Gujarat vs Mumbai: ఉత్కంఠ పోరులో ముంబయిదే విజయం

టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌తో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబయి జట్టు మరికాసేపట్లో తలపడనుంది. టాస్‌ గెలిచిన గుజరాత్.. తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది.

Updated : 06 May 2022 23:50 IST

ముంబయి: గుజరాత్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. చివరి ఓవర్‌లో గుజరాత్ విజయానికి 9 పరుగులు అవసరం కాగా.. డానియల్ సామ్స్‌ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 పరుగులే ఇచ్చాడు. దీంతో ఈ సీజన్‌లో ముంబయి వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. గుజరాత్ బ్యాటర్లలో వృద్ధీమాన్‌ సాహా (55; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభమన్ గిల్ (52; 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా..హార్దిక్ పాండ్య (24), సాయి సుదర్శన్‌ (14), డేవిడ్ మిల్లర్‌ (19), రాహుల్‌ తెవాతియా (3), రషీద్‌ఖాన్‌ (1) పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో మురుగన్ అశ్విన్‌ రెండు, పొలార్డ్ ఒక వికెట్ తీశారు. ముంబయి ఇన్నింగ్స్‌లో చివర్లో మెరుపులు మెరిపించిన టిమ్‌ డేవిడ్  (44; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌) ‘ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.  


ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయిన గుజరాత్

గుజరాత్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయింది. మురుగన్ అశ్విన్ వేసిన  13వ ఓవర్‌లో తొలి బంతికి శుభమన్‌ గిల్ (52) ఔటయ్యాడు. ఇదే ఓవర్‌లో చివరి బంతికి వృద్ధీమాన్ సాహా (55) డానియల్ సామ్స్‌కు చిక్కాడు. మెరిడిత్ వేసిన 11వ ఓవర్‌లో ఐదు పరుగులు రాగా.. పొలార్డ్ వేసిన 12వ ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి. మెరిడిత్‌ వేసిన 14వ ఓవర్‌లో సాయి సుదర్శన్‌,  హార్దిక్‌ పాండ్య చెరో ఫోర్‌ కొట్టారు. 15 ఓవర్లకు గుజరాత్ 130/2 స్కోరుతో ఉంది. హార్దిక్ పాండ్య (13), సాయి సుదర్శన్‌ (7) క్రీజులో ఉన్నారు.  


దంచికొడుతున్న గుజరాత్ ఓపెనర్లు.. సగం ఓవర్లు పూర్తి
గుజరాత్ ఓపెనర్లు దంచి కొడుతున్నారు. ముంబయి బౌలర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. డానియల్ సామ్స్ వేసిన ఎనిమిదో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదిన శుభమన్‌ గిల్.. కుమార్ కార్తికేయ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఓ ఫోర్‌, సిక్స్‌ కొట్టాడు. 10 ఓవర్లకు గుజరాత్ 95/0 స్కోరుతో ఉంది. గిల్ (47) , సాహా (47) పరుగులతో క్రీజులో ఉన్నారు.


 

ధాటిగా ఆడుతున్న వృద్ధీమాన్ సాహా

ముంబయి నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు గుజరాత్ బరిలోకి దిగింది. వృద్ధీమాన్ సాహా, శుభమన్ గిల్ ఓపెనర్లుగా వచ్చారు. బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్ బాదిన సాహా.. మెరిడిత్ వేసిన నాలుగో ఓవర్‌లో మరో రెండు ఫోర్లు కొట్టాడు. మురుగన్‌ అశ్విన్ వేసిన ఆరో ఓవర్‌లో శుభమన్ గిల్ ఓ సిక్స్‌, ఫోర్ బాదాడు. 6 ఓవర్లకు గుజరాత్ 54/0 స్కోరుతో ఉంది. వృద్ధీమాన్ సాహా (37), గిల్ (16) క్రీజులో ఉన్నారు.


ముంబయి బ్యాటింగ్‌ పూర్తి.. గుజరాత్ టార్గెట్ ఎంతంటే? 

గుజరాత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబయి బ్యాటింగ్‌ పూర్తయింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు   6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (45; 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌), రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)  రాణించగా.. చివర్లో టిమ్‌ డేవిడ్ (44; 21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు‌) దంచికొట్టాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ (13), తిలక్‌ వర్మ (21), పొలార్డ్ (4) పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్‌ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. ఫెర్గూసన్, అల్జరీ జోసెఫ్‌, ప్రదీప్‌ సాంగ్వాన్‌ తలో వికెట్ తీశారు. 


స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ముంబయి

ముంబయి స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయింది. ప్రదీప్‌ సాంగ్వాన్‌ వేసిన 11వ ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (13) ఔటయ్యాడు. అతడు రషీద్‌ఖాన్‌కి క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌ (45)ను 12వ ఓవర్‌లో అల్జరీ జోసెఫ్‌ పెవిలియన్‌కు పంపాడు. ఇషాన్‌ను కూడా రషీద్‌ఖాన్‌కే క్యాచ్‌ ఇచ్చాడు. కీరన్‌ పొలార్డ్‌ (4) కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. రషీద్‌ఖాన్‌ వేసిన 15వ ఓవర్‌లో అతడు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 15 ఓవర్లకు ముంబయి 120/4 స్కోరుతో ఉంది. తిలక్ వర్మ (9), టిమ్ డేవిడ్ (1) క్రీజులో ఉన్నారు.


 ధాటిగా ఆడుతున్న ఇషాన్‌ కిషన్‌.. సగం ఓవర్లు పూర్తి
ముంబయి తొలి వికెట్ కోల్పోయింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (43) ఔటయ్యాడు. రషీద్‌ఖాన్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో అతడు ఎల్బీడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు. రాహుల్‌ తెవాతియా వేసిన తొమ్మిదో ఓవర్‌లో ఇషాన్ కిషన్‌ ఓ సిక్సర్‌ బాదాడు. ఫెర్గూసన్ వేసిన పదో ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్‌ కూడా సిక్స్‌ కొట్టాడు. 10 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టానికి 97 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (39), సూర్యకుమార్‌ యాదవ్‌ (12) క్రీజులో ఉన్నారు.  


దంచికొడుతున్న ముంబయి ఓపెనర్లు.. 

ముంబయి కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడుతున్నాడు. షమి వేసిన మూడో ఓవర్‌లో ఓ సిక్సర్‌ బాదిన అతడు.. అల్జరీ జోసెఫ్‌ వేసిన నాలుగో ఓవర్‌లో వరుసగా రెండు ఫోర్లు బాదాడు. రషీద్‌ ఖాన్ వేసిన ఐదో ఓవర్‌లో ఇషాన్‌ కిషన్‌ రెండు బౌండరీలు కొట్టాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్‌లో రోహిత్‌, ఇషాన్‌ చెరో ఫోర్ బాదారు. దీంతో 6 ఓవర్లకు ముంబయి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (42), ఇషాన్‌ కిషన్‌ (19) క్రీజులో ఉన్నారు. 


ప్రారంభమైన మ్యాచ్‌.. నిలకడగా ఆడుతున్న ముంబయి ఓపెనర్లు  
గుజరాత్‌, ముంబయి జట్ల మధ్య మ్యాచ్‌ ప్రారంభమైంది. టాస్‌ ఓడిన ముంబయి బ్యాటింగ్‌కు దిగింది. రోహిత్ శర్మ, ఇషాన్‌ కిషన్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మహ్మద్‌ షమి వేసిన తొలి ఓవర్‌లో ఐదు పరుగులు రాగా.. అల్జరీ జోసెఫ్‌ వేసిన రెండో ఓవర్‌లో తొలి రెండు బంతులను బౌండరీకి పంపిన రోహిత్‌.. చివరి బంతిని సిక్సర్‌గా మలిచాడు. 2 ఓవర్లకు ముంబయి 19/0 స్కోరుతో ఉంది. రోహిత్‌ శర్మ (16), ఇషాన్‌ కిషన్‌ (2) క్రీజులో ఉన్నారు. 


నంబర్‌ 1 Vs నంబర్‌ 10.. టాస్‌ గెలిచిన గుజరాత్

టీ20 లీగ్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌తో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబయి జట్టు మరికాసేపట్లో తలపడనుంది. టాస్‌ గెలిచిన గుజరాత్.. తొలుత బౌలింగ్‌ చేయాలని నిర్ణయించుకుంది. ఇక జట్ల విషయానికొస్తే.. హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీలో గుజరాత్ టాప్‌ గేర్‌లో దూసుకుపోతోంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో కేవలం రెండింటిలోనే ఓడి ప్లే ఆఫ్స్‌  బెర్త్‌ని ఖాయం చేసుకుంది. రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉన్న ముంబయి జట్టు ఈ సారి ఆశించిన మేరకు రాణించడం లేదు. ఆడిన 9 మ్యాచ్‌ల్లో ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. అగ్రస్థానంలో ఉన్న గుజరాత్‌ గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించాలని ముంబయి భావిస్తోంది.

ముంబయి జట్టు:

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, కీరన్ పొలార్డ్‌, డానియల్ సామ్స్‌, మురుగన్‌ అశ్విన్‌, కుమార్‌ కార్తికేయ, జస్ప్రీత్‌ బుమ్రా, రిలె మెరిడిత్.

గుజరాత్ జట్టు:

శుభమన్‌ గిల్, వృద్ధీమాన్‌ సాహా, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్య (కెప్టెన్‌), డేవిడ్ మిల్లర్‌, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్‌, అల్జరీ జోసెఫ్‌, ప్రదీప్‌ సాంగ్వాన్, ఫెర్గూసన్, మహ్మద్‌ షమి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని