాన్నాళ్ల తర్వాత అద్భుతమైన శతకం. ఇక నుంచి మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాం’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని